రైలు ఒక కి.మీ నడిచేందుకు ఎన్ని లీటర్ల డీజిల్ కావాలి..? తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఒక రైలు కేవలం ఒక కిలోమీటర్ ప్రయాణించడానికి ఎంత ఇంధనం లేదా విద్యుత్ ఖర్చవుతుందో తెలుసా? రైలు రకం, బోగీల సంఖ్య, బరువు, వేగం, స్టాపుల ఆధారంగా ఇంధన వినియోగం మారుతుంది. సాధారణంగా డీజిల్‌తో నడిచే ప్యాసింజర్ రైలు కిలోమీటర్‌కు సుమారు 6 లీటర్ల డీజిల్ వినియోగించవచ్చు. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ వినియోగం కొంత తక్కువగా ఉంటుంది. ఇక ఎలక్ట్రిక్ రైళ్లకు కిలోమీటర్‌కు ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరమవుతుందో తెలుసా..?

భారత రైల్వేస్ దేశ వ్యాప్తంగా నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను ఒక చోటి నుంచి మరో చోటికి చేరుస్తుంటాయి. అయితే ఒక రైలు కేవలం ఒక కిలోమీటర్ దూరం ప్రయాణించడానికి ఎంత ఇంధనం లేదా విద్యుత్ అవసరమవుతుందో చాలామందికి తెలియదు. రైలు మైలేజీ దాని రకం, బరువు, బోగీల సంఖ్య, మార్గంలో ఎన్ని సార్లు ఆగుతుంది వంటి అంశాలపై ఆధారపడి మారుతుంది.
ప్యాసింజర్ రైలుకు అయ్యే ఇంధనం..?
డీజిల్ ఇంజిన్‌తో నడిచే సుమారు 12 బోగీల ప్యాసింజర్ రైలు ఒక కిలోమీటర్ ప్రయాణానికి దాదాపు 6 లీటర్ల డీజిల్ వినియోగించే అవకాశముంది. అంటే ఒక లీటర్ డీజిల్‌తో ఇలాంటి రైలు సుమారు 170 మీటర్లు మాత్రమే ప్రయాణించగలదు. ప్యాసింజర్ రైళ్లు చిన్న, పెద్ద స్టేషన్లలో తరచుగా ఆగడం వల్ల బ్రేకులు వేయడం, మళ్లీ వేగాన్ని పెంచడం అవసరమవుతుంది. దీంతో ఇంధన వినియోగం కూడా పెరుగుతుంది.
ఎక్స్‌ప్రెస్ రైళ్లలో పరిస్థితి ఎలా ఉంటుంది?
12 బోగీలున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఒక కిలోమీటర్ ప్రయాణానికి సుమారు 4.5 లీటర్ల డీజిల్ అవసరం కావచ్చని సమాచారం. అంటే లీటర్‌కు సుమారు 220 మీటర్లు ప్రయాణించే అవకాశం ఉంటుంది. మరోవైపు 24 బోగీలున్న సూపర్‌ఫాస్ట్ రైలుకు ఒక కిలోమీటర్‌కు సుమారు 6 లీటర్ల డీజిల్ అవసరం కావచ్చు. బోగీల సంఖ్య పెరగడంతో రైలు మొత్తం బరువు కూడా పెరుగుతుంది. అదే ఇంధన వినియోగంపై ప్రభావం చూపుతుంది.
విద్యుత్ రైళ్లకు ఎంత ఖర్చు?
భారత రైల్వేలో విద్యుదీకరణ విస్తరిస్తున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ ఇంజిన్ల వినియోగం పెరుగుతోంది. ఒక రైలు కిలోమీటర్ ప్రయాణానికి సుమారు 20 యూనిట్ల విద్యుత్ అవసరమవుతుందని కథనం పేర్కొంది. గత ఏడాది ఒక యూనిట్ విద్యుత్ ధర రూ.6.50గా ఉన్నప్పుడు, కిలోమీటర్‌కు విద్యుత్ ఖర్చు సుమారు రూ.130గా లెక్కించారు. ప్రస్తుత ధరల ఆధారంగా ఇది సుమారు రూ.150 వరకు ఉండవచ్చని అంచనా. అయితే ఇందులో నిర్వహణ, సిబ్బంది తదితర ఖర్చులు ఉండవు.
అందువల్ల రైలు ప్రయాణానికి అయ్యే ఖర్చు కేవలం ఇంధనం లేదా విద్యుత్ వినియోగంతో మాత్రమే నిర్ణయించబడదు. రైలు బరువు, బోగీల సంఖ్య, వేగం, స్టాపులు, మార్గ పరిస్థితులు వంటి అనేక అంశాలు దాని ఇంధన సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి.




