AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గనిలో జాక్‌పాట్..! అదృష్టం అంటే వీళ్లదే..! ఆరు నెలలు తవ్వితే ఒకేసారి 4 వజ్రాలు..!

మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఝాన్సీకి చెందిన దంపతులకు వజ్రాల గనిలో జాక్‌పాట్ తగిలింది. ఆరు నెలల పాటు కష్టపడి తవ్వకాలు చేయగా, ఒకేసారి 5.16 క్యారెట్ల బరువున్న నాలుగు అరుదైన వజ్రాలు లభించాయి. వీటి అంచనా విలువ సుమారు రూ.12 లక్షలు. ఈ వజ్రాలతో తమ పిల్లల భవిష్యత్తుకు, వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేసుకుంటున్నారు.

గనిలో జాక్‌పాట్..! అదృష్టం అంటే వీళ్లదే..! ఆరు నెలలు తవ్వితే ఒకేసారి 4 వజ్రాలు..!
Panna Diamond Jackpot
Balaraju Goud
|

Updated on: Oct 03, 2026 | 8:04 AM

Share

అదృష్టం తలుపు తడితే ఎలా ఉంటుందో చూపించే ఘటన మధ్యప్రదేశ్‌లోని పన్నాలో చోటుచేసుకుంది. వజ్రాల కోసం ఆరు నెలల పాటు కష్టపడి గనిలో అన్వేషణ సాగించిన ఝాన్సీకి చెందిన దంపతులకు ఒకేసారి నాలుగు అరుదైన వజ్రాలు లభించాయి. ఈ నాలుగు వజ్రాల మొత్తం బరువు 5.16 క్యారెట్లు కాగా.. వాటి అంచనా విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

ఝాన్సీకి చెందిన రాజ్‌కుమార్ శ్రీవాస్, ఆయన భార్య గుడ్డి దేవి పన్నాలోని సర్కోహా ప్రాంతంలో మైనింగ్ లీజు తీసుకుని వజ్రాల కోసం అన్వేషణ ప్రారంభించారు. పన్నాలో వజ్రాలు లభించి సాధారణ ప్రజల జీవితాలు మారుతున్నాయన్న వార్తలను సోషల్ మీడియాలో చూసిన రాజ్‌కుమార్‌ కూడా వజ్రాల గనిలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

అలా దాదాపు ఆరు నెలల పాటు దంపతులు గనిలో శ్రమించారు. చివరకు వారి కష్టానికి ఫలితం దక్కింది. తవ్వకాల్లో ఒకేసారి నాలుగు వజ్రాలు లభించాయి. వాటిలో 1.62 క్యారెట్లు, 1.29 క్యారెట్ల బరువున్న రెండు వజ్రాలు మెరుస్తుండగా.. 1.44 క్యారెట్లు, 0.81 క్యారెట్ల బరువున్న మరో రెండు వజ్రాలు కాంతిహీనంగా ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 5.16 క్యారెట్ల వజ్రాలు లభించడంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

నిబంధనల ప్రకారం లభించిన నాలుగు వజ్రాలను దంపతులు ప్రభుత్వ వజ్రాల కార్యాలయంలో జమ చేశారు. వీటి అంచనా విలువ సుమారు రూ.12 లక్షలు ఉండొచ్చని వజ్రాల నిపుణుడు అనుపమ్ సింగ్ తెలిపారు. అయితే తుది ధర ప్రభుత్వ వేలంలోనే నిర్ణయించనున్నారు. వేలం అనంతరం నిబంధనల ప్రకారం రాయల్టీ, ఇతర ప్రభుత్వ రుసుములు మినహాయించి మిగిలిన మొత్తాన్ని దంపతులకు అందించనున్నారు.

ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీర్వాదాలతో పాటు ఆరు నెలల కష్టానికి ఈ వజ్రాలు ఫలితమని ఆనందం వ్యక్తం చేశారు. వేలం ద్వారా వచ్చే డబ్బును పిల్లల చదువుకు, వారి భవిష్యత్తుకు ఉపయోగిస్తామని చెప్పారు. అలాగే తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు కూడా కొంత మొత్తాన్ని వినియోగించాలని భావిస్తున్నట్లు తెలిపారు.

పన్నా ప్రాంతంలో సాధారణ ప్రజలు గనులకు లీజులు తీసుకుని వజ్రాల అన్వేషణ చేపట్టడం, అదృష్టం కలిసొస్తే విలువైన వజ్రాలు లభించడం తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ దంపతులకు ఒకేసారి నాలుగు వజ్రాలు దొరకడం స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us