భారత్ లో కోవిద్ 19 విజృంభణతో వాణిజ్య, ఉత్పాదక కార్యకలాపాలు స్తంభించాయి. పలు కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరుతున్నాయి. ఈ క్రమంలో కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు దేశంలో మరో పది ప్రైవేటు ల్యాబ్‌లకు బయో మెడికల్ పరిశోధనల సాధికార సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అనుమతి లభించింది. దీంతో భారత్‌లో కరోనా నిర్ధారణ పరీక్షకు అధికారిక అనుమతి గల ప్రైవేటు ల్యాబ్‌ల సంఖ్య 16కు పెరిగింది. వీటిలో దేశ రాజధాని ఢిల్లీలో 3, గుజరాత్‌లో 2, హరియాణాలో 2, కర్ణాటకలో 1, మహారాష్ట్ర 5, తమిళనాడులో 2 ఉండగా…. తెలంగాణాలో జూబ్లీ హిల్స్ వద్దనున్న అపోలో హాస్పిటల్స్‌కు కూడా ఈ అనుమతి లభించింది.
భారత్ లో కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. మరోవైపు, కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలకు వసూలు చేయవలసిన అత్యధిక మొత్తం రూ.4,500గా కేంద్రం ప్రకటించింది. దీనిలో రూ.1500 స్క్రీనింగ్ పరీక్ష నిమిత్తం, రూ.3,000 నిర్ధారణ పరీక్ష కోసం అని ఓ ప్రకటనలో వివరించింది. ఈ నిబంధనను పాటించని సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని కూడా కేంద్రం హెచ్చరించింది. ఇక తాజా సమాచారం ప్రకారం కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 195 దేశాల్లో 3,81,739 కాగా మృతుల సంఖ్య 16,558 గా ఉంది. ఇక భారత్ విషయానికి వస్తే… కరోనా పాజిటివ్‌గా తేలినవారి సంఖ్య 500, మృతులు 10 మంది అని తెలుస్తోంది.