జీవితం సాఫీగా సాగాలని చాలామంది కోరుకుంటారు. ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా సంతోషంగా ఉండాలనుకుంటారు. కానీ, ఇది అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే కొన్ని అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టి ఎవరికి వారే ఇబ్బందులు కొనితెచ్చుకుంటారు. అలాంటి కొన్ని అంశాలను వదిలేస్తే జీవితం సంతోషంగా ఉంటుంది.
ఎవరి జీవితం వారికి ఉంటుంది. ప్రతి ఒక్కరూ విభిన్నంగా ఉంటారు. వాళ్లకు ఉండాల్సిన సవాళ్లు వాళ్లకు ఉంటాయి. అందువల్ల ఇతరులతో పోల్చుకుని చేసేది ఏమీ ఉండదు. అలా చేస్తే మన లైఫ్‌లోనే సంతోషాన్ని కోల్పోవడంతో పాటు అనవసరంగా అభద్రతా భావానికి లోనవుతాం. కాబట్టి, మన లైఫ్ మీద దృష్టి పెట్టడం ముఖ్యం.
గతంలో చేసిన తప్పులు లేదా భవిష్యత్తులో ఏం జరగుతుందోననే ఆలోచనలను మానేయాలి. ఇది మనల్ని మరింత ఒత్తిడికి గురిచేస్తుంది. దానికి బదులుగా ఏం జరగుతుందో చూద్దాం అనే తత్వాన్ని అలవాటు చేసుకోవడం మంచిది. ప్రస్తుతం ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టి వాస్తవంలో బతకటం అలవరుచుకోవాలి.
ఇతరులతో గతంలో ఎదురైన చేదు అనుభవాలను పదే పదే గుర్తుచేసుకోవడం, వారిపై కోపం పెంచుకోవడం వల్ల మన మానసిక ఆరోగ్యానికే ప్రమాదం. అందువల్ల క్షమాగుణంతో వ్యవహరించడం మంచిది. ఇలాంటి నెగటివ్ ఎమోషన్లను తగ్గించుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది.
మనల్ని మనమే విమర్శించుకోవడం వల్ల ఆత్మన్యూనతకు లోనవుతాం. ఇతరులతో మెలిగినట్లే మనతో మనం ప్రేమగా ఉండాలి.
వివిధ వ్యక్తులు భిన్నంగా ఉంటారు. అందర్నీ మనం సంతృప్తి పరచలేం. అలా చేయాలని భావించి మనం ఇబ్బందులు కొనితెచ్చుకోకూడదు. దానికి బదులుగా ఇతరులతో సందర్భానికి తగినట్లుగా మెలగడం అవసరం.
సమయాన్ని వృథా చేయడం, పనుల్లో నిర్లక్ష్యం, జాప్యం వల్ల ఒత్తిడికి గురవటంతో పాటు తప్పు చేసిన భావన కలుగుతుంది. అందువల్ల మన పనిని విభజించుకుని త్వరగా పూర్తి చేసేలా ప్రణాళిక వేసుకోవాలి.
చెడు వ్యక్తులతో సావాసం వల్ల మనకు సంతోషం దూరమవుతుంది. వీరికి దూరంగా ఉంటూ మనల్ని గౌరవించేవారిని ఎంచుకోవడం మంచిది.
ప్రతిసారీ సక్సెస్ వెంట పడుతూ పోతే ఒత్తిడి, జీవితంలో అసంతృప్తి పెరిగిపోతుంది. మన ప్రగతిని కాపాడుకుంటూనే జీవితాన్ని ఎంజాయ్ చేయగలగాలి.