
2014లో 70 రూపాయలున్న పెట్రోల్ ధర, 50 చిల్లర ఉన్న డీజిల్ ధరలు.. ఇప్పుడు అమాంతం భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో మినహా ఆయా రాష్ట్రాల్లో రూ. 110 పైగా కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్ మాదిరిగానే.. ఎల్‌పీజీ ధరలు కూడా భారీగా పెరిగాయి. 2014 లో 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు ఏకంగా రూ. 1200 లకు చేరింది. అయితే, ఈ పెరిగిన ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు కాస్త ఊరటనిస్తూ.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్‌పీజీ ధరను రూ. 200 తగ్గించింది. అయితే, ఈ తగ్గింపు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు మాత్రమే అందనుంది.
వంట గ్యాస్ ధరను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ రేట్లను కూడా తగ్గించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ప్రధాన పండుగల సమయంలో గానీ, ఎన్నికల ముందు గానీ.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
ఇదిలాఉంటే.. గ్యాస్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ద్రవ్యోల్బణం రేటు 30 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్ నెలలో టమాటా ధరలు భారీగా తగ్గే అవకాశం ఉండటం, దీని కారణంగా ఇప్పటి వరకు పెరిగిన ద్రవ్యోలబ్బణం రేటు 6 శాతానికి దిగనుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. జులైలో ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. రిటైల్ ధరలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా అవసరమైన చర్యలు తీసుకుంటోంది.
ఆహార ధరలను తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణం నుండి సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గత కొన్ని రోజులుగా, ప్రభుత్వం బియ్యం, గోధుమలు, ఉల్లి, ఇతర ధాన్యాల ఎగుమతిని నిషేధించింది. తద్వారా పెరుగుతున్న ధరల నుండి ఉపశమనం పొందవచ్చు.
ఈ ఏడాది చివరి త్రైమాసికంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ వెంటనే 2024 ప్రారంభంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఇలాంటి పరిస్థితిలో, రాబోయే కాలంలో అన్నింటి రేట్లు తగ్గించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గిస్తారని అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయంగా ముడిచమురు ధరల్లో అస్థిరత ఉన్నప్పటికీ, పెట్రోల్, డీజిల్ ధరలు ఏడాదికి పైగా మారలేదు. గతంలో ఓసారి ఎక్సైజ్ సుంకం తగ్గించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు మరోసారి ధరలు తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదేజరిగితే.. వాహనదారులకు మరికొంత ఊరట లభించే అవకాశం ఉంది.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..