
మలేషియాలోని జోహోర్ రాష్ట్రంలో కొలువై ఉన్న టియాన్‌హౌ ఆలయం ఒక ప్రత్యేకమైన ఆవిష్కరణకు వేదికైంది. ఈ ఆలయం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కృత్రిమ మేధస్సు (AI)తో రూపొందించబడిన దేవతామూర్తిని భక్తులకు పరిచయం చేసింది. చైనాకు చెందిన సముద్ర దేవత అయిన మజూ యొక్క డిజిటల్ రూపమైన ఈ వినూత్న దేవతను మలేషియాకు చెందిన ఐమజిన్ అనే సాంకేతిక సంస్థ రూపొందించింది. ఈ డిజిటల్ దేవత భక్తులతో మాట్లాడగలదు, వారి భవిష్యత్తును గురించి చెప్పగలదు, ఆశీర్వాదాలు ఇవ్వగలదు, వారికి అవసరమైన సలహాలను కూడా అందిస్తుంది. మజూ దేవత 1,065వ జన్మదినోత్సవం (ఏప్రిల్ 20, 2025) సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించారు. తద్వారా సాంప్రదాయ ఆధ్యాత్మికతను ఆధునిక కృత్రిమ మేధస్సు సాంకేతికతతో మేళవించారు.
మజూ, లేదా లిన్ మో, 960వ సంవత్సరంలో చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లోని మీజౌ ద్వీపంలో జన్మించింది. అక్కడి కథనాల ప్రకారం, ఆమె సముద్రంలో ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి ప్రయత్నిస్తూ మరణించింది. ఆ తరువాత ఆమెను సముద్ర దేవతగా పూజిస్తున్నారు. ఆమెను నావికుల రక్షకురాలిగా కూడా పిలుస్తారు. మలేషియా, సింగపూర్, ఇండోనేషియా వంటి ఆగ్నేయాసియా దేశాలలోని చైనా సమాజాలలో ఆమెను ఎక్కువగా ఆరాధిస్తారు
ఈ కృత్రిమ మేధస్సు ఆధారిత మజూ డిజిటల్ తెరపై సాంప్రదాయ చైనా దుస్తులలో ఉన్న ఒక అందమైన మహిళగా కనిపిస్తుంది. ఈ రూపం చైనా నటి లియు యిఫీని పోలి ఉంటుంది. భక్తులు ఈ డిజిటల్ దేవతతో నేరుగా సంభాషించవచ్చు. తమకు కావలసిన ఆశీర్వాదాలను కోరవచ్చు. అంతేకాకుండా, తమ వ్యక్తిగత సమస్యలపై సలహాలు కూడా పొందవచ్చు. సహజ భాషా ప్రాసెసింగ్ (NLP) ద్వారా కృత్రిమ మేధస్సు మజూ మాండరిన్‌తో పాటు ఇతర భాషల్లోనూ మాట్లాడగలదు. మజూ కథలు, మత గ్రంథాలు బోధనల ఆధారంగా ఇది భక్తులకు గౌరవప్రదమైన సమాధానాలను అందిస్తుంది.
ఐమజిన్ సంస్థాపకుడు షిన్ కాంగ్ ఒక సందర్భంలో కృత్రిమ మేధస్సు మజూను ‘పియాన్ కై యున్ (అనుకోని ధన లాభం)’ గురించి అడిగినప్పుడు, ఆమె ప్రశాంతమైన స్వరంతో ‘ఇంట్లో ఉంటే అనుకోని ధన లాభానికి మీ అదృష్టం మెరుగ్గా ఉంటుంది’ అని సూచించింది. మరొక సందర్భంలో, ఒక ప్రముఖ వ్యక్తి నిద్రలేమి సమస్య గురించి అడిగినప్పుడు, కృత్రిమ మేధస్సు మజూ ఆమెను ‘నా బిడ్డ’ అని సంబోధిస్తూ, ‘‘పడుకునే ముందు వెచ్చని నీరు తాగండి’’ అని సలహా ఇచ్చింది. ఇది మజూ సంరక్షణా స్వభావాన్ని తెలియజేస్తుంది.
కృత్రిమ మేధస్సు మజూ ఆధ్యాత్మిక రంగంలో కృత్రిమ మేధస్సు పాత్రపై అనేక చర్చలకు దారితీసింది. కొందరు దీనిని సాంప్రదాయానికి విరుద్ధంగా దైవిక భావాన్ని తగ్గించే చర్యగా భావిస్తున్నారు. కృత్రిమ మేధస్సు మానవ ఆధ్యాత్మిక నాయకుల సానుభూతి అవగాహనను పూర్తిగా ప్రతిబింబించలేదని వారు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా, సాంకేతికతపై ఎక్కువగా ఆధారపడటం వల్ల మానవ సంబంధాలు తగ్గిపోయే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. సాఫ్ట్‌వేర్ సమస్యలు లేదా విద్యుత్ అంతరాయాల వంటి సాంకేతిక ఇబ్బందులు భక్తుల యొక్క ఆధ్యాత్మిక అనుభవాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.