AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ దేశాన్ని మింగేస్తున్న సముద్రం.. 30 ఏళ్లలో మ్యాప్ నుంచే మాయం..

ప్రకృతి ప్రకోపానికి ఒక దేశం బలి కాబోతోందా? అవును.. పసిఫిక్ మహాసముద్రం నడిబొడ్డున ఉన్న అత్యంత అందమైన ద్వీప దేశం తువాలు ఇప్పుడు తన ఉనికిని కాపాడుకోవడానికి పోరాడుతోంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా పెరుగుతున్న సముద్ర మట్టాలు ఈ చిన్న దేశాన్ని క్రమక్రమంగా మింగేస్తున్నాయి. ఆ విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఆ దేశాన్ని మింగేస్తున్న సముద్రం.. 30 ఏళ్లలో మ్యాప్ నుంచే మాయం..
Tuvalu Country Will Disappear In 30 Years
Krishna S
|

Updated on: Mar 27, 2026 | 6:11 PM

Share

గ్లోబల్ వార్మింగ్, పెరుగుతున్న సముద్ర మట్టాల గురించి మనం పుస్తకాల్లో చదువుతుంటాం. కానీ ఒక దేశం కళ్లముందే సముద్రంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉందనే వార్త ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న చిన్ని ద్వీప దేశం తువాలు రాబోయే 30 నుంచి 50 ఏళ్లలో పూర్తిగా అదృశ్యమయ్యే ప్రమాదంలో ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నలువైపులా నీలిరంగు అలలతో చుట్టుముట్టి ఉండే ఈ దేశం కేవలం 25.14 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంది. వాటికన్ సిటీ తర్వాత ప్రపంచంలో అతి తక్కువ జనాభా ఉన్న రెండో దేశం ఇదే. ఈ దేశం సముద్ర మట్టానికి సగటున కేవలం 4.6 మీటర్ల ఎత్తులో మాత్రమే ఉంది. ఫలితంగా సముద్ర మట్టాలు స్వల్పంగా పెరిగి ఈ దేశం ఉనికికే ముప్పు వాటిల్లుతోంది.

వణికిస్తున్న గణాంకాలు

ఫునాఫుటి హైడ్రోమీటర్ నివేదిక ప్రకారం.. ఇక్కడ సముద్ర మట్టాలు సంవత్సరానికి 3.9 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతున్నాయి. ఇది ప్రపంచ సగటు కంటే రెండు రెట్లు ఎక్కువ. రాబోయే 100 ఏళ్లలో సముద్ర మట్టం మరో 20-40 సెంటీమీటర్లు పెరిగితే, ఇక్కడ మనుషులు జీవించడం అసాధ్యం. ఇప్పటికే తీర ప్రాంతాలు కోతకు గురై రెండు ద్వీపాలు నీట మునిగిపోతున్నాయి. 2015లో వచ్చిన పామ్ తుఫాను ఇక్కడ బీభత్సాన్ని సృష్టించింది. 45 శాతం జనాభా నిరాశ్రయులవ్వగా, 90 శాతం పంటలు నాశనమయ్యాయి. పెద్ద అలలు వచ్చినప్పుడు విమానాశ్రయం, రోడ్లు కూడా నీట మునిగిపోవడం ఇక్కడ నిత్యకృత్యంగా మారింది.

వింతైన ఆర్థిక వ్యవస్థ..

తువాలు ఆర్థిక వ్యవస్థ చాలా విభిన్నంగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు ప్రధానంగా చేపల వేటపై ఆధారపడతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ దేశానికి ఇంటర్నెట్ డొమైన్ .tv అమ్మకాల ద్వారా భారీగా ఆదాయం వస్తుంది. ప్రపంచంలోనే అతి తక్కువ మంది సందర్శించే దేశం ఇదే. 2019లో కేవలం 3,600 మంది పర్యాటకులు మాత్రమే ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పాలినేషియన్ సంతతికి చెందిన ప్రజలు నివసిస్తారు. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశం విడిచి వెళ్లే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండటం గమనార్హం.

డిజిటల్ దేశంగా అవతరణ?

దేశం భౌతికంగా మునిగిపోతుండటంతో తువాలు ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. తమ దేశ సంస్కృతిని, చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించడానికి మెటావర్స్‌లో తమ దేశాన్ని డిజిటల్ రూపంలో భద్రపరుచుకోవాలని భావిస్తోంది. అంటే భూమిపై దేశం లేకపోయినా డిజిటల్ ప్రపంచంలో తువాలు ఉనికి కొనసాగుతుందన్నమాట.

తువాలు ఎదుర్కొంటున్న ఈ విపత్తు కేవలం ఆ దేశ సమస్య మాత్రమే కాదు. ఇది ప్రపంచ దేశాలకు ఒక హెచ్చరిక. ప్రకృతిని మనం కాపాడుకోకపోతే, భవిష్యత్తులో మరిన్ని దేశాలు ఇలాగే మ్యాప్ నుండి మాయమయ్యే ప్రమాదం ఉంది.

Follow Us