
రైల్వే స్టేషన్‌లో రైలు ఇంజిన్‌ను చూసినప్పుడు.. లోకో పైలట్ కారు నడిపినట్లుగా స్టీరింగ్ పట్టుకుని రైలును మలుపులు తిప్పుతారని చాలామంది అనుకుంటారు. కానీ ఆ ఊహ పూర్తిగా తప్పు.ఎందుకంటే రైళ్లకు స్టీరింగ్ వీల్ ఉండదు. స్టీరింగ్ లేకుండా రైలును ఎలా తిప్పుతారు..? లోకో పైలట్ పాత్ర ఏమిటి..? అనే ప్రశ్నలకు సమాధానం రైల్వే ఇంజనీరింగ్ అద్భుతంలో ఉంది.
రైళ్లు తమకంటూ ఒక సాంకేతిక వ్యవస్థను ఉపయోగించి నడుస్తాయి. రైలు చక్రాలు పట్టాలను గట్టిగా పట్టుకునేలా తయారు చేస్తారు. అందుకే ఎంత వేగంగా వెళ్లినా రైలు పట్టాలు తప్పదు. రైలు మలుపు తిరగడానికి లేదా లైన్ మారడానికి లోకో పైలట్ ఏమీ చేయరు. పట్టాలు మారే చోట ప్రత్యేకంగా అమర్చిన ఇనుప ముక్కలు మాత్రమే చక్రాల దిశను మారుస్తాయి.
రైలు ఏ ట్రాక్‌లోకి వెళ్లాలి, ఎక్కడ ఆగాలి అనే నిర్ణయాలన్నీ స్టేషన్ మాస్టర్, రైల్వే ప్రధాన కార్యాలయం తీసుకుంటాయి. ట్రాక్‌లు మార్చే పనిని పాయింట్స్ మ్యాన్ అనే ఉద్యోగి చూసుకుంటారు. రైలు ఏ ప్లాట్‌ఫామ్‌లో ఆపాలి.. ఎక్కడ ఆపకూడదు అనే నిర్ణయాన్ని కూడా రైల్వే ప్రధాన కార్యాలయం నిర్ణయిస్తుంది. లోకో పైలట్‌కు తన ఇష్టానుసారం రైలును ఆపడానికి అధికారం ఉండదు.
రైలుకు స్టీరింగ్ లేకపోయినా, లోకో పైలట్ చాలా ముఖ్యమైన పనులు చేస్తారు. రైలుకు గేర్లు ఉంటాయి. వాటిని మారుస్తూ లోకో పైలట్ వేగాన్ని పెంచడం లేదా తగ్గించడం చేస్తారు. ఎక్కడ రైలు ఆపాలి, ఎప్పుడు మొదలుపెట్టాలి అనేదాని కోసం లోకో పైలట్ సిగ్నల్స్‌ను నిరంతరం గమనిస్తారు. రైలు ప్రయాణం సక్రమంగా జరిగేలా గార్డుతో ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటారు. ముఖ్యంగా, లోకో పైలట్ రైలును నడిపే సాంకేతిక బాధ్యతను, భద్రతను చూసుకునే కీలక నిపుణుడిలా పనిచేస్తారు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి