Freedom Fighter: బ్రిటీష్ పరిపాలనాకాలంలో దేశస్వాతంత్ర్యం కోసం ఎందరో ప్రాణాలు అర్పించిన సమరయోధులు ఉన్నారు. అయితే అందులో కేవలం కొంతమందిపేర్లు మాత్రమే తెరపైకి వచ్చాయి. మరికొందరి పేర్లు వారి మరణంతోనే అంతరించిపోయాయి. అటువంటివారిలో అష్ఫాకుల్లా ఖాన్ కూడా ఒకరు. ముస్లిం మతానికి చెందిన ఇతను… మతతత్వభావాలు లేకుండా అందరితో మమేకమై స్వాతంత్ర్య పోరాటాల్లో పాల్గొనేవాడు. ‘దేశ సోదరులారా! మనం మొదట భారతీయులం.. ఆ తర్వాతే వివిధ మతాలకు చెందినవాళ్లం. ఏ మతం వారైనప్పటికీ పరస్పరం కలహించుకోకండి… ఐక్యమత్యంతో ఆంగ్లేయులను ఎదురించండి. దేశవిముక్తే మన లక్ష్యం’ అంటూ నినాదాలు చేస్తూ అందరినీ చైతన్యపరిచేవాడు.
ఉత్తర ప్రదేశ్ లోని షాజహాన్‌పూర్ లో నివాసమున్న షఫీకుర్ రెహమాన్ – మజ్హరున్నీసా దంపతులకు 1900 అక్టోబర్ 22వ తేదీన అష్ఫాకుల్లా ఖాన్ జన్మించాడు. ఆ దంపతులకు ఇతను ఆరవసంతానం. ఇతను పాఠాశాలలో చదువుతున్నప్పుడు మహాత్మాగాంధీ సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించారు. అయితే చౌరీచౌరా ఉదంతం తర్వాత ఈ ఉద్యమాన్ని నిలిపివేయడంతో ఎంతోమంది భారతీయ యువకులు నిరాశ చెందారు. అందులో అష్ఫాక్ ఒకడు. వీలైనంత త్వరగా దేశాన్ని తెల్లదొరల నుంచి విముక్తి చేయాలనే తపనతో అతివాద ఉద్యమారులతో చేరాడు. అప్పుడు ఆయనకు ప్రముఖ ఉద్యమకారుడు రాంప్రసాద్ బిస్మిల్‌తో పరిచయం ఏర్పడింది. విభిన్నమతాలకు చెందిన వీరిద్దరి స్నేహం కొంత విభిన్నమైనప్పటికీ.. ఇద్దరి లక్ష్యం మాత్రం ఒక్కటే.. అదే భారత స్వాతంత్ర్యం. దాంతో వీరిద్దరు మంచి మిత్రులుగా చరిత్రలోనే నిలిచిపోయారు. అప్పటినుంచి స్వాతంత్ర్య పోరాటాల్లో కలిసి పాల్గొన్న ఈ ఇద్దరు యోధులు.. ఒకే రోజు వేర్వేరు జైళ్లలో ప్రాణాలు అర్పించారు.
1925 ఆగస్టు 8వ తేదీన ఉద్యమకారులందరూ కలిసి సాయుధ ఉద్యమానికి ఊపునివ్వడం కోసం, పోరాటానికి కావలసిన ఆయుధాలు – మందుగుండు సామాగ్రి కొనుగోలు విషయంలో ఒక సభను నిర్వహించారు. చాలా తర్జనబర్జనల తర్వాత ఆ సభలో రైళ్లలో రవాణా చేసే ప్రభుత్వ కోశాగారాన్ని దోచుకోవాలని నిర్ణయించారు. దీంతో ఆగస్టు 9వ తేదీన అష్ఫాకుల్లా, రాంప్రసాద్ బిస్మిల్ ఇద్దరు ఇతర ఉద్యమకారులతో కలిసి కాకోరీ గ్రామం వద్ద ప్రభుత్వ ధనాన్ని తీసుకెళుతున్న రైలును దోచుకున్నారు. అయితే ఈ దోపిడీకి పాల్పడిన వారికోసం అప్పటి పోలీసులు దర్యాప్తు చేయగా.. అందులో రాంప్రసాద్ బిస్మిల్ 1925 సెప్టెంబర్ 26వ తేదీన పట్టుబడ్డాడు. కానీ అష్ఫాక్ మాత్రం దొరకలేదు. ఆ సమయంలో తాను ఎవరికీ తెలియకుండా బీహార్ నుండి బనారస్ కు వెళ్లి అక్కడ 10 నెలలపాటు ఒక ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేశాడు.
చాలాకాలం వరకు తాను అజ్ఞాతంలో ఉండలేక దేశానికి ఉపయోగపడుతుందని విదేశాలకు వెళ్లి ఇంజనీరింగు చదవాలని నిశ్చయించుకున్నాడు. అందుకు మార్గాలు అన్వేషిస్తూ ఎవరికీ తెలియకుండా ఢిల్లీ చేరుకున్నాడు. అక్కడ ఒక పఠాన్ స్నేహితున్ని ఆశ్రయించాడు. అయితే అతడు అష్ఫాక్ ను వెన్నుపోటు పొడిచి అతని జాడ పోలీసులకు తెలియజేశాడు. దాంతో అతనిని ఫైజాబాద్ జైల్లో బంధించి, కేసు నమోదు చేశారు. అతనికోసం పెద్దన్న రియాసతుల్లా ఖాన్ ఎంత వాదించినా.. ఫలితం లేకపోయింది. దీంతో దోపిడీకి పాల్పడినందుకు ఆ కేసులో ఆయనతోపాటు రాంప్రసాద్ బిస్మిల్ కు కూడా మరణశిక్ష విధించారు. 1927 డిసెంబర్ 19వ తేదీని ఇద్దరికీ ఉరితీశారు. అంతటితో వారి జీవితం ముగిసింది. ఇదిలావుండగా.. అష్ఫాక్ తోబాటు ఆయన సహచరులు చేసిన పనులను 2005లో రంగ్ దే బసంతీ అనే సినిమాలో చిత్రీకరించారు.
Azadi ka Amrut Mahotsav: ‘జన గణ మన’ను జాతీయ గీతంగా ఎప్పుడు స్వీకరించారో తెలుసా..?.. చరిత్ర ఏమిటి..?