మత మార్పిడుల నిరోధక బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఉత్తర ప్రదేశ్ తరువాత ఈ విధమైన చట్టాన్ని తెచ్చిన రెండో రాష్ట్రమైంది. ఈ బిల్లును మూజువాణీ ఓటుతో ఆమోదించినట్టు రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఇది చట్టమైతే నిందితులకు గరిష్టంగా 10 ఏళ్ళ జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తామన్నారు. వారితో బాటు ఇందుకు బాధ్యులైనవారు కూడా శిక్షార్హులే అని స్పష్టం చేశారు. ‘ధర్మ స్వాతంత్య్ర ( మత స్వేచ్ఛ) బిల్లు-2020 పేరిట ఈ బిల్లును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ సమావేశానికి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించారు. కొత్త బిల్లులోని నిబంధనల ప్రకారం-బలవంతంగా మత మార్పిడిలు చేసినవారికి 1 నుంచి 5 ఏళ్ళ జైలు శిక్ష, 25 వేల రూపాయల జరిమానా విధిస్తారు. కన్వర్ట్ అయిన వ్యక్తులు ఎస్సీ, లేదా ఎస్టీ అయి ఉంటే ఇందుకు బాధ్యులైనవారికి రెండు నుంచి 10 ఏళ్ళ జైలు శిక్ష, లక్ష రూపాయల ఫైన్ తప్పదు. బలవంతపు మత మార్పిడులకు పాల్పడేవారిని , సాక్ష్యాలను తారుమారు చేసేవారిని తాము సహించే ప్రసక్తి లేదని సీఎం చౌహాన్ ఇటీవల హెచ్ఛరించారు.
యూపీలో ఈ విధమైన చట్టం తెచ్చిన అనంతరం పలు బలవంతపు మత మార్పిడుల కేసులు వెలుగులోకి వచ్చాయి. నిన్న యూపీలోని బిజ్నూర్ లో లవ్ జిహాద్ పేరిట దాఖలైన కేసులో పోలీసులు ఇద్దరు యువకులను అరెస్టు చేశారు.