అరుదైన పక్షి త్రివర్ణ మునియా ప్రకాశంజిల్లా మార్కాపురంలో కనిపించింది. ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపించకుండా పోతున్న జాతుల్లో ఒకటిగా ఉన్న త్రివర్ణ మునియా పక్షి మార్కాపురంలోని ఓ ప్రయివేటు ఇంజనీరింగ్ కళాశాలలో చెట్లపై కనిపించింది. అరుదైన పక్షి జాడను ఫారెస్ట్ సిబ్బందికి అందించడంతో దానిని గుర్తించారు. భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్‌లలో మాత్రమే కనిపించే అరుదైన జాతికి చెందిన త్రివర్ణ మునియా పక్షి మార్కాపురంలో కనిపించడంతో ఆశక్తిగా చూశారు.
త్రివర్ణ మునియా ప్రధానంగా ధాన్యం, ఇతర గింజలను తినే ఒక చిన్న పక్షి. ఇది తడి గడ్డి భూముల దగ్గర నివాసాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తుంది. ఈ పక్షి శరీరం మూడు రంగులను కలిగి ఉంటుంది. నలుపు, చెస్ట్‌నట్, తెలుపు రంగులను కలిగి ఉంటుంది. తమ ఆవాసాలను ఏర్పాటు చేసుకోవడంలో ఆడ, మగ పక్షులు రెండూ పాల్గొని పొదరిల్లు లాంటి గూడును నిర్మించుకుంటాయి. గూడులోకి ప్రవేశించడానికి ఒక చిన్న ద్వారం ఏర్పాటు చేసుకుని ఓవల్ అకారంలో ఎంతో ఆకర్షణీయంగా నిర్మిస్తాయి. ఇవి గూళ్లు నిర్మించుకునేందుకు మానవ నివాసాలకు దూరంగా ఉండేలా చూసుకుంటాయి. వీటి గుడ్లు కూడా ఓవల్ ఆకారంలో తెలుపు రంగులో ఉంటాయి. ఇవి గుడ్లు పొదిగే కాలం 12 నుండి 13 రోజుల వరకు ఉంటుంది. గుడ్లు పొదిగేందుకు ఆడ, మగ ఇద్దరూ కలిసి ఈ ప్రక్రియలో పాల్గొనడం విశేషం.
మార్కాపురంలో ప్రత్యక్షం…
ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఓ ప్రయివేటు ఇంజనీరింగ్ కళశాలలో ఈ త్రివర్ణ మునియా జంట పక్షులు కనిపించడంతో వాటిని గుర్తించి తన కెమెరాలో బంధించాడు ఫారెస్ట్ స్నేక్ రెస్య్యూవర్ నిరంజన్. తాను తీసిన ఈ జంట పక్షుల చిత్రాలను ఫారెస్ట్ అధికారులకు పంపించారు. వరి, చిరుధాన్యాలు పండే చిత్తడి నేలల్లో ఎక్కువగా కనిపించే ఈ జాతి పక్షులను వేటగాళ్లు పట్టి అమ్ముతుంటారు. ఇవి మూడు రంగుల్లో కనిపించే చిన్న చిన్న పక్షలు కావడంతో వీటిని తీసుకెళ్ళి పంజరాల్లో బంధించి తమ ఇళ్లల్లో అలంకరణ కోసం చాలా మంది వినియోగిస్తుంటారు. అయితే ఈ జాతి పక్షులు రానురాను కనుమరుగవుతుండటం పక్షి ప్రేమికులను ఆందోళనకు గురిచేస్తోంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..