Subrahmanyeswara Temple In Mopidevi: మన పురాణాల ప్రకారం ముక్కోటి దేవతలు. ఒకొక్క దేవతకు ఒకొక్క విశిష్టత.. అయితే శివుడి కుమారుడైన సుబ్రమణ్యేశ్వరుడి దైవాలలో తనకున్న ప్రత్యేకతను చాటుకున్నాడు. హరిహరులు తర్వాత కష్టాలు తీర్చే కార్తికేయుడు అంటూ కొన్ని ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పూజలందుకుంటాడు. ఆరు ముఖాలతో కూడిన స్వామిగా నిత్యం భక్తుల చేత పూజలందుకునే సుబ్రమణ్యేశ్వరుడిని నాగ దోషం ఉన్నవారు.. వివాహం ఆలస్యం అవుతున్న యువతీ యువకులు.. సంతానం లేని వారు ఎక్కువగా పూజిస్తారు.. అలాంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు దక్షిణ భారదేశంలో అనేకం.. ప్రముఖ దేవాలయాల సరసన నిలబడే పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది కృష్ణా జిల్లాలోని మోపిదేవి కుమారక్షేత్రం.. స్కాందపురాణంలో సహ్యాద్రిఖండంలో కృష్ణానదీ తీరం అందు వెలసిన ఈ క్షేత్ర విశేషాలు మీ కోసం..
వింధ్య పర్వతం అహంకారంతో విజృంభించి, ఆకాశంలో కి చొచ్చుకొని పోయి, సూర్య గమనాన్ని సైతం నిరోధించసాగింది. ప్రకృతి స్థంభించింది. గ్రహసంచారాలు నిలిచిపోయాయి. ఈ మహోపద్రవాన్ని నివారించగలిగేది అగస్త్యమ హర్షి మాత్రమేనని భావించిన బ్రహ్మాది దేవతలు అగస్త్యమహర్షికి, ఈ విషయం విన్నవించారు. దీంతో యోగదృష్టితో సమస్తం తెలుసుకొన్న మహర్షి తాను ఇప్పుడు కాశీని విడిచి వెళ్ళితే తిరిగి కాశీకి రావడానికి వీలుండదు అని తెలుసుకొన్నారు.. అయినా సరే లోక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అగస్త్యమహర్షి వింధ్య పర్వతం యొక్క గర్వం అణచడానికి కాశీని విడిచిపెట్ట వలసి వచ్చింది. అగస్త్య ముని లోపాముద్రతో కలిసి దక్షిణాపథానికి బయలుదేరాడు. దారిలో నున్న వింధ్య పర్వతం మహర్షి రాకను గమనించి సాష్టాంగపడి నమస్కరించింది. తాను మరలి వచ్చేవరకు అలాగే ఉండమని శాసించి, కాశీ విశాలాక్షీ, విశ్వనాథులను మనసులో నిలుపుకొని, దక్షిణాపథం వైపు బయలుదేరాడు అగస్త్యుడు. పవిత్ర గోదావరీ ప్రాంతాన్ని పావనం చేసి కృష్ణాతీరం లోకి అడుగుపెట్టారు ఆ పుణ్యదంపతులు. కనకదుర్గామాతను, శ్రీకాకుళాంద్ర మహావిష్ణువుని దర్శించుకొని వ్యాఘ్రపురం చేరుకున్నారు.
అనేమాట అప్రయత్నంగా మహర్షి గళం నుండి వెలువడింది. ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండివుంది. లోపాముద్రా దేవి, శిష్యబృందము ఆయనను అనుసరించారు. ఒకపుట్ట నుండి దివ్యతేజస్సుని గమనించి ఇదే సుబ్రమణ్య క్షేత్రమని, ఇది భుక్తి ముక్తి ఫలప్రదమని శిష్యులకు వివరించాడు. కుమార స్వామీకే.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనే పేరు ఉందని..మాండవ్యుడనే శిష్యుని అడిగిన సందేహాన్ని నివృత్తి చేశాడు. కుమారస్వామి ఉరగ రూపంలో తపస్సు చేయడానికి గల కారణాన్ని శిష్యులకు చెప్పాడు.
