పూర్తిగా వేసవికాలం మొదలు కానేలేదు.. మార్చి ప్రారంభంలోనే తాగునీటి ఎద్దడి నెలకొంది. ప్రాజెక్టుల్లోని నీరు అడుగంటుతున్నాయి.. దీంతో భూగర్భజలాలు మట్టానికి పడిపోయాయి.. బోర్లు ఉన్నా ఫలితం లేదు.. దీంతో పలు ప్రాంతాల్లోని ప్రజలు నీటి కోసం తంటలు పడుతున్నారు.. తాగునీటి కోసం ప్రజలు ట్యాంకర్ల చుట్టూ తిరుగుతున్నారు.. ఒక్కో బాటిల్ ధర రూ.50 మేర ఉంది.. అదే బిందెలో నీరు పట్టుకోవాలంటే.. రూ.25కి పై మాటే.. ఒక్కొక్కరికి బిందె మాత్రమే.. మళ్లీ దాని కోసం సెక్యూరిటీ గార్డులతో పర్యవేక్షిస్తున్నారు. కొన్ని సోసైటీల్లో అయితే.. ఏకంగా నీటిని వృధా చేస్తే రూ.5000 ఫైన్ అంటూ అక్కడి నివాసితులకు సర్క్యూలర్ సైతం జారీ చేశాయి.. ఇదంతా కూడా ఎక్కడో కాదు.. మన దేశంలోని సిలికాన్‌వ్యాలీ సిటీ బెంగళూరులోని మాట.. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో.. వీటిని బట్టి అర్ధం చేసుకోవచ్చు.. అయితే.. నీటి ఎద్దడి తెలంగాణలో కూడా మొదలైంది.. ప్రాజెక్టుల్లోని నీరు అడుగంటిపోతుండటంతో.. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.. అందరికీ.. తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగితే.. మున్ముందు మరింత తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే అవకాశముందని తెలుస్తోంది.
మండుటెండలు ప్రారంభమైతే.. ఏప్రిల్, మే, జూన్ లో తాగునీటి కష్టాలు తప్పవంటూ పలువురు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం తాగునీటికే ప్రాజెక్టుల్లోని నీరు ఉపయోగించాలని.. తాగునీటి సరఫరా కోసం ట్యాంకర్లను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కృష్ణా, గోదావరి బ్యారేజీల్లో ఉన్న నీటి మట్టాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కోరారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం ఎల్లంపల్లి నుంచి పరిమిత పరిమాణంలో వినియోగించుకోవాలని సూచించారు.
కాగా.. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని ఎండాకాలంలో నీటిఎద్దడి లేకుండా తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అంతేకాకుండా.. జనం కూడా ప్రస్తుత పరిస్థితులను అర్ధం చేసుకుని.. ఆదా చేయడానికి మార్గాలను అనుసరించాలి.. లేకపోతే మున్ముందు మరిన్ని తీవ్రమైన పరిస్థితులు అనుభవించక తప్పదు.. భవిష్యత్తులో కొరతను దృష్టిలో ఉంచుకుని.. రాబోయే కాలంలో దీనిని నివారించేందుకు నీటి సంరక్షణ చాలా ముఖ్యం..
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..