
తేనెతుట్టెను కదపకుండానే, వాటి జోలికి వెళ్లకుండానే తేనెటీగలు వేల సంఖ్యలో వచ్చి దాడులు చేస్తుంటే జనం బెంబేలెత్తిపోతున్నారు.
ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం. ఇప్పుడు తేనెటీగలకు బలయ్యే కాలం వచ్చిందా?. ఏడాదిలో సీజన్లు మారినట్టు ఇప్పుడు తేనెటీగలు కుట్టే కాలం వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో తేనెటీగల దాడులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో తేనెటీగల దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. చాలామంది గాయపడ్డారు. కొందరి పరిస్థితి సీరియస్‌గా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో కూడా అదే సీన్ రిపీట్ అయింది. తేనెటీగల దాడిలో చాలామంది గాయపడ్డారు. శవయాత్రలో శవాన్ని వదిలేసి పరుగులు తీశారంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉండి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఒకే ఒక తేనెటీగ కుట్టినా సరే దాని ముల్లు వెంటనే లాగేయకపోతే 24 గంటల పాటు అది సలుపుతూనే ఉటుంది. భరించరాని నొప్పి. అలాంటిది వేల సంఖ్యలో ఒకేసారి తేనెటీగలు దాడిచేస్తే ఊపిరి పీల్చడం కూడా కష్టమైపోయి మనిషి అలాగే చనిపోయే అవకాశం ఎక్కువ. అదే జరిగింది తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్ళ గ్రామంలో. తేనెటీగల దాడికి వ్యక్తి మృతిచెందాడు.. దీంతో అతడి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తాడిమళ్ల శివారులోని అరటి తోటలో అరటి గెలలు కోసేందుకు వెళ్లిన అరటి కార్మికులపై తేనెటీగల గుంపు దాడి చేసింది . ఈ నేపథ్యంలో అరటి గెల కార్మికులను తీసుకువెళ్లిన లారీ డ్రైవర్ షేక్ వలీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అక్కడున్న మిగతా కార్మికులందరూ తలోదిక్కుకి పారిపోయారు. పాలకొల్లుకు చెందిన డ్రైవర్ షేక్ వలీ కి ఇద్దరు పిల్లలు. పాలకొల్లులో కాపురం ఉంటున్నాడు. గాయపడిన కార్మికులకు చికిత్స అందించారు. వలీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
తేనె ఎంత మధురంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం.. కానీ, తేనెటీగలు కుడితే మాత్రం కళ్ల ముందే ప్రత్యక్ష నరకం కనిపిస్తుంది. తేనెటీగల జోలికి వెళితే పరిగెత్తిస్తాయి… కసిగా అందిన దగ్గర కుట్టేస్తాయి….ఆ మంటను భరించడం ఎంతో కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు దాని విషం ప్రాణాంతకంగా మారుతుంది. ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు వైద్యులు.
పంట పొలాలకు వెళ్ళేటప్పుడు రైతులపై తేనెటీగలు దాడి చేస్తూనే ఉంటాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వ్యవసాయ పనులు ఎక్కువ. వ్యవసాయ పనులు కోసం వెళ్లే రైతులను తేనెటీగలు దాడి చేసి గాయాలు పాలు చేస్తున్నాయి. వ్యవసాయ కూలీలతో రోజువారి పొలాల్లో పని చేసే వారిపై ఈ దాడులు ఉంటాయని రైతులు అంటున్నారు. అందుకే చాలామంది రైతులు టవల్స్ ని మొహం మీద కప్పుకుంటారు రైతులు. చాలా చోట్ల ఉపాధి హామీ కూలీల పైన కూడా ఈ తేనెటీగల దాడులు చేస్తే పదుల సంఖ్యలో గాయపడిన దాఖలాలు ఉన్నాయి.
అసలు తేనెటీగలు కుడితే మరణం ఎందుకు సంభవిస్తుంది. తేనెటీగలు కుట్టినవాళ్లంతా చనిపోతారా? అనే డౌట్స్ ఉన్నాయి. తేనెటీగలు కుడితే అలర్జీ వల్ల కుట్టినచోట, కళ్ళు, పెదవులు, ముఖం వస్తాయి. కుట్టినచోట మంటతో పాటు నొప్పి ఉంటుంది. కుట్టిన చోట దద్దుర్లు వస్తాయి. తేనెటీగలు కుట్టినపుడు మన శరీరంలోకి ఒక రసాయననాన్ని ఇంజెక్ట్ చేస్తాయి. కొందరిలో వారి దేహం ప్రతిచర్యగా హిస్టామిన్ ను విడుదల చేస్తుందని అంటున్నారు వైద్యులు. దాంతో రక్తపోటు పడిపోవడం, శరీరంలో రక్తనాళాలు వ్యాకోచించడం తీవ్రమైన అలర్జీ రియాక్షన్ లు కలుగుతాయి. అత్యవసర వైద్యం అవసరమవుతుంది. సెలైన్ పెడతారు. యాంటీ హిస్టామిన్ లు దేహంలోకి ఎక్కిస్తారు. దాదాపు అత్యవసర ప్రాణాపాయ సమయంలో చేసేవైద్యమంతా చేస్తారు. చాలామంది రైతులు ఈ వైద్యం అందక పొలాల్లోనే కన్నుమూస్తున్నారు. తాజాగా నిడదవోలు మండలం తాడిమల్ల గ్రామంలో అరటి కార్మికులపై తేనెటీగలు చేసిన దాడిలో లారీ డ్రైవర్ షేక్ వలీ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు.
