సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని ఆధిక్యంతో మరోసారి అధికారంలోకి రావడంలో నరేంద్ర మోదీ హవా ఎంత ప్రభావం చూపించిందో.. అలాగే బీజేపీ జాతీయాధ్యక్షుడు, అపర చాణక్యుడు అమిత్ షా వ్యూహాలు కూడా పార్టీ విజయానికి బాటలు వేశాయి. మోదీ-అమిత్ షా ద్వయం బీజేపీకి కొండంత బలమనే చెప్పాలి. ఇకపోతే ఇప్పుడు వీరిద్దరూ కొత్త కేబినెట్‌లో కలిసి పనిచేయబోతున్నారు. గతంలో అమిత్ షాను రాజస్థాన్, యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ప్రతిపాదించాలని మోదీ ప్రయతించినా.. అమిత్ షా మాత్రం బీజేపీని దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరించడమే లక్ష్యమంటూ పార్టీ పటిష్ఠతపైనే దృష్టి పెట్టారు.
మరోవైపు అమిత్ షా ఈ ఎన్నికల్లో గాంధీనగర్ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. అంతేకాదు ఆయనకు కొత్త కేబినెట్‌లో హోం మంత్రి పదవి కూడా దక్కింది. అయితే పార్టీ అధ్యక్షుడిగా వ్యూహాత్మక ప్రణాళికలు రచించడంలో అపర చాణక్యుడిగా పేరుగాంచిన అమిత్ షాను కేబినెట్‌లోకి తీసుకురావడంతో పార్టీ వర్గాల్లో కూడా చర్చకు దారి తీసింది. ఇది ఇలా ఉంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆర్ఎస్ఎస్ సూచనలు మేరకు అమిత్ షాను కేబినెట్‌లోకి నెంబర్ 2 గా హోం మంత్రి హోదా ఇచ్చారని ఢిల్లీ వర్గాల సమాచారం.
ఇకపోతే ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్రమోదీ వయసు 68 సంవత్సరాలు.. మరో ఎన్నికలు వచ్చే సమయానికి ఆయన వయసు దాదాపు 73 సంవత్సరాలు ఉంటుంది. దీనితో ఆయన ఈ టర్మ్ కాకుండా మరో టర్మ్ మాత్రమే పని చేసే అవకాశం ఉండవచ్చు. అటు అమిత్ షా వయసు 55 సంవత్సరాలు కాబట్టి.. నెంబర్ 2గా హోం మంత్రి పదవితో పాలనపై పట్టు సాధించడమే కాకుండా మోదీకి సరైన సలహాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. దీంతో ఆయనకు అనుభవం కూడా పెరుగుతుందని.. భవిష్యత్తు అవసరాల దృష్టిలో పెట్టుకునే ఈవిధంగా ప్రణాళికలు సిద్ధం చేశారని పార్టీ వర్గాలు అంటున్నాయి.