Clay Competition: సాధారణంగా స్థిర, చరాస్తి కోసం రిజర్వ్ చేసుకుంటాం.. కొత్తగా వాహనం కొనుగోలు చేయాలంటే అడ్వాన్స్ బుక్(Advance Booking) చేసుకుంటాం.. కాని మట్టి కోసం పుట్టలు రిజర్వ్ చేసుకోవడం ఎక్కడైనా చూశారా..? వింటుంటే విచిత్రంగా ఉంది కదూ.. చూస్తే మీరే విస్తుపోతారు. పుట్టలను రిజర్వ్ చేసుకున్న ఈ సంఘటన జనగామ జిల్లా(Jangoan District)లోని లింగాలఘనపూర్ గ్రామంలో వెలుగు చూసింది.. పిడికెడు పుట్టమట్టి కోసం ఏకంగా పుట్టలను ముందే రిజర్వేషన్ చేసుకుంటున్నారు.
గత నెల 29 నుంచి ఈ గ్రామంలో ఇలవేల్పు పండుగ జరుగుతుంది.. గత దశాబ్ద కాలంగా ఈ ప్రాంతమంతా కరువుతో విలవిల్లాడేది.. ఈ క్రమంలో దేవాదుల కాలువ ద్వారా నీరు రావడంతో ఈ మధ్య కాలంలో ఈ ప్రాంతం శుభిక్షంగా మారింది. దీంతో లింగాలఘనపూర్ గ్రామంలోని ప్రతి గడపలో పండుగ జరుపుకుంటున్నారు. పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, మల్లన్న దేవుళ్ళకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు..
ఈ క్రమంలో వచ్చే నెల 2, 3వ తేదీలలో ఈ గ్రామంలో దుర్గమ్మ పండుగ జరుపుకునేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయా గ్రామా దేవతలకు వారి వారి సంప్రదాయాల ప్రకారం పట్నాలు వేసుకునే ఆచారం వుండటం, దానికి ప్రధానంగా కావాల్సిన పుట్టమన్నుకు గ్రామంలో ఫుల్ డిమాండ్ వుంది… గ్రామా పరిసర ప్రాంతంలో పుట్టలు కరవయ్యాయి.. దీంతో కొత్తవాటిని వెతికి ఆ పుట్టలను ముందే రిజర్వ్ చేసుకుంటున్నారు.. గ్రామంలో ప్రతిరోజు సుమారుగా ఇరవై, ముప్పయ్ ఇళ్లల్లో పండుగ, పట్నాలు వేసుకుంటుండగా పుట్టల దగ్గరికి వెళ్తే ఎవరో వచ్చి సేకరించుకోవడం పరిపాటిగా మారింది. దీంతో గ్రామస్తులకొచ్చిన ఆలోచన పుట్టలను రిజర్వ్ చేసుకోవడం. ముందుగా ఎవరు రిజర్వ్ చేసుకుంటారో వారు మట్టి తీసుకుపోవచ్చు. ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు తమ పేర్లు కల్గిన బోర్డులను రాసి అక్కడ పాతిపెడుతున్నారు. మట్టి కోసం పుట్టలు ముందే రిజర్వ్ చేసుకోవడంతో ఎలాంటి మనస్పర్ధలు, గొడవలు లేకుండా వున్న వాటిని ప్రతి ఒక్కరు సర్దుకుంటున్నారు.