వేట షురూ.. తొలకరి జల్లులతో కొండ కోనల్లో వెదుకులాట ప్రారంభమైంది. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సద్ది మూటలతో కొండ బాట పడుతున్నారు. కోహినూర్ అంత కాకపోయిన, కనీసం పదో వంతు వజ్రమైనా తమ కంట పడకపోతుందా అని జల్లెడ పడుతున్నారు. వారికి వీరికి దొరికిందన్న మాట చెవిన పడగానే తిరునాళ్లకు వెళ్లినట్లు తరలి వెళ్తున్నారు మిగిలిన జనం.
అదేమీ కృష్ణా నది తీర ప్రాంతమేమీ కాదు.. కోహినూర్ వజ్రం దొరికిన చోటు అంతకంటే కాదు. అయినా ఆ కొండను స్థానికులతో పాటు ఇతర ప్రాంత వాసులు జల్లెడ పడుతున్నారు. అది పల్నాడు జిల్లా నకరికల్లు మండలం శ్రీరాంపురం కొండ ప్రాంతం. పొద్దున్నే క్యారేజ్ లో అన్నం తీసుకుని మరీ మహిళలు ఆ కొండ ఎక్కుతున్నారు. ఉదయాన్నే ప్రారంభమయ్యే వేట సూర్యుడు అస్తమించే వరకూ కొనసాగుతోంది. ఇక్కడ కొండల్లో వజ్రాలు దొరుకుతున్నాయన్న వార్తలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.
ఈ ముచ్చట ఇక్కడ.. అక్కడ.. అంతటికి పాకడంతో.. స్థానికులతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన ఆటోలు, బైక్‌ల్లో వచ్చి కొండపై వెదుకులాట ప్రారంభిస్తున్నారు. నకరికల్లు మండలంలోని గ్రామాల వాసులే కాకుండా పిడుగురాళ్ల, నర్సరావుపేట, సత్తెనపల్లి ప్రాంతాల నుండి కూడా వజ్రాల వేట కోసం వస్తున్నారు. కొంతమందికి వజ్రాలు దొరికాయన్న పుకార్లు షికారు చేస్తుండటంతో ఈ కొండకు వస్తున్న వారి సంఖ్య పెరిగిపోయింది. చేతిలో మట్టి తవ్వేందుకు చిన్న ఇనుప రాడ్డును పట్టుకుని గంటల కొద్దీ రాళ్లను ఏరుకుంటున్నారు. వాటిని తమ దగ్గర ఉన్న డబ్బాల్లో వేసుకుని తర్వాత వాటిని చెక్ చేయిస్తామని చెబుతున్నారు. పురుషుల కంటే మహిళలు అధిక సంఖ్యలో వస్తున్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ మండలం కోళ్లూరులో కోహినూర్ వజ్రం దొరికిందని చరిత్ర చెబుతోంది. నిజాం నవాబు కోహినూర్ వజ్రాన్ని చూసి కోయి నహీ నూర్ అన్నాడని అదే కోహినూర్ గా మారిందని చరిత్రకారులు పుస్తకాల్లో రాశారు. అయితే ప్రస్తుతం ఆ ప్రాంతమంతా పులిచింతల ముంపులో మునిగిపోయింది. కోళ్లూరు తర్వాత అచ్చంపేట మండలం పుట్లగూడెంకు ఎక్కువ మంది వజ్రాల వేట కోసం వెళతారు. ఇక అటు, కృష్ణా జిల్లాలోని తీర ప్రాంతాల్లోనూ వేట సాగిస్తుంటారు.
గత సీజన్ లో మాత్రం నకరికల్లు మండలం శ్రీరాంపురం వద్ద నున్న కొండపైకి వజ్రాల వేట కోసం వచ్చారు. దానికి కొనసాగింపుగా ఈ ఏడాది కూడా ఈ కొండ మీద పెద్ద సంఖ్యలో వజ్రాల వేట కొనసాగిస్తున్నారు. కొంతమేర రంగురాళ్లు దొరుకుతున్నాయన్న వాదన ఇక్కడికి వచ్చే వారి సంఖ్య పెరిగిపోతుంది. తొలకరి జల్లులతో ప్రారంభమయ్యే ఈ వేట మరో పది, పదిహేను రోజుల పాటు కొనసాగనుంది.
మరిన్ని హ్యమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..