Andhra Pradesh: దారి సరిగాలేక గాలిలో ప్రయాణం.. డోలిలో ప్రసవించిన గిరిజన మహిళ

| Edited By: Balaraju Goud

May 18, 2024 | 7:51 PM

విజయనగరం జిల్లాలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డు సౌకర్యం లేక కుటుంబసభ్యులు డోలిలో తరలిస్తుండగానే మార్గ మధ్యలో పురిటినొప్పులతో అవస్థలు పడింది నిండు గర్బిణీ. చివరికి బహిరంగ ప్రదేశంలోనే ప్రసవించింది గిరిజన మహిళ. ఎస్ కోట మండలంలో రేగపుణ్యగిరి అనే గిరిశిఖర గ్రామం చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

Andhra Pradesh: దారి సరిగాలేక గాలిలో ప్రయాణం.. డోలిలో ప్రసవించిన గిరిజన మహిళ
Woman Delivered On Road
Follow us on

విజయనగరం జిల్లాలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డు సౌకర్యం లేక కుటుంబసభ్యులు డోలిలో తరలిస్తుండగానే మార్గ మధ్యలో పురిటినొప్పులతో అవస్థలు పడింది నిండు గర్బిణీ. చివరికి బహిరంగ ప్రదేశంలోనే ప్రసవించింది గిరిజన మహిళ. ఎస్ కోట మండలంలో రేగపుణ్యగిరి అనే గిరిశిఖర గ్రామం చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

ఈ గ్రామం నుండి విద్యా, వైద్యంతో పాటు ఇతర ఏ చిన్నపాటి అవసరం ఉన్నా సుమారు తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉన్న ఎస్ కోటకి రాక తప్పదు. అయితే రేగపుణ్యగిరి నుండి ఎస్ కోటకి రావడానికి మాత్రం రహదారి సౌకర్యం లేదు. దీంతో ఇక్కడి వారు ఎస్ కోటకు కాలి నడకనే ప్రయాణం చేస్తుంటారు. సాధారణంగా ఇతర పనుల పై వెళ్ళేవారు నడిచి వెళ్ళడం అలవాటుగా మారినప్పటికీ అనారోగ్య సమస్యలు తలెత్తితే మాత్రం నరకం చూడాల్సిందే..! అనారోగ్యంతో ఉన్న రోగిని హాస్పటల్ కి తరలించాలంటే వారికి డోలినే గతి.

ఇలాంటి పరిస్థితుల్లో ఈ గ్రామానికి చెందిన కుసాయి అనే గిరిజన మహిళకు అకస్మాత్తుగా పురిటినొప్పులు మొదలయ్యాయి. దీంతో రేగ పుణ్యగిరి నుండి ఎస్ కోట ఆసుపత్రికి డోలి సహాయంతో బయలుదేరారు కుసాయి కుటుంబసభ్యులు. అలా డోలిలో కొంత దూరం ప్రయాణించగా కుసాయికి పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో చేసేదీలేక మార్గ మధ్యలోనే డోలిని నిలిపివేసి కాన్పు కోసం నాటు వైద్యం ప్రారంభించారు కుటుంబ సభ్యులు. ముందుగా కుసాయి చుట్టూ చీరలు కట్టి బంధువులు కాన్పు కోసం సహాయక చర్యలు చేపట్టారు. అలా సుమారు గంటకు పైగా అవస్థలు పడి చివరకు కుసాయి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

అయితే అప్పటికే నాటు వైద్యం కారణంగా కుసాయి తీవ్రంగా అలసిపోయి నీరసించిపోయింది. అయితే ప్రసవం జరిగిన దగ్గర నుండి ఎస్ కోట ఆసుపత్రికి మరో ఐదు కిలోమీటర్ల దూరం ఉండటంతో చేసేదీలేక తిరిగి డోలిలో తమ ప్రయాణాన్ని ప్రారంభించారు కుసాయి కుటుంబ సభ్యులు. తల్లిని, బిడ్డను ఒకే డోలిలో పెట్టి అనేక అవస్థలు పడి సుమారు మూడు మూడు గంటలపాటు రాళ్లు రప్పల మధ్య ప్రయాణం సాగించి ఎట్టకేలకు ఎస్ కోట ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే అప్పటికే కుసాయి ఆరోగ్యపరిస్థితి సరిగా లేకపోవడంతో హుటాహుటిన చికిత్స ప్రారంభించారు వైద్యులు. తల్లికి, బిడ్డకు వైద్యులు మెరుగైన వైద్యం అందించడంతో సుమారు రెండు గంటల తర్వాత వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది.

విజయనగరం జిల్లాలో జరిగిన ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్లు దాటినా ఇలా నడిరోడ్డు పై ఒక మహిళ ప్రసవం జరుపుకోవాల్సిన దుస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లావాసులు. ఇప్పటికైనా రోడ్డు మార్గం లేని తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి తమను అన్ని విధాల ఆదుకోవాలని కోరుతున్నారు రేగపుణ్యగిరి గ్రామస్తులు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..