ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో తహశీల్ధార్ కార్యాలయాలే లక్ష్యంగా అవినీతి నిరోధక శాఖ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. తహసీల్దార్ కార్యాలయాలపై పలు ఫిర్యాదులు రావడంతో సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తహసీల్దార్ కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, విశాఖ జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు. ఎమ్మిగనూరు, ఇబ్రహీంపట్నం, రాజుపాలెం, ఉలవపాడు, కూడేరు, కశింకోట తహశీల్దార్ కార్యాలయాల్లో రికార్డుల పరిశీలించారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం తహశీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు జరిగాయ్. తహశీల్దార్ చంద్రశేఖర్‌నాయుడు కారులో రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ తహశీల్దార్ కారులో లక్షరూపాయలు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. అనధికార నగదును దాచేందుకు యత్నించి తహశీల్దార్ పట్టుబడ్డారు. తహశీల్దార్, సిబ్బందిని అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. అటు విశాఖజిల్లా కశింకోట రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. రికార్డులను పరిశీలించారు.