అందరికీ ఆయన రాజుల వారసులుగా, ఓ యువ ఎమ్మెల్యేగా మాత్రమే తెలుసు. కానీ ఆయనలో మనకి తెలియని మరో కోణం తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు..! నాడు ఆయన పూర్వీకులకు భయంకరమైన వన్యమృగాలు, పులులు, సింహాలను వేటాడటం హాబీ. అయితే ఇప్పుడు ఆ రాజుల వారసుడు అదే పులులను దశాబ్దాలుగా సంరక్షిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. . ఇంతకీ అసలు ఎవరా రాజుల వారసులు? వారి హిష్టరీ ఏంటి? ఆ ఎమ్మెల్యే ఎక్కడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అని అనుకుంటున్నారా? అయితే ఆయన కోసం తెలుసుకోవాల్సిందే..!
సహజంగా పులులు, సింహాలు అంటే అందరికీ భయం. కానీ ఆయనకు మాత్రం పులులంటే ఇష్టం. ఆ పులులతో రోజుల కొద్దీ గడుపుతారు. అరుదైన పులుల కోసం అభయారణ్యంలో కూడా పర్యటిస్తారు. పులుల కోసం ఇప్పటివరకు అనేక భయంకర అటవీ ప్రాంతాలను సందర్శించారు. ఆయన ఎవరో కాదు.. రంగరావు ప్రస్తుత బొబ్బిలి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
బొబ్బిలి సంస్థానం అంటే తెలియని వారు ఉండరు. చరిత్రలో బొబ్బిలికి ఒక అరుదైన స్థానం ఉంటుంది. వారి శౌర్యపరాక్రమాలు గురించి చెప్పనవసరం లేదు. 1757 సంవత్సరంలో విజయనగరం గజపతిరాజులకు, బొబ్బిలి రాజులకు మధ్య హోరాహోరీగా సాగిన బొబ్బిలి యుద్ధం ఈ తరం వారిని సైతం గగుర్పాటుకు గురిచేస్తుంది. ఆ యుద్ధంలో బొబ్బిలి రాజుల తెగింపు, త్యాగాలు చరిత్ర పుటల్లో నిలిచిపోయాయి. నాటి బొబ్బిలి రాజులకు అడవుల్లో వేటాడటం అంటే ఎంతో సరదా. భయంకరమైన మృగాలను సైతం బంధించడం ఇష్టం. నాడు రాజులు వేటకు వాడిన తుపాకులు ఇప్పటికీ బొబ్బిలి కోటలోనే మ్యూజియంలో కనిపిస్తాయి.
అయితే ఇప్పుడు వారి వారసులు అయిన సుజయ్ కృష్ణ రంగారావు బొబ్బిలి నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా వ్యవహరించగా, ఆయన సోదరుడు ఆర్.వి.ఎస్.కె.కె. రంగరావు ప్రస్తుత బొబ్బిలి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆర్ వి ఎస్ కె కె రంగరావు అంటే స్థానికంగా ఎవరికి తెలియదు. ఈయన బేబీనాయనగానే అందరికీ ఫేమస్. బొబ్బిలి రాజులు రాజరికంలో ఎంత గంభీరంగా ఉండేవారో రాజకీయాల్లో కూడా అంతే హుందాగా వ్యవహరిస్తారు.
నిత్యం ప్రజాసేవలో ఉండే బొబ్బిలి యువరాజు, ఎమ్మెల్యే బేబీనాయనకు పులులు అంటే ఇష్టం. వాటిని చూసి మైమరచిపోతుంటారు. వాటి కోసం వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటారు. రోజుల తరబడి అడవుల్లోనే గడుపుతారు. అలా ఆయన వెళ్లిన ప్రతి ప్రదేశాన్ని, కనిపించిన పులులను ఇతర వన్యప్రాణులను తన కెమెరాల్లో బంధిస్తారు. అలా ఇప్పటివరకు సుమారు యాభై వేలకు పైగా ఫోటోలు తీశారు. పులులను అతికొద్ది దగ్గర నుండి చూసి తన కెమెరాల్లో బంధిస్తారు. పులులను ట్రాక్ చేయడం బేబీనాయనకు ఇష్టం. ఇప్పటివరకు 300 పులులను అతి దగ్గర నుండి చూసి వాటిని తన కెమెరాతో షూట్ చేశారు. వీరి పూర్వీకులు గన్ తో పులులను షూట్ చేస్తే ఈయన అందుకు భిన్నంగా కెమెరా తో షూట్ చేసి ముచ్చట పడుతుంటారు.
ఈయన తీసే ఫోటోలు డిస్కవరీ ఛానల్ ను తలదన్నేలా ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ఈయన ఫోటోలు తీసేందుకు సుమారు ఇరవై లక్షల విలువైన హై అండ్ టెక్నాలజీ కెమెరాలు వాడతారు. బేబీనాయన దాదాపు ప్రతినెలా టైగర్ ట్రాకింగ్ కి వెళ్లి వాటిని చూసి ఫోటోలు తీసి మురిసిపోతుంటారు. ఈయన ఇప్పటివరకు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో పాటు సౌత్ ఇండియాలోనే దాదాపు అన్ని అభయారణ్యాల్లో పర్యటించారు. ఇందుకోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. అంతేకాకుండా సొంత నిధులు ఎంతో వెచ్చించి పులులు సంరక్షణ కోసం ఏళ్ల తరబడి కృషి చేస్తున్నారు.
ఇటీవల అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా అమరావతిలో అటవీశాఖ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో బేబీనాయన తీసిన ఫోటోలను ప్రదర్శించారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్, బేబీనాయన తీసిన అరుదైన ఫోటోలు చూసి ఆశ్చర్యపోయారు. ఎలా తీస్తారు? ఎక్కడ తీశారు? ఎప్పటి నుండి తీస్తున్నారు? ఎందుకు మీకు అంత ఇష్టం? అనే అనేక రకాల అంశాల పై ఆరా తీశారు. ఈ సందర్భంగా బేబీ నాయన పులుల సంరక్షణ కోసం చేస్తున్న కార్యక్రమాలు తెలుసుకుని ప్రశంసించారు. బేబీనాయనకు, పులులతో పాటు ఇతర వన్యప్రాణుల పై ఉన్న ప్రేమను తెలుసుకొని ఇప్పుడు ఆయన పై విజయనగరం జిల్లావాసులు మరింత అభిమానం పెంచుకుంటున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..