ఒక్క క్షణం ఆగండి.. ఈ మాత్రానికే జీవితాన్ని అర్ధాంతరంగా కాలదన్నుకుంటే ఎలా? 

|

May 10, 2023 | 2:39 PM

ఆలోచన అంతమొందిన చోట.. ఆవేశం మొదలవుతుందని ఓ కవి అన్నాడు. అది అక్షరాలా నిజం. ఏదో సాధించాలనే తపన.. ఏమీ సాధించలేదేనన్న నిరాశ.. ఇంకేమీ సాధించలేమోనన్న నిస్పృహ.. ఇలాంటి స్థితిలోనే ఎంతోమంది నిండు జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. నేటి యువత..

ఒక్క క్షణం ఆగండి.. ఈ మాత్రానికే జీవితాన్ని అర్ధాంతరంగా కాలదన్నుకుంటే ఎలా? 
Suicide Prevention
Follow us on

ఆలోచన అంతమొందిన చోట.. ఆవేశం మొదలవుతుందని ఓ కవి అన్నాడు. అది అక్షరాలా నిజం. ఏదో సాధించాలనే తపన.. ఏమీ సాధించలేదేనన్న నిరాశ.. ఇంకేమీ సాధించలేమోనన్న నిస్పృహ.. ఇలాంటి స్థితిలోనే ఎంతోమంది నిండు జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. నేటి యువత చాలా చిన్న కారణాలకే తనువు చాలించి.. అయిన వారికి ఆవేదన మిగులుస్తున్నారు. ప్రేమ వైఫల్యం, తల్లిదండ్రులు మందలించారని, ఫోన్‌ చూడనివ్వలేదని, టీవీ రిమోట్‌ కోసమని, పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామని, మార్కులు తక్కువచ్చాయని, కోరుకున్న కాలేజీలో సీటు రాదేమోనని.. ఇలా నిత్యం ఎందరో ఆత్మహత్యలకు తెగబడుతున్నారు. నిజానికి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఆలోచించాలేగానీ 60 వేల ఉపాయాలని పెద్దలు ఊరికే చెప్పలేదు. సమస్య పరిష్కారమార్గంలో ఆలోచన చేయకుండా.. క్షణికావేశంతో ఆత్మహత్యల వంటి బాధాకరమైన నిర్ణయం తీసుకుని ఎందరో ప్రాణాలు తీసుకుంటున్నారు.

Suicide Prevention

ఆత్మహత్యల ఊబిలో యువత, వృద్ధులు

ఇలా జీవితాలకు ముగింపు కోరుకుంటున్నవారిలో ఎక్కువగా వృద్ధులు, యువత ఉంటున్నారు. ప్రతి సమస్యను పరిణతితో పరిష్కరించి రేపటి తరానికి ఆదర్శంగా నిలవాల్సిన వృద్ధులు అభద్రతా భావంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అపార ఒత్తిడితో చిత్తయ్యేలా చేస్తున్న నిరర్ధక చదువుల వల్ల ఎంతో భవిష్యత్తు ఉన్న యువతను డిప్రెషన్‌లోకి నెట్టేస్తుంది. మరోవైపు ఇవి చదువులా.. చావులా..? అనే అనుమానం రేకెత్తిస్తున్నాయి కొన్ని విద్యాసంస్థల తీరు. వెరసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదాల్లో చనిపోయే వారి కంటే ఆత్మహత్యల వల్ల మృతిచెందుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం విచారకరం. ముఖ్యంగా 15 నుండి 19 సంవత్సరాల వయస్సు గల యువతలో మరణానికి నాలుగో ప్రధాన కారణం ఆత్మహత్య. ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షల మందికి పైగా పురుగుమందులు తాగి, ఉరి వేసుకుని, ఆత్మహత్య చేసుకుంటున్నారు. వీటిని ఆపాలంటే ఆత్మహత్యల మూలాలు అన్వేషించాలి.

ఆత్మహత్యలకు పాల్పడేవారిని ఎలా గుర్తించాలి..?

ఆత్మహత్యకు ముందు ప్రదర్శించే నిర్దిష్ట లక్షణాలను అర్థం చేసుకోవడం ద్వారా వీటిని నివారించవచ్చు.
ఉదాహరణకు.. ఆత్మహత్య ఆలోచనలున్న వారు సమస్య గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. నిత్యం ఆ సమస్య పైనే వారు మాట్లాడతారు. ఆత్మహత్య చేసుకోవడం గురించి మాట్లాడటం లేదా ఆత్మహత్య చేసుకునే మార్గాలను వెతుకుతూ గంటలు గడుపుతారు. వారు తమను తాము ఇతరులపై భారంగా భావించడం మొదలుపెడతారు. వృద్ధులైతే అనారోగ్యం, ఒంటరితనం నుంచి బయటపడటానికి ఆత్మహత్య వైపు మొగ్గుచూపుతారు. దీంతో వీలైనంత త్వరగా వీలునామా సిద్ధం చేయడం, వీడ్కోలు సందేశాలు రాయడం, ఎప్పుడూ డిప్రెషన్‌లో ఉండటం, ఫోన్ తీయకపోవడం, అకస్మాత్తుగా స్నేహితులు.. సన్నిహితులతో కూడా మాట్లాడకుండా ఉండిపోవడం వంటివి హెచ్చరిక లక్షణాలు.

ఇవి కూడా చదవండి

Suicide Prevention

ఆత్మహత్యలను ఎలా నివారించాలంటే..

సాధారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. మీ చుట్టుపక్కల ఎవరైనా అలాంటి లక్షణాలు ఉన్నట్లైతే వారిని విస్మరించవద్దు. వారితో మాట్లాడాలి. వారి ఇబ్బంది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇది వారి దృష్టిని మరల్చి, ఆత్మహత్య ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కత్తులు, పురుగుమందులు, నిద్రమాత్రలు వంటివి అందుబాటులో ఉండకుండా చేయాలి. వారిని ఒంటరిగా గదిలో ఉండనివ్వకూడదు. వారి సమస్యలను ఓపికగా వినాలి. వారి సమస్యకు ఎలా పరిష్కారం దొరుకుతుందో వారితోనే చెప్పించాలి. చెడు ఆలోచనల నుంచి బయటపడేలా వారిలో స్ఫూర్తిని నింపాలి. వారు సాధారణ జీవితం గడిపేంత వరకు ఓకంట కనిపెడుతూనే ఉండాలి. జీవితంపై ఆశ కలిగించాలి. అయినా సమస్య మరీ తీవ్రంగా ఉంటే మంచి మానసిక వైద్యులను సంప్రదించి చికిత్స అందిచాలి.

Suicide Prevention

చివరిగా..

సెల్ ఫోన్లు చేతిలోకి వచ్చాక మనిషికి-మనిషికి మధ్య అగాధం ఏర్పడింది. పక్కనున్నవారిని చూసి ఆప్యాయంగా  పలకరించి ఎంతకాలం అయ్యిందో..? దగ్గరగా ఉన్నా మనుషుల మధ్య మాటలు కరువై ఒంటరై పోతున్నారు. వాటి ఫలితమే ఈ ఆత్మహత్యలు.

Suicide Prevention

ఉన్నది ఒక్కటే జీవితం. ఏం సాధించినా అందులోనే. అలాంటి జీవితాన్ని అర్ధాంతరంగా కాలదన్నుకుంటే ఎలా? మన కథ అక్కడితోనే పరిసమాప్తమవుతుంది! జీవితం హాయిగా జీవించడానికే.. పచ్చగా కళకళలాడుతూ నూరేళ్లూ జీవిద్దాం..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.