Mobile Phones: ఆలయాల్లో మొబైల్ ఫోన్ నిషేధం వెనుక అసలు కారణం ఇదే!

ఆలయాల్లో మొబైల్ ఫోన్లు ఎందుకు నిషేధమో తెలుసా,మన దేశంలోని ప్రధాన దేవాలయాలకు వెళ్ళినప్పుడు, "ఆలయం లోపల ఫోన్ వాడొద్దు, ఫోటోలు తీయొద్దు" అని రాసి ఉండటం మనం గమనించే ఉంటాం. ఈ నిబంధనలు ఎందుకు పెడతారు? అసలు ఇది శాస్త్రాల్లో ఉందా, లేక ఆలయ కమిటీలు ఇలా చెబుతాయా? గుడికి ఫోన్ తీసుకెళ్లడం నిజంగానే తప్పా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం.

Mobile Phones: ఆలయాల్లో మొబైల్ ఫోన్ నిషేధం వెనుక అసలు కారణం ఇదే!
Mobile Phones Are Banned In Temples

Updated on: Jul 31, 2025 | 2:57 PM

ఆలయాల్లో మొబైల్ ఫోన్లు ఎందుకు నిషేధమో తెలుసా? ఆధ్యాత్మిక ఏకాగ్రత, పవిత్రత కోసమే ఈ నిబంధన అని పండితులు చెబుతున్నారు. ఈ నిబంధన వెనక ఉన్న శాస్త్రీయ కారణం తెలుసుకుందాం.

ఆధ్యాత్మిక పవిత్రతకు భంగం:

హిందువులు ఆలయాలను దేవుళ్ల నివాసంగా, ఆధ్యాత్మిక శక్తికి కేంద్రంగా భావిస్తారు. ఆలయంలో పవిత్రత, స్వచ్ఛత, ప్రశాంతతను కాపాడటం అందరి బాధ్యత. అయితే, ఈ పవిత్రతకు భంగం కలిగించే వాటిలో మొబైల్ ఫోన్‌లు ప్రధానమైనవి. అందుకే ఫోన్లతో పాటు కొన్ని రకాల డిజిటల్ గాడ్జెట్స్‌ను గుళ్లలో వాడకుండా నిషేధిస్తారు.

శాస్త్రాల ప్రకారం:

హిందువుల ఆలయాలు శతాబ్దాల క్రితమే నిర్మించారు. దైవారాధనకు సంబంధించిన నియమాలను ఆనాటి గ్రంథాల్లో వివరించారు. ఆలయాల్లో మొబైల్ ఫోన్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనప్పటికీ, కొన్ని శ్లోకాల్లో ఆచరణాత్మక నియమాల గురించి వివరణ ఉంది. శరీరాన్ని, మనసును శుద్ధి చేసుకొని, శుభ్రమైన దుస్తులు ధరించి గుడికి వెళ్లాలని చెబుతారు. నిగ్రహం, భక్తితో దైవ పూజ చేయాలి. అంటే, దేవుడిని పూజించేటప్పుడు ఏకాగ్రత, స్వచ్ఛత, క్రమశిక్షణ అవసరం. వీటికి భంగం కలిగించే ఏ వస్తువును పూజ సమయంలో దగ్గర పెట్టుకోవద్దని దీని సారాంశం. ఈ జాబితాలో ఫోన్లు ఉన్నాయని ఆచరణాత్మకంగా ఆలోచిస్తే ఎవరికైనా తెలుస్తుంది.

ఏకాగ్రతకు ఆటంకం:

దైవం నివాసంగా భావించే ఆలయాలకు చాలామంది ప్రశాంతత కోసం వస్తారు, భక్తితో పూజలు చేస్తారు. దీనికి ఏకాగ్రత అత్యవసరం. అయితే, గుడిలో ఫోన్ వాడితే మీతో పాటు అక్కడ ఉన్న అందరి ఏకాగ్రతకు భంగం కలుగుతుంది. ఫోన్ మీ దగ్గర ఉంటే, ఆటోమేటిక్‌గా ఫోకస్ దానిపైకి మళ్లుతుంది. ఇది పూజ లేదా ధ్యానంలో ఆటంకం కలిగిస్తుంది. పూజలు చేసేటప్పుడు పెద్ద రింగ్‌టోన్‌లు మోగడం, నోటిఫికేషన్‌లు రావడం, పాటలు వినడం వంటివన్నీ ఆలయంలోని ప్రశాంతత, ఏకాగ్రత, దైవారాధనను కలుషితం చేస్తాయి. ఆ శబ్దాలు మీతో పాటు ఆలయంలో ఉన్న ఇతర భక్తుల దృష్టిని కూడా మరల్చుతాయి. మొబైల్ ఫోన్ల వల్ల మతపరమైన కార్యకలాపాలు ప్రభావితమవుతాయని పండితులు చెబుతారు. అందుకే గుడిలో ఫోన్లు వాడొద్దని నిబంధనలు పెడతారు.

ఫొటోలు ఎందుకు తీయకూడదు?

భక్తులు స్మార్ట్‌ఫోన్లలో దేవుళ్ల ఫొటోలు తీసి ఆరాధించాలనుకోవడం తప్పు కాదు. కానీ దానివల్ల దర్శనానికి ఇబ్బందులు కలుగుతాయని, దైవ దర్శనం ఆలస్యం అవుతుందని, అందుకే గుడిలో ఫొటోలు, వీడియోలు తీయకూడదని నిబంధనలు పెడతారు. అలాగే, గుడికి సంబంధించిన కొన్ని సున్నితమైన విషయాలు బయటి ప్రపంచానికి తెలిస్తే నేరగాళ్లకు అస్త్రాలుగా మారవచ్చు. ఇది కూడా ఫొటోలు తీయొద్దని చెప్పడానికి ఒక కారణం.

ఆచరించాల్సిన నియమాలు:

స్మార్ట్‌ఫోన్‌లను నిషేధించిన దేవాలయాల దగ్గర మొబైల్ డిపాజిట్ కౌంటర్లు ఉంటాయి. వాటిలో ఫోన్లు పెట్టి దర్శనానికి వెళ్లండి.

ఒకవేళ ఫోన్ నిషేధించని గుడికి వెళ్తే, దాన్ని సైలెంట్‌ మోడ్‌లో లేదా ఏరోప్లేన్ మోడ్‌లో పెట్టుకోండి లేదా స్విచాఫ్ చేయండి.

దైవ దర్శనం, ధ్యానం, మంత్రాలు జపించేటప్పుడు లేదా పూజ సమయంలో ఫోన్ తీసి మెసేజ్‌లు లేదా నోటిఫికేషన్లు చెక్ చేయకూడదు.

ఈ నిబంధనలను పాటించడం ద్వారా ఆలయంలోని పవిత్రతను, ప్రశాంతతను కాపాడటంలో మనం కూడా భాగస్వాములు కావచ్చు.