ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. అదే సమయంలో ఓపెన్ హార్ట్ సర్జరీ.. డాక్టర్లు ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు

|

Apr 04, 2021 | 5:59 PM

వైద్యుడిని దేవునికి ప్రతిరూపంలా భావిస్తారు. డాక్టర్ కూడా రోగి ప్రాణాలు నిలపడమే ప్రథమ కర్తవ్యంగా పెట్టుకుంటాడు. తాజాగా అందుకు తార్కాణంగా నిలిచే...

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. అదే సమయంలో ఓపెన్ హార్ట్ సర్జరీ.. డాక్టర్లు ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు
Russia Doctors
Follow us on

వైద్యుడిని దేవునికి ప్రతిరూపంలా భావిస్తారు. డాక్టర్ కూడా రోగి ప్రాణాలు నిలపడమే ప్రథమ కర్తవ్యంగా పెట్టుకుంటాడు. తాజాగా అందుకు తార్కాణంగా నిలిచే ఘటన రష్యాలో వెలుగుచూసింది. ఆ దేశంలోని ఒక ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. కానీ వైద్యులు అగ్ని ప్రమాదం  గురించి ఆందోళన చెందకుండా రోగికి గుండె శస్త్రచికిత్సను కొనసాగించారు.

ఈ సంఘటన రష్యాలోని బ్లాగోవ్స్చెన్స్క్ నగరంలోని ఒక ఆసుపత్రిలో చోటుచేసుకుంది. మంటలు చెలరేగిన ఆసుపత్రి చాలా పాతదిగా తెలుస్తుంది. శుక్రవారం ఇక్కడ అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. ఆసుపత్రి నుంచి మంటలు చెలరేగినప్పుడు, ఎనిమిది మంది వైద్యుల బృందం అక్కడి ఆపరేషన్ థియేటర్‌లో ఒక రోగికి గుండె శస్త్రచికిత్స చేస్తున్నారు. ఒక వైపు ఆసుపత్రి భవనం నుంచి విపరీతమైన పొగ కమ్ముకున్నప్పటికీ, వైద్యులు వారి జీవితాలను రిస్క్‌లో పెట్టి శస్త్రచికిత్సను కొనసాగించారు.

ఆసుపత్రిలో మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బందికి రెండు గంటలు పట్టింది.  ఈ సమయంలో, వైద్యులు రోగికి ఓపెన్ హార్ట్ సర్జరీని విజయవంతమైన పూర్తి చేశారు.  ఆసుపత్రిలో రోగికి శస్త్రచికిత్స చేసిన ఒక వైద్యుడు మాట్లాడుతూ, మాకు వేరే మార్గం లేదు.. ఏ సందర్భంలోనైనా రోగి ప్రాణాలను నిలపడమే మా ప్రథమ కర్తవ్యం అని చెప్పారు.  శస్త్రచికిత్స విజయవంతమైన తరువాత, రోగిని మరొక ఆసుపత్రికి తరలించారు.

ఆస్పత్రి భవనం పైకప్పుపై మంటలు చెలరేగడంతో అక్కడ చికిత్స పొందుతున్న 128 మందిని వెంటనే ఆసుపత్రి నుంచి వేరే చోటుకి తరలించారు.  ఈ ఆసుపత్రిని 1907 లో నిర్మించారు. ఈ సంఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ వార్త విన్న తరువాత, ప్రజలు కర్తవ్య నిర్వహణ పట్ల వైద్యులు చూపిన చొరవను అభినందిస్తున్నారు.

Also Read:Vakeel Saab: నివేదా థామస్ కు కరోనా పాజిటివ్… అలర్ట్ అయిన వకీల్ సాబ్ చిత్రయూనిట్.. టీమ్ కు కరోనా టెస్టులు..

చిన్నారులతో కలిసి ఈస్టర్ లంచ్‌.. అక్కతో వీడియోకాల్.. కేరళ ప్రచారంలో రాహుల్ దూకుడు..