వీల్‌చైర్‌పై శబరిమల యాత్ర.. తన సొంతింటి కలను సాకారం చేసిన టీచర్‌ కోసం ప్రార్థిస్తూ..

తమిళనాడుకు చెందిన ఒక దివ్యాంగుడు వీల్‌చైర్‌పైనే శబరిమల యాత్రకు బయలుదేరాడు. తన సొంతింటి కలను సాకారం చేసిన ఉపాధ్యాయురాలు బాగుండాలంటూ ప్రార్థిస్తూ అతను ఈ ఆధ్యాత్మిక యాత్ర చేపట్టాడు.

వీల్‌చైర్‌పై శబరిమల యాత్ర.. తన సొంతింటి కలను సాకారం చేసిన టీచర్‌ కోసం ప్రార్థిస్తూ..
Tamil Nadu Man
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Dec 23, 2022 | 7:35 AM

అయ్యప్ప స్వామిని ప్రత్యక్షంగా దర్శించుకోవడానికి శబరిమలకు పోటెత్తుతున్నారు భక్తులు. ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతున్నా చాలామంది కాలినడకన అయ్యప్ప సన్నిధికి చేరుకుంటున్నారు. ఇదిలా ఉంటే తమిళనాడుకు చెందిన ఒక దివ్యాంగుడు వీల్‌చైర్‌పైనే శబరిమల యాత్రకు బయలుదేరాడు. తన సొంతింటి కలను సాకారం చేసిన ఉపాధ్యాయురాలు బాగుండాలంటూ ప్రార్థిస్తూ అతను ఈ ఆధ్యాత్మిక యాత్ర చేపట్టాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని ముత్తుపేటకు చెందిన కన్నన్ పొట్టకూటి కోసం కొన్నాళ్ల క్రితం కేరళలోని మలప్పురం వచ్చాడు. భార్య, నలుగురు పిల్లలను పోషించేందుకు వివిధ నిర్మాణ ప్రదేశాలలో పనిచేస్తున్నాడు. అరకొర ఆదాయమే వస్తున్నా ఉన్నంతలో తన భార్యా పిల్లలతో సంతోషంగా జీవించాడు కన్నన్‌. అయితే కాలం అతనిపై కక్ష కట్టిందేమో.. ఒక సారి లారీ నుంచి సామగ్రిని దింపే ప్రయత్నంలో ప్రమాదం బారిన పడ్డాడు. ఈ దుర్ఘటనలో అతని కాలు పూర్తిగా దెబ్బతింది. దీంతో పనికి వెళ్లలేకపోయాడు. ఎడవన్నప్పర ప్రాంతంలో లాటరీ టిక్కెట్లు విక్రయిస్తూ జీవనం సాగించాడు.

ఈ సమయంలోనే కొండొట్టి ప్రభుత్వ కళాశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఎంపీ సమీరా కన్నన్‌ దీన పరిస్థితిని కళ్లారా చూసింది. అతనికి అండగా నిలబడింది. నేషనల్ సర్వీస్ స్కీమ్ వాలంటీర్లతో కలిసి తాడపరంబులో కన్నన్ కోసం రూ.8 లక్షలతో ఇంటిని నిర్మించింది. ఒక వీల్ చైర్ కూడా కొనిచ్చింది. ఈక్రమంలో తన సొంతింటి కల సాకారం చేసిన టీచర్‌ బాగుండాలని కోరుకుంటూ శబరిమల యాత్రకు బయలుదేరాడు కన్నన్. వీల్‌చైర్‌పైనే ఆధ్యాత్మిక యాత్ర సాగిస్తున్నాడు. ఇటీవలే కొండొట్టి నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించిన కన్నన్, ఈ నెలాఖరులోగా అయ్యప్ప సన్నిధానం చేరుకోవాలనుకుంటున్నాడు. అయ్యప్ప స్వామి దర్శానానంతరం బస్సులో తిరిగి తమిళనాడుకు రానున్నట్లు కన్నన్‌ తెలిపాడు. ప్రస్తుతం అతని యాత్రకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. అతని సంకల్పం చాలా గట్టిదని, అయ్యప్ప స్వామి దీవెనలు ఆ కుటుంబానికి ఉండాలంటూ నెటిజన్లు ప్రార్థిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీల కోసం క్లిక్ చేయండి..