Rainy Season: వర్షాకాలంలో తడి బట్టలను ఇలా ఈజీగా ఆరబెట్టండి!
వర్షాకాలం వచ్చిందటే చాలు ఉతికిన బట్టలను ఆరబెట్టడం పెద్ద తలనొప్పి. గాలితగిలేందుకు బయటవేస్తే కొన్ని సార్లు వర్షం పడి మళ్లీ తడిచిపోతాయి. కొన్ని సార్లు సరిగ్గా ఆరవు. ఇందుకు ప్రధాన కారణం వర్షాకాలంలో చల్లని వాతావరణం, గాలిలో తేమ వల్ల ఉతికిన బట్టలు ఆరడానికి సమయం పడుతుంది. దీంతో బట్టలు స్మెల్ రావడం జరుగుతుంది. ఇలాంటప్పుడు ఇంట్లో ఉపయోగించగల కొన్ని చిట్కాలు ద్వారా ఈ సమస్యను మనం ఈజీగా అదిగమించవచ్చు.
Updated on: Aug 08, 2025 | 8:43 PM

కొందరు బట్టలను ఆరబెట్టేటప్పుడు దండంపై ఒకదానిపై మరొకటి వేస్తూ ఉంటారు. అలా చేస్తే బట్టలు త్వరగా ఆరవు, కాబట్టి బట్టలను వీలైనంత దూరంగా వేయండి. ఇలా చేస్తే బట్టలకు సరైన వెంటిలేషన్ తగిలి అవి త్వరగా ఆరిపోతాయి. ఇంకో విషయం అన్ని బట్టలు ఒకే తీగపై వేయడానికి బదులు వేరు వేరుగా వేయండి, లేదా హ్యాంగర్స్‌ను ఉపయోగించండి.

అయితే బయటవేసిన తర్వాత కూడా బట్టలు ఆరనప్పుడు వాటిని హెయిర్ డ్రైయర్‌లను ఉపయోగించి ఆరబెట్టవచ్చు. ఇది షర్ట్ కాలర్లు, స్లీవ్‌లు వంటి దుస్తులను ఆరబెట్టేందుకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఈ హెయిర్ డ్రైయర్‌లు వేడి గాలి ప్రవాహాన్ని విడుదల చేస్తుంది. దీని ద్వారా బట్టలు త్వరగా ఆరుతాయి.

మీ తడి బట్టలను ఆరబెట్టేందుకు మరో మంచి చిట్కా ఏంటంటే.. తడిగా ఉన్న క్లాత్ కింద ఒక పొడి టవల్‌ను వేసి దానిపై మరో టవల్‌తో కప్పండి. ఆ తర్వాత దాన్ని ఒక ఐరన్ బాక్స్‌తో ఇస్త్రీ చేయండి. అప్పుడు మీ క్లాత్‌కు ఉన్న తేమను టవల్స్ గ్రహిస్తాయి. దీనితో పాటు ఐరన్ బాక్స్ నుంచి వచ్చే వేడి వల్ల బట్టలు కూడా త్వరగా ఆరుతాయి.

ఒకవేళ ఆరవేసిన బట్టలు సరిగ్గా ఆరనప్పుడు వాటిని మీ ఇంట్లో ఫ్యాన్ కింద, లేదా వెంటిలేషన్ బాగా వచ్చే ప్రాంతంలో ఆరబెట్టండి. మీ బట్టలకు అన్ని వైపుల నుంచి గాలి బాగా తగిలేలా చూడండి. అయితే వీటిని గొడకు దగ్గర్లో కాకుండా ఒక స్టాండ్ వంటి దానిపై వేయండి. ఇలా చేయడం ద్వారా కూడా బట్టలు త్వరగా ఆరుతాయి.

ఇలాంటి చిట్కాలను పాటించడం ద్వారా బట్టలను త్వరగా ఆరబెట్టడంతో పాటు, స్మెల్‌రాకుండా ఉండేలా చూసుకొవచ్చు. (గమనిక పైన పేర్కొన్న అంశాలు కొన్ని ఇంటర్‌నెట్ నుంచి సేకరించిన సమాచారం మేరకు అందించబడినవి, ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే)




