JCB: జేసీబీ ఫుల్‌ఫాం ఏంటి? 99 శాతం మందికి అస్సలూ తెలియదు
భారతదేశంలో రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నా, పాత భవనాలను కూల్చివేస్తున్నా లేదా ఎక్కడైనా తవ్వకాలు జరుపుతున్నా అందరికీ మొదటగా గుర్తుకు వచ్చేది 'జేసీబీ' (JCB) వాహనం. సోషల్ మీడియాలో సైతం ఈ వాహనానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే మనమందరం పిలిచే ఈ జేసీబీ పూర్తి పేరు ఏంటి, అలాగే ఈ వాహనాలన్నీ కేవలం పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయో దానికి గల ఆసక్తికరమైన కారణాలు తెలుసుకుందాం.

మనం రోజువారీ జీవితంలో చూసే భారీ క్రేన్లు లేదా తవ్వకపు యంత్రాలను సాధారణంగా ‘జేసీబీ’ అని పిలుస్తుంటాం. నిజానికి జేసీబీ అనేది ఒక నిర్దిష్ట వాహనం పేరు కాదు, అది ఆ యంత్రాలను తయారు చేసే ఒక అంతర్జాతీయ సంస్థ పేరు. ఈ కంపెనీని బ్రిటన్‌కు చెందిన జోసెఫ్ సిరిల్ బామ్‌ఫోర్డ్ అనే వ్యక్తి స్థాపించారు. ఆయన పేరులోని మొదటి అక్షరాల కలయికతోనే ఈ సంస్థకు ‘JCB’ (Joseph Cyril Bamford Excavators Ltd) అని పేరు పెట్టారు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల నిర్మాణ రంగానికి సంబంధించిన భారీ యంత్రాలను తయారు చేస్తుంది.
ప్రారంభంలో పసుపు రంగులో ఉండేవి కావు ప్రస్తుతం మనం చూస్తున్న జేసీబీ వాహనాలన్నీ పసుపు రంగులోనే మెరుస్తుంటాయి. కానీ ఈ కంపెనీ ప్రారంభమైన కొత్తలో అంటే 1945 కాలంలో ఈ యంత్రాలు పసుపు రంగులో ఉండేవి కావు. అప్పట్లో వీటిని తెలుపు , ఎరుపు రంగుల కలయికతో తయారు చేసేవారు. అయితే ఆ తర్వాత కంపెనీ తన వాహనాల రంగును పూర్తిగా పసుపు రంగులోకి మార్చాలని ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీని వెనుక ఒక బలమైన శాస్త్రీయ , భద్రతా కారణం దాగి ఉంది.
పసుపు రంగు వెనుక ఉన్న అసలు భద్రతా కారణం సాంకేతిక నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, పసుపు రంగు అనేది దూరంగా ఉన్నప్పటికీ మనుషుల కంటికి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా నిర్మాణ పనులు జరిగే ప్రదేశాలలో (Construction Sites) రక్షణ , భద్రత అనేది అత్యంత ప్రాధాన్యమైన అంశం. ఎక్కడైనా తవ్వకాలు లేదా కూల్చివేతలు జరుగుతున్నప్పుడు, ఆ ప్రాంతంలో భారీ యంత్రాలు పనిచేస్తున్నాయనే విషయం సుదూరం నుండి వచ్చే వాహనదారులకు లేదా ప్రజలకు స్పష్టంగా తెలియాలి. పసుపు రంగు పగటిపూట మాత్రమే కాకుండా రాత్రి సమయాల్లో, చీకటిగా ఉన్న ప్రదేశాలలో , దట్టమైన పొగమంచు లేదా ధూళి కమ్ముకున్నప్పుడు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
దీనివల్ల నిర్మాణ ప్రాంతాల్లో జరిగే ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చు. ఈ రంగు దూరం నుంచే ఒక హెచ్చరికలా పనిచేస్తుంది. అందుకే కేవలం జేసీబీ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే రకరకాల క్రేన్లు, బుల్డోజర్లు , ఇతర భారీ నిర్మాణ యంత్రాలకు పసుపు రంగునే ప్రామాణికంగా ఉపయోగిస్తున్నారు.