అగస్త్య, సనత్కుమార, సనత్సు దేవర్షులు ఎప్పుడూ ఐదేళ్ల ప్రాయం వారిగానే, దిగంబురులై భగవదారధనలో ఉంటారు. ఒకసారి పరమేశ్వర దర్శనం కోసం కైలాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో శివుడు లేకపోగా, పార్వతి, కుమారస్వామి మాత్రమే ఉన్నారు. అదే సమయంలో లక్ష్మీ, సరస్వతి, శచీ, స్వాహాదేవితోపాటు ఇతర దేవతా స్త్రీలు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. ఇటు జడధారులు, అటు అందమైన సుందరీమణులను చూసిన కుమారస్వామికి నవ్వు ఆగలేదు. దీన్ని గమనించిన పార్వతి.. కుమారా! ఎందుకలా నవ్వుతున్నావు… ఆ తపసులు నాలా కన్పించడం లేదా? నీ తండ్రిలా లేరా? ఏమైనా భేదం ఉందా? అంటూ ప్రశ్నించింది. తల్లి మాటలకు తన ప్రవర్తనకు లోలోన పశ్చాత్తాపం చెందిన కుమారస్వామి ఆమె పాదాలపై వాలి క్షమాపణ వేడుకున్నాడు. ఆమె వారించినా వినకుండా తపస్సుకు బయలుదేరాడు.అలా తపస్సు కోసం బయలులు దేరిన కార్తికేయుడు ఈ ప్రాంతానికి చేరుకుని పాము రూపంతో పుట్టలో స్వయంగా తపస్సు ప్రారంభించాడు. ఆ ప్రాంతమే ఇది అని అగస్త్యుడు శిష్యులకు చెప్పి, దివ్యతేజస్సు వెలువడే పుట్టపై శివలింగాన్ని ప్రతిష్ఠించాడు.
కాలక్రమంలో ఆ ప్రదేశానికి సమీపంలో వీరారపు పర్వతాలు అనే కుమ్మరి ఉండేవాడు. అతడు గొప్ప శివభక్తుడు. దేవసేనాధిపతి అతడికి కలలో కనిపించి, తాను ఉన్న ప్రదేశం గురించి తెలిపి, ఆలయాన్ని నిర్మించి, అందులో ప్రతిష్ఠించమని కోరాడు. అలా ఆయన దేవాలయాన్ని నిర్మించాడు. మట్టితో శివుడికి ఇష్టమైన వాటిని తయారుచేసి ఆలయంలో భద్రపరిచేవాడు. ఈ పుణ్యక్షేత్రాన్ని మోహినీపురంతో పిలిచేవారు. కాలక్రమేణా మోపిదేవిగా స్థిరపడింది.
గర్భగుడిలో పాము చుట్టలే పానవట్టం. దీనిపైనే శివలింగం ఉంటుంది. ఈ పానవట్టం కిందే ఉండే రంధ్రంలోనే అభిషేకం, అర్చన సమయాల్లో పాలు పోస్తారు. మోపిదేవి ఆలయం సంతానం లేని జంటలకు, సర్ప దోష నివారణ పూజకు, రాహు కేతు దోష పూజకు మరియు దోష పూజలకు, దృష్టి, చెవి సంబంధిత సమస్యలు , చర్మ సంబంధిత వ్యాధుల నివారణకు, మంచి జీవిత భాగస్వామికీ మరియు అన్నప్రాసనకూ ప్రసిద్ధి. ఈ ఆలయంలో ఒకరాత్రి ఒకజంట నిద్రపోతే, వారికి సంతానం కల్గుతుందని భక్తులు గట్టిగా నమ్ముతారు. అందుకే, మోపిదేవి మహా మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతోంది.
Also Read:భారీ హిమపాతంతో శ్వేతవర్ణాన్ని అద్దుకున్న కాశ్మీర్.. అద్భుతమైన వీక్షణం అంటున్న కేంద్ర మంత్రి