పీఎఫ్‌పై 8.65శాతం వడ్డీ ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సుముఖంగా ఉందన్నారు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్. 2018-19 ఆర్థిక సంవత్సరానికిగానూ ఉద్యోగ భవిష్యనిధి డిపాజిట్లపై వడ్డీని 8.65 శాతంగా నిర్ణయిస్తూ కార్మిక మంత్రిత్వశాఖ ప్రకటన వెలువరించబోతున్నట్టు ఆయన చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టు తెలిపారు మంత్రి గంగ్వార్. కేంద్రం నిర్ణయంతో ఆరుకోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు లబ్ది చేకూరబోతుందని మంత్రి తెలిపారు.
ఇదిలా ఉంటే ఫిబ్రవరి నెలలో మంత్రి సంతోష్ గంగ్వార్ నేతృత్వంలో ఈపీఎఫ్‌వో కేంద్ర ధర్మకర్తల మండలి సమావేశమై వడ్డీ పెంచేందుకు ఆమోదం తెలిపారు. మండలి చేసిన ప్రతిపాదనలు ఆర్ధిక శాఖను పంపారు. దీనిపై ఆర్ధిక సేవల విభాగం(డీఎఫ్ఎస్) ఏప్రిల్‌లో (2018-19)సంవత్సరానికి పీఎఫ్‌పై 8.65శాతం వడ్డీ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇక కార్మిక శాఖ, ఆదాయ పన్నుశాఖలు సంయుక్తంగా నోటిఫై చేయాల్సి ఉంది. దీని తర్వాత సంస్ధ చందాదారుల ఖాతాలో వడ్డీని జమ చేయనుంది. అయితే 2017-18 సంవత్సరానికి పీఎఫ్ వడ్డీరేటును ఐదేళ్ల కనిష్ఠానికి తగ్గించారు. ఖాతా దారులకు ప్రస్తుతం 8.55శాతం వడ్డీనే లభిస్తోంది.