
ప్రేమ.. దీనికి పేద, ధనిక అనే తేడా ఉండదు. ఎప్పుడు ఎవరిపై ఎలా ప్రేమ పుడుతుందో తెలియదు. కానీ ఆ ప్రేమను కలకాలం నిలబెట్టుకోవడమే పెద్ద సవాల్. ఓ యువతి తాను ప్రేమించిన యువకుడి కోసం రాష్ట్రాలు దాటింది. చివరకు తన ప్రియుడిని కలుసుకుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అప్పటికే యువతికి పెళ్లై 15 రోజులు అవుతుంది. యువతి ప్రేమ విషయం తెలిసి తల్లిదండ్రులు ఆమెకు బలవంతంగా పెళ్లి చేశారు. కానీ యువతి మాత్రం ప్రియుడే కావాలనుకుని ఏపీ నుంచి కర్ణాటకకు వెళ్లింది. దీంతో యువతి కుటుంబసభ్యులు సైతం ఆమెను వెతుక్కుంటూ అక్కడికి వెళ్లారు. ఆ జంట కనిపిస్తే చంపేస్తామంటూ రోడ్లపై తిరుగుతున్నారు. ప్రేమ జంట మాత్రం పోలీసులను ఆశ్రయించింది.
కర్ణాటకలోని కొప్పల్ జిల్లా పురసంగనల్ గ్రామానికి చెందిన వెంకటేష్, ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా కర్లకుంట గ్రామానికి చెందిన యువతి తిరుపతమ్మ లవ్ కహానీ ఇప్పుడు పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. యువతి తండ్రి లేబర్ కాంట్రాక్టర్. గతంలో బెంగళూరులో అతడి వద్దే వెంకటేష్ పనిచేశాడు. అక్కడ పనిచేస్తున్నప్పుడే తిరుపతమ్మతో అతడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. గత మూడేళ్లుగా వీరిద్దరూ లవ్ చేసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువతి ఫ్యామిలీ.. గ్రామానికి తీసుకెళ్లి వేరే వ్యక్తితో సంబంధం ఖాయం చేశారు. దీంతో మరో యువకుడిని తిరుపతమ్మ పెళ్లి చేసుకుంది. పెళ్లైన 15రోజులకే ప్రియుడికి ఫోన్ చేసింది. ఇక్కడ ఉండలేకపోతున్నాను.. అతడి దగ్గరకు వస్తానని చెప్పింది. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని స్పష్టం చేయడంతో.. వెంకటేష్ కూడా రమ్మన్నాడు.
ఆ తర్వాత కొప్పల్‌లో ఇద్దరూ కలుసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు కొప్పల్ వెళ్లి ఈ జంట కోసం వెతుకుతున్నారు. ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేస్తామంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో ప్రేమజంట కొప్పల్ ఎస్పీ కార్యాలయానికి వెళ్లింది. తాము కలిసి జీవించాలనుకుంటున్నామని.. తమకు రక్షణ కల్పించాలని కోరారు. రక్షణ కల్పించేవరకు అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుక కూర్చున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..