Tragedy: గ్రామ వాలంటీర్ నిర్వాకానికి ఐదుగురు అమాయకులు బలి.. ఒక్కో కుటుంబానిది ఒక్కొక్క కన్నీటిగాథ!

ఒక గ్రామ వాలంటీర్ చేసిన దూరాగతం ఆ గ్రామాన్ని దహించివేసింది. ఆ వాలంటీర్ ఆకృత్యం ఆ గ్రామాన్ని విషాదం లోనూ తలెత్తుకోనీకుండా చేసింది. ఆ వాలంటీర్ అరచకానికి ఐదుగురు అమాయకులు బలైపోగా, ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

Tragedy: గ్రామ వాలంటీర్ నిర్వాకానికి ఐదుగురు అమాయకులు బలి.. ఒక్కో కుటుంబానిది ఒక్కొక్క కన్నీటిగాథ!
East Godavari
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 09, 2022 | 7:26 AM

Kalthi Kallu Tragedy: ఒక గ్రామ వాలంటీర్(Village Volunteer) చేసిన దూరాగతం ఆ గ్రామాన్ని దహించివేసింది. ఆ వాలంటీర్ ఆకృత్యం ఆ గ్రామాన్ని విషాదం లోనూ తలెత్తుకోనీకుండా చేసింది. ఆ వాలంటీర్ అరచకానికి ఐదుగురు అమాయకులు బలైపోగా, ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మృతుల్లో ఒకరైన గంగరాజు భార్యపై ఆ గ్రామ వాలంటీర్‌ మనసు పారేసుకుని మాయమాటలు చెప్పి ఆమెను వశపరచుకుని విహహేతర సంబంధం(Illegal Affair) కొనసాగించాడు. ఆమె భర్త గంగరాజును అడ్డు తొలగించుకునేందుకు కల్లు కుండలో కలుపు తొలగించేందుకు వాడే రసాయణాల్ని కలిపాడు. అది తాగిన గంగరాజు అందులో విషం ఉందని తెలీక అటుగా వెళ్తున్న తన నలుగురు స్నేహితులకు కూడా తాపించాడు. దీంతో ఆ నలుగురు అమాయకులతో పాటు గంగరాజు కూడా మరణించాడు. గంగరాజు నాన్న వెంకటేశ్వర్లు కూడా కల్లు తాగడానికి ప్రయత్నించగా దుర్వాసన వస్తోందని ఆగాడు. లేదంటే ఆయన ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయేవి. ఈ అమానుష ఘటనకు సంబంధించి టీవీ 9 బృందం జరిపిన పరిశోధనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి..

జీలుగ కల్లు తాగిన ఐదుగురు గిరిజనులు మృతి చెందిన విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలోని రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో గత బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన చదల సుగ్రీవ(70), బూసరి సన్యాశిరావు(65), పొత్తూరి గంగరాజు(35), వేమా లోవరాజు(28), కుడే ఏసుబాబు(23), గంగరాజు తండ్రి వెంకటేశ్వర్లు రోజూ మాదిరిగానే బుధవారం ఉదయాన్నే తమకు సమీపంలోని జీలుగ చెట్టు నుంచి కల్లు సేకరించారు. సుగ్రీవ, సన్యాశిరావు, గంగరాజు, లోవరాజు, ఏసుబాబు దానిని తాగగా.. వెంకటేశ్వర్లు కల్లు నుంచి దుర్వాసన వస్తోందని ఉమ్మేశాడు.

కల్లు తాగిన ఐదుగురూ కొద్దిసేపటికే వాంతులు చేసుకొని.. అపస్మారక స్థితికి చేరుకున్నారు. బాధితులను అంబులెన్స్‌లో కాకినాడకు తరలిస్తుండగా మార్గంమధ్యలో ఇద్దరు, కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు. మొదట్లో కల్లులో ఏవో విష పురుగులు కలిసాయని అనుకున్నా, ఆ కల్లు కుండ నుంచి విష రసాయనాల వాసన కావడంతో, కావాలని ఎవరో విషం కలిపి ఉంటారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కల్లు శాంపిల్స్ ను లాబ్ కి పంపి విష రసాయనాలు కల్లులో కలిసాయని నిర్దారించుకున్నారు. అదే సమయంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా విష రసాయనాలు కలిసిన కల్లు తాగడం వల్లే మరణించారని తేలడంతో ఆ దిశగా పరిశోధన ప్రారంభించారు పోలీసులు

అయితే, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి టీవీ9 బృందం పరిశోధన చేపట్టింది. దీంతో అసలు వ్యవహారం బట్టబయలు అయ్యింది. అదే గ్రామంలో వాలంటీర్‌గా పనిచేస్తున్న వంతల రాంబాబుకు గంగరాజు కుటుంబానికి మధ్య విబేధాలున్నట్టు పోలీసులు గుర్తించారు. విషం కలిసిన కల్లు కలిగిన జీలుగ చెట్టు గంగరాజుదే కాబట్టి రాంబాబుని అనుమానించిన పోలీసులు కస్టడీ కి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించే సరికి, రాంబాబు తనకు గంగరాజు భార్య లోవతో ఉన్న వివాహేతర సంబంధం బయటపడింది. ఇందుకు సంబంధించిన ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకంది. ఆ నేపథ్యంలోనే గంగరాజును అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు కల్లు కుండలో గత మంగళవారం రాత్రి విషం కలిపినట్టు నేరం అంగీకరించాడు రాంబాబు. అయితే, గంగరాజు ఒక్కడే తాగి చనిపోతాడాని అనుకున్నాడు. కానీ మిగతా నలుగురు తాగుతారని, మొత్తం ఐదుమంది ప్రాణాలు పోతాయని ఊహించలేదని పోలీస్ విచారణలో తెలిపాడు రాంబాబు.

