World Sparrow Day: హైదరాబాద్‌లో పిచ్చుకలు ఎందుకు కనిపించడం లేదు..?

|

Mar 20, 2025 | 6:15 PM

మార్చి 20.... వరల్డ్ స్పారో డే. అంటే ప్రపంచ పిచ్చుకల దినోత్సవం. హైదరాబాద్‌ మహా నగరంలో మనకు పిచ్చుకలు కనిపించడమే మానేశాయి. చిన్నప్పుడు మనల్ని రోజూ పలకరించిన ఈ చిన్న చిన్న పక్షులు, ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు అంటే బోలెడు కారణాలు ఉన్నాయి. మనుషులు సృష్టించిన విష వలయంతో..బుల్లి పిట్ట బతికేదెట్టా?

World Sparrow Day: హైదరాబాద్‌లో పిచ్చుకలు ఎందుకు కనిపించడం లేదు..?
Sparrows
Follow us on

మీరు హైదరాబాద్‌లో ఉంటున్నారా? మీ ఇంటికి బాల్కనీలు ఉన్నాయా? అక్కడ పూల మొక్కలవీ పెంచుతున్నారా? అయితే వాటిలో అప్పుడప్పుడు నాలుగు ధాన్యపు గింజలు చల్లండి. అవి మొక్కలుగా పెరిగి కంకులు వేస్తే… బుజ్జి పిచ్చుకలు ఎగురుకుంటూ వచ్చి మీ పెరట్లో సందడి చేస్తాయి. మీ ఉదయాలను ఆహ్లాదభరితం చేస్తాయి. మొక్కలు పెంచడం సాధ్యం కాదనుకుంటే రెడీమేడ్‌ బర్డ్‌ ఫీడర్లు బోలెడు దొరుకుతున్నాయి. అనువుగా ఉన్నవి తెచ్చి ప్రహరీ గోడకు అమర్చండి. పనిలో పనిగా ఎక్కడో ఓ పక్కన కొంచెం చోటు చూసి ఒక చిన్న పక్షి గూడు పెట్టండి. లేదా అవే వచ్చి గూడు కట్టుకునే వాతావరణం కల్పించండి.

అవును… ఆ వాతావరణం లేకే పిచ్చుకలు మనకి దూరమవుతున్నాయి. అవి ఉండటానికి సురక్షితమైన చోటు దొరక్క, తినడానికి తిండి దొరక్క, పెద్ద పక్షుల ధాటికి తట్టుకోలేక పిచ్చుకల సంఖ్య నానాటికి తగ్గిపోతోంది. వీటన్నిటికీ తోడు మొబైల్‌ టవర్ల రేడియేషన్‌ వాటికి ప్రమాదఘంటికలు మోగిస్తోంది. ఇవాళ మార్చి 20. అంటే ప్రపంచ పిచ్చుకల దినోత్సవం. అంతరించిపోతున్న పిచ్చుకలను కాపాడేందుకూ, ప్రజల్లో అవగాహన పెంచి చైతన్యం తేవడానికీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇప్పుడు నగరాల్లోనే కాదు, పట్టణాల్లోనూ పల్లెల్లోనూ అందరికీ పక్కా ఇళ్లు వచ్చాయి. దాంతో పిచ్చుకలు ఇళ్లు లేనివయ్యాయి. పొలాల్లో రసాయన పురుగుమందుల వాడకం పిచ్చుకల ఆరోగ్యానికీ హానికరంగా మారింది. అంత చిన్నపిచ్చుకలతో మనకేంటీ అవసరం అన్న సందేహం రావచ్చు కొందరికి. వాటి అవసరం మనకు చాలా ఉంది. క్రిమికీటకాలను తింటూ.. అవి సహజ క్రిమిసంహారకాలుగా పనిచేస్తాయి. ఆహారం కోసం అన్వేషణలో మొక్కల మధ్య తిరుగుతూ పరోక్షంగా పరాగసంపర్కానికి తోడ్పడతాయి. జీవవైవిధ్యానికి, పర్యావరణానికి మేలుచేస్తాయి. రోగాల వ్యాప్తిని అరికడతాయి. పిచ్చుకలే లేకపోతే మన పర్యావరణ వ్యవస్థ పూర్తిగా తలకిందులవుతుంది. ఒకప్పుడు చైనా వాటిని లేకుండా చేసి పెద్ద గుణపాఠం నేర్చుకుంది. చేజేతులా కరువును కొనితెచ్చుకుని కొన్ని కోట్లమంది ప్రాణాలు పోయేందుకు కారణమైంది. అలాంటి పరిస్థితి మన దేశంలో తలెత్తకుండా ఉండాలంటే…సేవ్‌ స్పారో. పిచ్చుకలను కాపాడుకుందాం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి