AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elephants: మనుషుల నుంచి ఫ్రెండ్స్ వరకు.. ఏనుగులు ఎన్నేళ్లైనా ఎలా గుర్తుంచుకుంటాయో తెలుసా..?

ఏనుగులు వాటి భారీ శరీరం కంటే అద్భుతమైన జ్ఞాపకశక్తికి ప్రసిద్ధి. మందను నడిపించే మాతృమూర్తి జ్ఞానం ఒక లైబ్రరీ లాంటిది. కరువులో నీటి గుంటలు, వందల కిలో మీటర్లు వలస మార్గాలు, పాత స్నేహితులు, హాని చేసిన మనుషులు.. అన్నీ గుర్తుంచుకొని గుంపును రక్షిస్తుంది.

Elephants: మనుషుల నుంచి ఫ్రెండ్స్ వరకు.. ఏనుగులు ఎన్నేళ్లైనా ఎలా గుర్తుంచుకుంటాయో తెలుసా..?
Elephant Memory Power
Krishna S
|

Updated on: Nov 10, 2025 | 6:18 PM

Share

ఏనుగులు చాలా తెలివైన జంతువులు. వాటి భారీ శరీరం కంటే వాటి అద్భుతమైన జ్ఞాపకశక్తి ప్రపంచంలోనే ప్రత్యేకమైనది.ఈ జ్ఞాపకశక్తి వాటి మనుగడకు, సామాజిక బంధాలకు వెన్నెముకగా నిలుస్తుంది. ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్ జర్నల్’లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. ఏనుగులు దశాబ్దాలుగా వందలాది వ్యక్తులను, వలస మార్గాలను మరియు భావోద్వేగ అనుభవాలను గుర్తుంచుకోగలవు.

ఏనుగుల గుంపును మాతృమూర్తి అనే పెద్ద ఆడ ఏనుగు నడిపిస్తుంది. ఈ నాయకురాలి జ్ఞాపకశక్తి మొత్తం గుంపుకు ఒక లైబ్రరీ లాంటిది. కరువు వచ్చినప్పుడు, ఎక్కడా నీరు దొరకకపోయినా ఈ మాతృమూర్తి తన పాత జ్ఞాపకాల ఆధారంగా చాలా దూరంలోని నీటి గుంటలను గుర్తు చేసుకుని గుంపును అక్కడికి తీసుకువెళ్లి ప్రాణాలు కాపాడుతుంది. ఆహారం, సురక్షిత ప్రదేశాల కోసం వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించాలన్నా ఈ జ్ఞానమే మార్గనిర్దేశం చేస్తుంది.

ముఖాలు, స్నేహాలు  అన్నీ గుర్తే

ఏనుగులు కేవలం ప్రదేశాలే కాదు.. చాలా విషయాలు గుర్తుంచుకుంటాయి. అవి ఇతర ఏనుగుల ముఖాలను దశాబ్దాల పాటు గుర్తుంచుకుంటాయి. పాత స్నేహితులు కలిసినప్పుడు, అవి సంతోషంతో పెద్దగా అరుస్తాయి. తొండాలతో పలకరించుకుంటాయి. వాటికి హాని చేసిన లేదా రక్షించిన మానవుల ముఖాలు, దుస్తులు, ప్రవర్తన కూడా గుర్తుంటాయి. ప్రమాదకరమైన వ్యక్తులను చూస్తే భయపడతాయి. చనిపోయిన తమ కుటుంబ సభ్యుల ఎముకలు లేదా దంతాలను చూసినప్పుడు అవి నిలబడి మౌనంగా ఉండి బాధను వ్యక్తం చేస్తాయి.

వేటగాళ్ల వల్ల నష్టం: జ్ఞానానికే ముప్పు

వేటాడటం అనేది ఏనుగుల మనుగడకు అతిపెద్ద ముప్పు. వేటగాళ్లు సాధారణంగా పెద్ద దంతాలు ఉన్న మాతృమూర్తులను లక్ష్యంగా చేసుకుంటారు. ఒక మాతృమూర్తి చనిపోయినప్పుడు.. ఆ మంద దశాబ్దాల జ్ఞాపకశక్తిని కోల్పోతుంది. నీటి గుంటలు, ప్రమాద మండలాలు, సురక్షిత మార్గాల జ్ఞానం అన్నీ పోతాయి. మార్గదర్శకత్వం లేని చిన్న ఏనుగులు కరువు సమయంలో నీటిని కనుగొనడంలో లేదా మాంసాహారుల నుండి తమను తాము రక్షించుకోవడంలో విఫలం కావచ్చు.

ఈ విధంగా వేటాడటం అనేది కేవలం ఏనుగుల జీవితాలను మాత్రమే కాదు శతాబ్దాలుగా సేకరించబడిన జ్ఞానాన్ని కూడా తుడిచిపెడుతుంది. ఏనుగులను రక్షించడం అంటే ఈ తెలివైన జ్ఞాన వారసత్వాన్ని, మొత్తం గుంపు వారసత్వాన్ని రక్షించడమే.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..