అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఆరోపణల్లో నిజం లేదు: కేంద్ర హోంశాఖ

|

Sep 30, 2020 | 6:25 PM

భారత్‌లో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ప్రకటించింది.

అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఆరోపణల్లో నిజం లేదు: కేంద్ర హోంశాఖ
Follow us on

భారత్‌లో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ప్రకటించింది. దేశవ్యాప్తంగా తమ బ్యాంక్‌ ఖాతాలను అధికారులు స్తంభింపచేశారని.. ఈ పరిస్థితుల్లో భారత్‌లో పనిచేస్తున్న తమ సంస్థ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే భారత్ లో ప్రచార, పరిశోధన కార్యక్రమాలను నిలిపేయడం తప్ప తమకు మరో మార్గం లేదని వెల్లడించింది భారత ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తూ, వేధింపులకు పాల్పడుతోందని అమ్నెస్టీ సంస్థ సఆరోపించింది.

అయితే, అమ్నెస్టీ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. ప్రభుత్వ కక్షసాధింపుల కారణంగా భారత్‌లోని తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ చెప్పడాన్ని కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. మానవహక్కులను సాకుగా చూపించి.. దేశంలోని చట్టాలను ఉల్లంఘిస్తామంటే కుదరదని స్పష్టం చేసింది. అమ్నెస్టీకి విరాళాలిచ్చిన ఓ ప్రైవేటు సంస్థకు విదేశాల నుంచి ఎక్స్‌పోర్ట్స్‌ ప్రొసీడ్స్‌ కింద వచ్చిన అనుమానాస్పద రూ.51 కోట్లపైనే మాత్రమే ఈడీ దర్యాప్తు చేస్తోందని .. ఆ ఖాతాలను మాత్రమే స్తంభింపచేశామని పేర్కొంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నుంచి అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ తప్పించుకోవాలని చూస్తోందని పేర్కొంది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద విరాళాల సేకరణకు అమ్నెస్టీకి అనుమతి లేదని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది.