ప్రతీ ఇంట్లో కచ్చితంగా ఉండే వస్తువుల్లో గ్యాస్ సిలిండర్ ఒకటి. ఇంట్లో గ్యాస్ లేకపోతే రోజు గడవని పరిస్థితి. ఒకప్పుడు కట్టెల పొయ్యిలు ఉపయోగించే ప్రజలు ఇప్పుడు కచ్చితంగా గ్యాస్‌ను ఉపయోగిస్తున్నారు. ఇలా జీవితంలో నిత్యవసర వస్తువుగా మారిపోయిన గ్యాస్ సిలిండర్‌లో మోసం చేస్తూ కొందరు కేటుగాళ్లు ఆదాయంగా మార్చుకుంటున్నారు. తాజాగా ముంబయిలో జరిగిన ఓ సంఘటన గ్యాస్ సిలిండర్‌లో జరిగే మోసాలకు సాక్ష్యంగా నిలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. గ్యాస్ సిలిండర్స్‌లో గ్యాస్‌ను దొంగలిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు గ్యాస్ డెలివరీ ఏజెంట్లను ముంబయి పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఇద్దరు గ్యాస్ డెలివరీ బాయ్స్, వాహనంలో గ్యాస్‌ను మార్చుతున్న సమయంలో పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ముంబయిలోని శివాజీ నగర్‌లో ఈ సంఘటన జరిగింది. రఫీక్ నగర్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారు జామున 2.45 గంటలకు పోలీసులు పాట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో రోడ్డుపై ఆగివున్న ఓ వాహనాన్ని గుర్తించారు.
అనుమానదస్పంగా కనిపించడంతో పోలీసులు టెంపోను పరిశీలించారు. దీంతో వాహనంలో ఇద్దరు వ్యక్తులు సిలిండర్ల నుంచి గ్యాస్‌ను దొంగలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వీరిద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గత నెల రోజులుగా వీరిద్దరూ ఇలా గ్యాస్ దొంగలిస్తున్నట్లు విచారణలో తేలింది.
ఇదిలా ఉంటే ఇది కేవలం ఈ సంఘటనకే పరిమితం కాదు. చాలా చోట్ల ఇలాంటి గ్యాస్ దొంగతనాలు అడపాదపడా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కొందరు ఈజీ మనీ కోసం వెంపార్లాడుతూ ఇలా గ్యాస్‌ను దొంగలిస్తున్నారు. ఇలాంటి మోసాల బారినపడకుండా ఉండాలంటే కచ్చితంగా అప్రమత్తతో ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా గ్యాస్ డెలివరీ సమయంలో సిలిండ్ బరువు చెక్ చేసుకోవాలి. ఇది ప్రతీ ఒక్క వినియోగదారుడి హక్కు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఇక ఒకవేళ.. వెయింగ్ మిషన్ లేకపోతే ఇక సింపుల్ టెక్నీక్ ద్వారా సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఓ తడి గుడ్డను తీసుకొని గ్యాస్ సిలిండర్‌పై తుడవాలి. ఇలా చేస్తే 2-3 నిమిషాల తర్వాత సిలిండర్‌పై అక్కడక్కడ తడి ఆరిపోతూ ఉంటుంది. కానీ కొన్ని చోట్ల మాత్రం తడి ఇంకా నెమ్మదిగా పోతుంది. నెమ్మదిగా తడి ఆరిపోతూ ఉంటే అంత వరకు గ్యాస్ ఉందని అంచనాకు రావొచ్చు. తడి త్వరగా ఆరిపోతే అక్కడ గ్యాస్ లేదని అర్థం చేసుకోవాలి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం క్లిక్ చేయండి..