Matti Water Fest: కర్నూలు జిల్లాలో వినూత్న ఉగాది వేడుకలు.. ఒళ్లంతా బురద రాసుకుని..
రోడ్డు మీద వెళ్తుంటే మన మీద కొంచెం బురద పడితేనే ముఖం చిరాగ్గా పెడతాం.. అయితే అదే బురదను ఒళ్లంతా రాసుకుని వేడుక చేసుకుంటున్నారు
Kalluru Chowdeshwari Devi Temple: రోడ్డు మీద వెళ్తుంటే మన మీద కొంచెం బురద పడితేనే ముఖం చిరాగ్గా పెడతాం.. అయితే అదే బురదను ఒళ్లంతా రాసుకుని వేడుక చేసుకుంటున్నారు. ఇళ్ల మధ్య బురద గుంటలు.. అందులో దాదాపు 40 నుంచి 50 మంది పిల్లలూ, పెద్దలూ తెగ ఉత్సాహంగా కనిపిస్తున్నారు. వాళ్ల శరీరం మొత్తం బురదమయంగా మారిపోయింది. వారిని చూస్తే బురదలో ఆడుకోవడం సరదానా అనిపిస్తుంది. కానీ దాని వెనుక అసలు విషయం వేరే ఉంది.
కర్నూలు జిల్లాలోని కల్లూరులో ఉన్న చౌడేశ్వరిదేవి ఆలయంలో ఉగాది ఉత్సవాలు జరిగాయి. అయితే ఈ ఆలయంలో ఓ ఆచారం కొనసాగుతోంది. అదే ఈ బురద వేడుక. ఆలయం చుట్టూ బురద గుంటలు ఏర్పాటు చేసి, ఎడ్లబండ్లను అందులో ఊరేగిస్తారు. అంతేకాదు అలా వెళ్తున్న బండ్లపై బురద జల్లుతారు. అందుకే ఇప్పుడు మనం చూస్తున్న బురద గుంటల్లో పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా ఒళ్లంతా బురద రాసుకుని తెగ ఉత్సాహంగా జరుపుకున్నారు.
ఉగాది ఉత్సవాలు కల్లూరులోని చౌడేశ్వరిదేవి ఆలయంలో ఘనంగా జరిగాయి, ఆ తర్వాత ఇలా బురదలో బండ్ల ఊరేగింపు జరిగాయి. ఎద్దులు, గాడిద బండ్లను బురదలో ఊరేగించి, వాటిపై బురద జల్లుతూ తెగ ఎంజాయ్ చేశారు ఇక్కడి స్థానికులు. అంతేకాదు కొంతమంది చిన్నపిల్లలైతే ఏకంగా బురదమయంగా ఉన్న శరీరాలతో సెల్ఫీ కూడా తీసుకున్నారు. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అంటూ బురదలో మునిగితేలారు. అటు దేవుడి ఆచారంతో పాటు ఇటు మడ్ బాత్ కూడా శరీరానికి మేలు చేయడంతో స్వామి కార్యం స్వకార్యం కూడా తీరినట్టయింది.
అంతేకాదు, చౌడేశ్వరీ దేవి ఆలయంలో బంకమట్టితో బురదను ఏర్పాటు చేసి నిర్వహించిన గాడిదల ప్రదక్షిణలు ఆకట్టుకున్నాయి. అందులో అలంకరించిన గాడిదలను..గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించారు. ఇలా చేస్తే అంతా మంచే జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. ఈ వేడుకలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
Read Also… Corona Refund: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. టెన్షన్ పడుతున్న ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు