సమయానికి కట్నం డబ్బులు ఇవ్వలేదనో, మర్యాదలు తక్కువ అయ్యాయనో, రకరకాల కారణాలతో కొందరు పెళ్లి కొడుకులు.. పెళ్లి పీఠలపైనే పెళ్లిని క్యాన్సిల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇదే కట్న కానుకల విషయంలో వధువు తన పెళ్లిని క్యాన్సిల్ సందర్భాలు ఎప్పుడైనా చూశారా? లేదంటే ఇప్పుడు చూసేయండి. అవును.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ దేహత్‌లో విచిత్ర ఘటన వెలుగు చూసింది. వరుడు తనకు బంగారం, బహుమతులు తక్కువగా ఇచ్చాడని ఆరోపిస్తూ.. పీఠల మీద పెళ్లిని క్యాన్సిల్ చేసేసింది పెళ్లి కూతురు. దాంతో లబోదిబోమంటూ ఆ వరుడు పోలీసులను ఆశ్రయించాడు. ఎలాగైనా తమ పెళ్లి జరిగేలా చూడాలని పోలీసుల ఎదుట ప్రాధేయపడ్డాడు. మరి పోలీసులు ఏం చేశారు? ఆ తరువాత ఏం జరిగింది?
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. బన్వారీ గ్రామానికి చెందిన శ్యామ్ నారాయణ్ కుమార్తె వివాహం మన్పూర్ గ్రామానికి చెందిన లాలా రామ్ కుమారుడితో నిశ్చయమైంది. ఈ వివాహం ఎలాంటి కట్నం లేకుండా జరగాల్సి ఉంది. పెళ్లి రోజున వరుడి కుటుంబ సభ్యులు ఊరేగింపుగా రాగానే అమ్మాయిలు ఆడపడుచులకు ఘనంగా స్వాగతం పలికి వరుడు కృష్ణ మురారిని తీసుకెళ్లారు. అనంతరం ద్వారపూజ, జైమల్లు జరిగాయి. అంతా బాగానే ఉంది, కానీ మరో క్రతువులో పెళ్లి కూతురు కూడా పాల్గొనాల్సి ఉంది. అప్పుడే ఆమె బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఆ క్రతువులో పాల్గొనడానికి నిరాకరించింది. ఎందుకంటే..?
ఆ క్రతువులో పాల్గొనాలాటే తనకు బంగారం, బహుమతులు ఇవ్వాలని డిమాండ్ చేసింది వధువు. అవి ఇవ్వకపోతే ఎలా ఊరేగింపుగా వచ్చారో అలాగే తిరిగి వెళ్లండి అంటూ అల్టీమేటం ఇచ్చింది. తక్కువ నగలతో తాను పెళ్లి చేసుకోనని, పెళ్లి కావాలంటే నగలు ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేదంటే పెళ్లి ఊరిగేంపుతో తిరిగి వెళ్లిపోండి అని స్పష్టం చేసింది. దాంతో పెళ్లి కాస్తా అకస్మాత్తుగా ఆగిపోయింది. పెద్దలు ఆ అమ్మాయితో మాట్లాడిన ఫలితం లేకుండా పోయింది.
పెళ్లి కూతురు చర్యతో నిర్ఘాంతపోయిన వరుడు ఏం చేయాలో అర్థంకాక.. పోలీసులను ఆశ్రయించాడు. తన పెళ్లి జరిగేలా చూడాలని వేడుకున్నాడు. పోలీసులు కూడా చాలా ప్రయత్నించారు. కానీ, ఆ అమ్మాయి పెళ్లికి అంగీకరించలేదు. దాంతో చేసేదేమీ లేక పెళ్లి కొడుకు, అతని పరివారమంతా తిరిగి వెళ్లిపోయారు.
ఇదిలాఉంటే.. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనిపై కొందరు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. వరకట్నం డిమాండ్ చేసిన అబ్బాయిలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని, మరి అదే వరకట్నం డిమాండ్ చేస్తున్న అమ్మాయిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..