Post Office: పోస్టాఫీసులో పొదుపు మీ భవితకి బంగారు మలుపుగా చెప్పవచ్చు. పోస్టాఫీసులోని పథకాలలో పెట్టుబడి పెడితే మంచి ఆదాయం, భద్రత రెండు దొరుకుతాయి. అందుకే ప్రతి ఒక్కరు ఇందులో పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతారు. అంతేకాదు కొన్ని పథకాలలో పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. పోస్ట్ ఆఫీస్ RD డిపాజిట్ ఖాతా అనేది ప్రభుత్వ-మద్దతు గల పథకం. మీరు కేవలం100 రూపాయలతో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి లేదు ఎంతైనా డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకం ఐదేళ్లపాటు కొనసాగుతుంది.
బ్యాంకులు రికరింగ్ డిపాజిట్ ఖాతాలను ఆరు నెలలు, ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలకు అందిస్తాయి. ప్రతి త్రైమాసికంలో అందులో డిపాజిట్ చేయబడిన డబ్బుపై వడ్డీ (వార్షిక రేటుతో) లెక్కిస్తారు. త్రైమాసికం ముగింపులో అది మీ ఖాతాకు (చక్రవడ్డీతో సహా) జమ చేస్తారు. ప్రస్తుతం, రికరింగ్ డిపాజిట్ పథకాలపై 5.8% వడ్డీ రేటు అందుబాటులో ఉంది. ఈ కొత్త రేటు ఏప్రిల్ 1, 2020 నుంచి అమలులోకి వస్తుంది. ప్రతి త్రైమాసికంలో భారత ప్రభుత్వం తన చిన్న పొదుపు కార్యక్రమాలన్నింటికీ వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది.
16 లక్షలు ఎలా..?
పోస్టాఫీసు ఆర్డీ పథకంలో నెలకు రూ.10,000 చొప్పున పదేళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే 5.8% చొప్పున రూ.16 లక్షలకు పైగా జమ అవుతుంది.
1. ప్రతి నెలా రూ.10,000 పెట్టుబడి
2. వడ్డీ 5.8%
3. మెచ్యూరిటీ 10 సంవత్సరాలు
4.10 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ మొత్తం = రూ 16,28,963
RD ఖాతా గురించి ముఖ్యమైన విషయాలు
మీరు క్రమం తప్పకుండా ఖాతాలోకి డబ్బు జమ చేయడం కొనసాగించాలి. చేయకపోతే మీకు నెలవారీ ఒక శాతం జరిమానా విధిస్తారు. నాలుగు వాయిదాల తర్వాత మీ ఖాతా మూసివేస్తారు.