Uttarakhand Floods: ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల క్షేమాన్నే కోరుతారు. వారు కలకాలం సంతోషంగా జీవించాలని ఆకాంక్షిస్తారు. అదే వారికి ఆపద వాటిల్లుతుందని తెలిస్తే.. ఆ క్షణంలో వారు పడే వేదన అంతా ఇంతా కాదు. తమ పిల్లలను రక్షించుకోవడానికి ఉన్న ప్రతీ ఒక్క అవకాశాన్నీ సద్వినియోగించుకుంటారు. ఇటీవల ఉత్తరాఖండ్‌లో సంభవించిన జలప్రళయానికి ముందు ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తన కొడుకుకు ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన ఓ తల్లి అతనికి ఫోన్ చేసి అలర్ట్ చేసింది. అలా తన కొడుకునే కాకుండా.. అతనితో పాటు మరో 24 మంది ప్రాణాలను కాపాడింది. పూర్తి వివరాల్లోకెళితే..
గత ఆదివారం మంచు కొండలు విరిగి పడి ధౌలిగంగా నది పొంగింది. దాంతో అక్కడి విద్యుత్ ప్రాజెక్టులు మునిగిపోయాయి. వందలాది మంది ఆ జల ప్రళయంలో గల్లంతయ్యారు. అయితే, ఈ జల ప్రళయం నుంచి అదృష్టావశాత్తు విపుల్ కైరేనీ, అతని వెంట ఉన్న 24 మంది తప్పించుకున్నారు. ఈ గండం నుంచి తప్పించుకుని వారు బయటపడటానికి కారణం.. విపుల్ కైరేనీ తల్లి చేసిన ఫోన్ కాల్.
ముంపునకు గురైన విద్యుత్ కేంద్రంలో విపుల్ కైరేనీ ఓ వాహనానికి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే ప్రమాదం జరిగిన రోజు విపుల్ విధుల్లో ఉండగా అతని తల్లి మంగ్ శ్రీదేవి అతనికి పలుమార్లు ఫోన్ చేసింది. పొంచిఉన్న ఉపద్రవం గురించి అతనికి తెలిపింది. మంచుపర్వతం పగిలిందని, ధౌలిగంగా ప్రవాహం పెరిగిందని తన కుమారుడిని హెచ్చరించింది. అయితే, విపుల్ ఈ విషయాన్ని ముందుగా నమ్మలేదు. కానీ, పలుమార్లు ఫోన్ కాల్ రావడంతో.. విపుల్ అలర్ట్ అయ్యాడు. తన సమీపంలో ఉన్న 24 మందిని కూడా అలర్ట్ చేయడంతో వారంతా విద్యుత్ కేంద్రం నుంచి ఎత్తైన ప్రాంతానికి పరుగులు తీశారు. అలా వారు కొండ ప్రాంతానికి చేరుకోగానే.. విద్యుత్ కేంద్రాన్ని వరద ప్రవాహం ముంచెత్తింది. అది చూసి వారు షాక్‌కు గురయ్యారు. తన తల్లి ఫోన్ చేయడం వల్లే తామంతా బ్రతికి బయటపడ్డామని విపుల్ తెలిపాడు. ఇక, విపుల్‌తో పాటు ప్రాణాలు కాపాడుకున్న మిగతవారు కూడా మంగ్ శ్రీదేవికి కృతజ్ఞతలు తెలిపారు. జీవితాంతం తాము ఆమెకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు.ఆమే ఫోన్ చేయకపోయి ఉంటే తాము కూడా చనిపోయేవారమని అన్నారు.
Also read:
Sitara Ghattamaneni New Photos: ‘సర్కార్ వారి పాట’ షూట్ లో మహేశ్ గారాల పట్టి ‘సితార’ హంగామా
Hero Prabhas: ‘మా పాజిటివ్ హీరోకే ఎందుకు ఈ కష్టాలు’.. తెగ వర్రీ అవుతున్న ప్రభాస్ అభిమానులు