కోడి కూర వండుకోవడానికే కాదు.. పందేలకు పెట్టింది పేరు.. ఇప్పుడు పందేలతో పాటు అందాలు కూడా ఒలకబోస్తున్నాయి కోడి పుంజులు. నిన్నటి వరకు జంతువుల్లో ప్రధానంగా ఒంగోలు జాతి ఎద్దులు, కుక్కలు, పిల్లులకు అందాల పోటీలు నిర్వహించేవారు. అయితే ఇప్పుడు కోడికేం తక్కువ అన్నట్టుగా వీటిని పెంచుకుంటున్న యజమానుల్లో ఓ ఆశక్తికరమైన ఆలోచన వచ్చింది. ఆదే కోడికి అందాలు పోటీలు నిర్వహించడం.
కోడికి అందాల పోటీలు నిర్వహించడం కొత్త కాకపోయినా, అంతగా ఈ పోటీలు ప్రాచుర్యంలోకి రాలేదు. వీటి అందాల పోటీలకు జాతీయ స్థాయిలో ఇప్పుడిప్పుడే భలే డిమాండ్ ఏర్పడుతుంది. దీంతో తాజాగా కేరళలో జరిగిన కోళ్ళ అందాల పోటీల్లో ప్రకాశంజిల్లాకు చెందిన ఓ కుక్కుట మహారాజుకు జాతీయస్థాయిలో మూడో బహుమతి లభించడమే ఇక్కడ విశేషం..!
ప్రకాశంజిల్లా కొమరోలు మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన సయ్యద్ భాషాకు చెందిన కోడి జాతీయ స్థాయిలో జరిగిన కోళ్ళ అందాల పోటీల్లో మూడవ బహుమతి సాధించింది. కేరళలో జరిగిన కోళ్ల అందాల ప్రదర్శనలో సయ్యద్ భాషా కోడి పోటీలలో మూడవ బహుమతి ఎగరేసుకుని వచ్చింది. కేరళలో జరిగిన ఈ పోటీలలో దేశవ్యాప్తంగా పలువురు తమ కోళ్లతో పోటీలలో పాల్గొన్నారు. మూడవ బహుమతి సాధించిన సయ్యద్ భాషాకు నిర్వాహకులు షీల్డ్ తో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అందాల పోటీలకు పంపాలనే ఏకైక ఉద్దేశ్యంతో గత నాలుగేళ్లుగా చిలుక ముక్కుపుడకలను పెంచడాన్ని జీవనాధారంగా చేసుకున్న తండ్రీకొడుకుల ద్వయానికి ఈ ఘనత దక్కుతుంది.
అందాల పోటీలలో పోటీ పడటానికి కోడి పుంజులను పెంచడం చాలా గొప్ప పనిగా భావిస్తున్నట్లు సయ్యద్ బాషా తెలిపారు. కోళ్లకు పోషక విలువలతో కూడిన ప్రత్యేక ఆహారాన్ని అందజేస్తామని ఆయన అన్నారు. కోళ్ల పరిమాణం, ఆకారం, రంగు, ఈక మెరుపు ఆధారంగా అందాల పోటీకి ఎంపిక చేస్తారని బాషా వెల్లడించారు.
అంతకు ముందు అనంతపురం జిల్లా ధర్మవరంలో ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి కోళ్ల అందాల పోటీల్లో తాను పెంచుకున్న కోడి తొలిసారి నాలుగో స్థానంలో నిలిచింది. దానితో, ట్రోఫీ, గుర్తింపు సర్టిఫికేట్ దక్కించుకుంది. మొత్తంగా 50 కోడి పుంజులను పెంచుతున్న బాషా, ఇటీవలి విజయం పట్ల ఉత్సాహంగా ఉన్నానని, తదుపరి తమిళనాడు కోడి అందాల పోటీకి తన కోళ్లను సిద్ధం చేస్తున్నానని తెలిపారు.
గతంలో కూడా సయ్యద్ భాషకు చెందిన కోళ్ళు జాతీయస్థాయి అందాల ప్రదర్శన పోటీలలో పాల్గొని బహుమతులు సాధించాయి. కోడిని చూడగానే కూర వండుకుని ఆస్వాదించే మనవాళ్ళు కోడికి అందాల మెరుగులు అద్ది ఆనందించడం కూడా ఒక హబీ కిందకే వస్తుంది కదా..!
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…