Indian Railway: దేశంలోనే ఆఖరు స్టేషన్.. అక్కడ రైలు కూత వినిపించదు.. ప్యాసింజర్లు కనిపించరు

|

Feb 14, 2025 | 2:11 PM

స్వాతంత్ర్య పోరాటానికి సాక్షిగా నిలిచిన ఈ రైల్వే స్టేషన్ ఇప్పుడు మూగబోయింది. ప్రయాణికులు, రైళ్ల రాకపోకలు లేక దేశం అంచున నిశ్శబ్ద కాపలాదారులా కనపడుతోంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ స్టేషన్ కు పునఃవైభవం రావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు.

Indian Railway: దేశంలోనే ఆఖరు స్టేషన్.. అక్కడ రైలు కూత వినిపించదు.. ప్యాసింజర్లు కనిపించరు
Singhabad
Follow us on

అతి పెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన భారత్ లో ఒక్కోస్టేషన్ కు ఒక్కో ఘనమైన చరిత్ర ఉంది. నిత్యం కోటి మందిని పైగా తమ గమ్యానికి చేరుస్తూ భారత రైలు నెట్వర్క్ తమ సేవలను అందిస్తోంది. ప్రయాణికుల ఉరుకులు పరుగులతో రద్దీగా ఉండే కంపార్టుమెంట్లు, అనౌన్స్ మెంట్లు.. నిత్యం కిక్కిరిసిపోయి ఉండే రైలు నిలయాలు.. ఎక్కడ చూసినా దాదాపు ఇదే దృశ్యం కనిపిస్తుంది. అయితే, దేశంలోని ఒకే ఒక్క స్టేషన్ మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. అక్కడ ప్యాసింజర్ రైలు కూతలు వినిపించవు. పట్టాలు భయంకరమైన నిశ్శబ్దాన్ని అలుముకుని ఉంటాయి. ఇక్కడ కాసేపు కూర్చుంటే కాలం ఆగిపోయిందా అనే భావన కలుగుతుంది. దశాబ్దాల చరిత్రకు సాక్షీభూతంలా నిలిచిన ఈ స్టేషన్ కు అసలేమైంది.

దేశంలోనే ఆఖరు రైల్వే స్టేషన్..

ఈ స్టేషన్లో ఏ ఒక్క రైలూ ఆగదు. అక్కడ ప్రయాణికులు సైతం ఉండరు. కానీ ఒకప్పుడు దీనికున్న గుర్తింపు వేరు. ఈ స్టేషన్ ఉన్నది ఎక్కడో కాదు.. భారతదేశపు అంచున ఉన్న కోల్‌కతా బంగ్లాదేశ్ సరిహద్దులో. దీని పేరే సింఘాబాద్ స్టేషన్. బంగ్లాదేశ్ సరిహద్దులోని మాల్దా జిల్లాలో హబీబ్ పూర్ ప్రాంతంలో ఈ స్టేషన్ ఉంది. దీనిని మన దేశపు ఆఖరి రైల్వే స్టేషన్ గా పరిగణిస్తారు. ఒకప్పుడు నిరంతరం ప్యాసింజర్ రైళ్లతో సింహంలా గర్జించిన ఈ స్టేషన్ కు ఆ తర్వాత ఆదరణ కరవైంది.

మహాత్ములు నడిచిన నేల..

ఈ స్టేషన్ దాటితే అక్కడి నుంచి అంతా బంగ్లాదేశ్ పరిధిలోకి వస్తుంది. భారత దేశ స్వాతంత్ర్య పోరాటంలో సింఘాబాద్ రైల్వే స్టేషన్ కీలక పాత్ర పోషించింది. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభబాయి పటేల్, నెహ్రూ వంటి వారు ఈ స్టేషన్ నుంచే ప్రయాణాలు సాగించేవారు. బ్రిటిష్ వారి కాలంలో కోల్‌కతా, ఢాకాను అనుసంధానించేందుకు ఈ స్టేషనే ఎంతో కీలకమైంది. 2011లో జరిగిన సవరణ ద్వారా నేపాల్ కు తిరిగి వచ్చే వారు ఈ స్టేషన్ ను ఉపయోగించుకునేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ స్టేషన్ గుండా కేవలం రవాణా సరఫరా మాత్రమే జరిగేది. అలా కాలక్రమేణా సింఘాబాద్ వైభవం కనుమరుగైంది.

రైలు కూత మళ్లీ గర్జిస్తుందా..

ఈ స్టేషన్ ను పునరుద్దరించాలని స్థానిక ప్రజలు ఎంతో కాలంగా కోరుతున్నారు. అంత పురాతన కాలం నాటి ఈ స్టేషన్ ను ప్రయాణికుల కోసం ఉపయోగించకపోయినా మ్యూజియంలా మార్చవచ్చు. భవిష్యత్తు తరాల కోసం దీని వైభవాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రస్తుతం ఇక్కడ గూడ్సు రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ప్రయాణీకుల సేవలకు అందుబాటులో లేనప్పటికీ, సింఘాబాద్ వ్యూహాత్మక స్థానం భవిష్యత్ రైలు అభివృద్ధికి, ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యం, పొరుగు దేశాలతో సంబంధాలకు కేంద్ర బిందువుగా మారే అవకాశం ఉంది.