తేనెటీగ కుడితే దాని ముల్లులోంచి మన ఒంట్లోకి ప్రవేశించే విషం ప్రమాదకరమైన ఎలర్జీలను కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు. తేనెను సేకరించేందుకు తేనెటీగలకు ఉపయోగపడే ముల్లులోర ప్రమాదకర అపిటాక్సిన్ విష పదార్థాలు ఉంటాయి. దాడి చేసినప్పుడు బాధితుడి శరీరంలోకి ముల్లు ద్వారా వాటిని వదులుతాయి. అందుకే తేనెటీగలు కుట్టిన వెంటనే ముల్లులను లాగిపడేయాలి. ఒకేసారి పెద్దఎత్తున తేనెటీగలు దాడి చేస్తే మనిషి శరీరంలో కళ్లు, ముక్కు, గొంతు, చర్మం వంటి అవయవాలు తీవ్ర ప్రభావానికి లోనవుతాయి. దీంతో మనిషి ఎనఫలాక్సిస్ రియాక్షన్‌కు గురవుతాడని వైద్యులు పేర్కొంటున్నారు. రియాక్షన్‌కు గురైన మనిషిలో శ్వాస ప్రక్రియ ఉక్కిరిబిక్కిరి అవుతుంది.
గుండెపై ఒత్తిడి పెరగడం, శ్వాస కష్టంగా మారడం, ఇదే సమయంలో మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి.. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతారు. వెంటనే సరైన వైద్యం అందకుంటే కొన్ని సందర్భాల్లో కొద్ది నిమిషాల్లోనే బాధితుడు మరణిస్తారని వైద్యులు చెబుతున్నారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో తేనెటీగలు కుడితే హార్మోన్స్ రియాక్షన్స్‌కు గురవుతాయి. ముక్కు, గొంతు భాగాల్లో కుట్టినప్పుడు శ్వాసనాళాలు దెబ్బతింటాయి. దద్దుర్లు, వాపు వస్తాయి. ఊపిరి చాలా కష్టమవుతుంది. దాంతో ఒక్కోసారి చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే తేనెటీగల బారిన పడ్డామంటే ఎన్ని ముళ్లు మన ఒంటిలో దూరాయనే దాన్నిబట్టి మన ప్రాణం నిలుస్తుందా, పోతుందా అనే విషయాన్ని తేలుతుందని వైద్యులు చెబుతున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి ఐదు నిమిషాల్లోగా ఎతినైఫ్రిన్ అడ్రినలిన్ మందులు అందించాలని వైద్యులు చెబుతున్నారు.
తేనెటీగలు కుట్టినప్పుడు ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వైద్యులు అందుబాటులో లేనప్పుడు ఏం చేయాలి? తేనెటీగ కుట్టినచోట తేనె రాస్తే కొంత రిలీఫ్ ఉంటుందని కొందరు చెబుతున్నారు. చిట్కా వైద్యంగా ఇది అందుబాటులో ఉంది. మనం ఏం చేయకుండానే ఒక్కోసారి మన మీద తేనెటీగలు దాడి చేస్తాయి. అలాంటప్పుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడానికి మనం కింద కూర్చోవాలి. తల బయటకు కనిపించకుండా గోనెపట్టా లాంటివి కప్పుకోవాలి. తల బయటకు కనిపిస్తే తేనెటీగలు వేల సంఖ్యలో చుట్టుముడతాయి. ఎందుకంటే నల్లటి జుట్టు వాటిని ఆకర్షిస్తుంది. తల నల్లగా ఉంటుంది కాబట్టి తేనెటీగల వేల సంఖ్యలో చుట్టుముట్టి దాడి చేస్తాయి. సో… ముందు తలను ఏదైనా దళసరి టవల్ లాంటి దాంతో కప్పుకోవాలి. మనం కిందే కూర్చోవాలి. ఎందుకంటే తేనెటీగలు నేల మీద దాకా రావు, గాల్లోనే ఎగురుతూ దాడి చేస్తాయి కాబట్టి మనం కింద కూర్చుంటే బెటర్.
తేనెటీగలు కుట్టినవాళ్లంతా చనిపోరు. కాబట్టి మొదట ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఉండాలి. తేనెటీగలు కుట్టడం ద్వారా మన శరీరంలోకి పంపించే విషం లేదా రసాయనం చాలా కొద్దిమందికే మాత్రమే ప్రాణాంతకం. అది వాళ్లకు అలర్జీగా తీవ్ర అస్వస్థతకు గురి చేసి ప్రాణాలు తీస్తుంది. చాలామందికి ఇంత ఇబ్బంది ఉండదంటున్నారు వైద్య నిపుణులు. తేనెటీగలు కుట్టిన వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించి సాధ్యమైనంత త్వరగా ఆస్పత్రికి తరలించాలి. తేనెటీగలు ఎక్కువగా తుట్టెలు పెట్టే ప్రాంతాలకు వెళ్లకపోవడం మంచిది.
మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..