దీంతో లోదొడ్డి గ్రామం తల్లడిల్లి పోయింది. ఆ ఐదు కుటుంబాలు అంతులేని విషాదం లో మునిగిపోయాయి. అయిన వారిని కోల్పోయిన ఆ కుటుంబాలు కుమిలిపోతున్నాయి. ఒక్కో కుటుంబానిది ఒక్కో విషాద గాధ. ముందుగా చెప్పుకోవాల్సింది గంగరాజు పిల్లల గురించే… గంగరాజు పిల్లలని చూస్తే కన్నీరు ఆగదు. తన తల్లి చేసిన పాడు పని వల్లే తమ తండ్రి చనిపోయారని ఆ ముక్కు పచ్చలారని చిన్నారులకు తెలీదు. ముగ్గురు ఆడపిల్లలు, చూడటానికి సరస్వతీ పుత్రికల్లా కనిపించే ఈ బంగారు తల్లుల భవిష్యత్ ని వాళ్ల తల్లే కాల రాసింది. గంగరాజు కూలి పనులు చేసి తెచ్చిన సొమ్ముతో ఆ కుటుంబానికి కడుపు నిండేది. అలాంటి పరిస్థితుల్లో గంగరాజు భార్య లోవను లోబరచుకున్న వాలంటీర్ రాంబాబు ఏకంగా అతన్ని మట్టుబెట్టడానికి పన్నిన పథకం లో గంగరాజు బలైపోగా ఆ కుటుంబం రోడ్డున పడిపోయింది. ఆ తల్లి ని ఊరు ఊరకనే వదలదు కాబట్టి అవమాన భారంతో ఆ తల్లి ఎలా ఈ చిన్నారులను ముందుకు తీసుకెళ్తుందో దేవుడికే తెలియాలి. ఆ చిన్నారుల ఆవేదన చూస్తే మన కన్నీరు ఆగదు.

ఆశా కార్యకర్తగా పని చేస్తోన్న కూతురు యేసమ్మకు అమ్మా నాన్న సర్వం సుగ్రీవుడే. ఆయన భార్య ఈ మధ్యే మరణించింది. తల్లి దూరమై వేదనతో ఉన్న యేసమ్మకు తండ్రే ఓదార్పు. వయసు మీద పడ్డా.. పొలం పనులు చేస్తూ తల్లిలేని లోటు లేకుండా చూసుకుంటే.. 70 ఏళ్ల తండ్రిని కూతురు కూడా కన్నబిడ్డలా సాకుతోంది. సుగ్రీవుడు మృతితో యేసమ్మ వేదనకు అంతే లేకుండా పోయింది. మరొకరు.. సన్యాసి రావు కు భార్య, కొడుకు, నలుగురు కుమార్తెలు. ఉన్నంతలో జాగ్రత్తగా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు సన్యాసి రావు. కాయకష్టాన్ని నమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆడపిల్ల ల పెళ్లిళ్లు కూడా కాకముందే వాలంటీర్ రాంబాబు ఆరాచకానికి బలికావడంతో ఆ కుటుంబం నడిరోడ్డుపై పడింది. ఈ ఘటనలో చనిపోయి మరో వ్యక్తి లోవరాజు. లోవరాజుకు ఇంకా పెళ్లి కాలేదు. తల్లి, అన్నతో కలిసి ఉంటున్నాడు. పొలం పనుల్లో తల్లికి, అన్నకి తోడుండేవాడు. కానీ కళ్లముందే కొడుకు కన్నుమూయడంతో కన్నపేగు తట్టుకోలేకపోతుంది. ఇక ఏసుబాబు ది మరీ దారుణం.. ఏసుబాబుకు తండ్రి లేడు, ఇద్దరు అన్నలు ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళితే తల్లికి ఆసరా ఏసుబాబునే. అలాంటి ఏసుబాబు కళ్లెదుటే విగత జీవి కావడంతో అతల్లి కుమిలిపోతోంది.

ఇంతటి అరాచకానికి కారణమైన రాంబాబు ను కఠినంగా శిక్షించాలని లోదొడ్డి ఊరు ఊరంతా ముక్త కంఠంతో కోరుతోంది. కాగా, ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే రాంబాబుతో పాటు ప్రియురాలు లోవను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

— ఈశ్వర్, టీవీ 9 ప్రతినిధి, తూర్పు గోదావరి జిల్లా

Read Also….  Vijayawada crime: మహిళపై అత్యాచారం.. వీడియో తీసిన నిందితుడి భార్య.. ఆపై..??