Australia Vs India: రోహిత్ శర్మ, శార్దూల్ ఠాకూర్ ఇన్.. హనుమ విహారి, ఉమేష్ యాదవ్ ఔట్.?
India Vs Australia 2020: మెల్‌బోర్న్ టెస్టు విజయంతో ఊపుమీద ఉన్న టీమిండియా మూడో టెస్టుకు సన్నద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే దాదాపుగా..

India Vs Australia 2020: మెల్‌బోర్న్ టెస్టు విజయంతో ఊపుమీద ఉన్న టీమిండియా మూడో టెస్టుకు సన్నద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే దాదాపుగా తుది జట్టును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తొలి రెండు టెస్టుల్లో విఫలమైన హునమ విహారి స్థానంలో రోహిత్ శర్మ, పిక్క గాయంతో సిరీస్ నుంచి వైదొలిగిన ఉమేష్ యాదవ్ ప్లేస్‌లో శార్దూల్ ఠాకూర్‌ను బరిలోకి దింపనున్నట్లు సమాచారం. అటు మయాంక్ అగర్వాల్ స్థానంలో కేఎల్ రాహుల్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయట.
ఇదిలా ఉంటే ఉమేష్ స్థానంలో మొదట నటరాజన్‌ను తీసుకోనున్నారని వార్తలు వినిపించినా.. అతడు కేవలం ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ మాత్రమే ఆడటంతో.. శార్దూల్ ఠాకూర్ వైపు జట్టు యాజమాన్యం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ముంబై జట్టు తరపున శార్దూల్ దేశవాళీలలో రెగ్యులర్ బౌలర్ కావడమే ఇందుకు కారణమని సమాచారం. అయితే దీనిపై తుది నిర్ణయం మాత్రం కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ అజింక్య రహనే, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కలిసి తీసుకుంటారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇప్పటిదాకా 62 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన శార్దూల్ 206 వికెట్లు తీశాడు. అటు బ్యాట్స్‌మెన్‌గా కూడా ఠాకూర్ జట్టుకు ఉపయోగపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫైనల్ జట్టుపై అధికారిక ప్రకటన రెండు మూడు రోజుల్లో వచ్చే ఛాన్స్ ఉంది. కాగా, జనవరి 7 నుంచి సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, ఇండియా మధ్య మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.