Hyderabad: మహానగరంలో వానొస్తే నరకమే.. బురదలో కూర్చొని నిరసన తెలిపిన మహిళ.. అసలేం జరిగిందంటే..

|

May 24, 2024 | 12:01 PM

మాయగాళ్ల సంగతేమో కానీ, వానొస్తే మహానగరం ప్రత్యక్ష నరకమే. చినుకు పడితే ట్రాఫిక్‌ పద్మ వ్యూహం. వాన తగ్గినా నగరవాసుల గుండెల్లో అలజడినే. ఇక్కడా అక్కడా అనే తేడాలేదు. ఏ గల్లీ చూసినా రోడ్లన్నీ అస్తవ్యస్తం. వెళ్లొస్తామని చెప్పి బయలుదేరినా, మళ్లీ ఇంటికి చేరుతారా? లేదా? అనే గ్యారెంటీ లేదు. ఎందుకంటే అడగడుగునా ప్రాణ గండమే. విశ్వనగరి బ్రాండ్‌ సరే హైదరాబాద్‌లో రోడ్‌ సేఫ్టీ ఎంత?

Hyderabad: మహానగరంలో వానొస్తే నరకమే.. బురదలో కూర్చొని నిరసన తెలిపిన మహిళ.. అసలేం జరిగిందంటే..
Woman Protest For Road
Follow us on

మాయగాళ్ల సంగతేమో కానీ, వానొస్తే మహానగరం ప్రత్యక్ష నరకమే. చినుకు పడితే ట్రాఫిక్‌ పద్మ వ్యూహం. వాన తగ్గినా నగరవాసుల గుండెల్లో అలజడినే. ఇక్కడా అక్కడా అనే తేడాలేదు. ఏ గల్లీ చూసినా రోడ్లన్నీ అస్తవ్యస్తం. వెళ్లొస్తామని చెప్పి బయలుదేరినా, మళ్లీ ఇంటికి చేరుతారా? లేదా? అనే గ్యారెంటీ లేదు. ఎందుకంటే అడగడుగునా ప్రాణ గండమే. విశ్వనగరి బ్రాండ్‌ సరే హైదరాబాద్‌లో రోడ్‌ సేఫ్టీ ఎంత?.. వాస్తవాలను కళ్లకు కడుతూ వినూత్న నిరసనలకు దిగారు నగరవాసులు.

మార్పు సరే.. వానొస్తే మృత్యు పిలుపే అనే మరకపోయేదీ ఇంకెప్పుడు? వర్షం పడిందంటే చాలు చెరువుల్ని తలపించేలా రోడ్లపై వరద పోటెత్తే దృశ్యం షరా మామూలైపోయింది. చిన్న చినుకు పడినా మహానగరం చిత్తడే. నరకాన్ని తలపించేలా నగర వ్యాప్తంగా వరద మత్తడే.: వానొస్తే ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో బండి కదలదు. ఎక్కడ ఏ మ్యాన్‌హోల్‌ ఉంటుందో తెలియదు. నీటి కింద చావులా నోళ్లు బార్లా తెరిచే బ్లాక్‌ డెత్‌ స్పాట్స్‌ ఎన్నెన్నో.

వాన పడితే గల్లీ గల్లీలో వరద-బురద. అడుగు తీసి అడుగు వేయడమంటే గండమే.. మెయిన్‌ రోడ్లపై ట్రాఫిక్‌ నరకం.. కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యక్ష నరకం. వానొచ్చినప్పుడు ఒక బాధ, వాన వెలిశాక మరో బాధ. ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోతాయి. దోమల బెడద సరేసరి. చిన్నపాటి చెరువుల్ని తలపించేలా రోడ్ల మీద వరద-బురద. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా బురద కుంటల్ని తప్పించుకొని వెళ్లడం మినహా మరో గత్యంతరం లేదు. ఉండదు. అక్కడో ఇక్కడో కాదు రద్దీగా ఉండే రోడ్లపై వాహనదారులకు,పాదాచారులకు నిత్య నరకమే.

వర్షం ఎన్ని సెంటిమీటర్లు అన్నది కాదు పాయింట్‌.. చినుకుపడితే ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లు చిత్తడయ్యాయి. ఆ రూట్లో ప్రజల అవస్తలేంటన్నది ఇంపార్టెంట్‌. ఇక్కడే అక్కడా అనే తేడాలేదు. లోతట్టు ప్రాంతాలు మొదలు హైటెక్‌ ఏరియాల వరకు ఇదే వరుస. విశ్వనగరిగా ప్రగతి పరుగులు సరే. బ్రాండ్‌ ఇమేజ్‌ను పంక్చర్‌ చేస్తోన్న ఈ అతుకులు గతుకుల రోడ్ల దైన్యం పరిస్థితి ఏంటి?. నోళ్లు బార్లా తెరిచి ఉండే మ్యాన్‌హోల్‌లో ఎవరైన పడి ప్రమాదం జరిగే వరకు బల్దియా చాప కిందకు నీరు రాదా?.

రుతుపవనాలు ముందే పలకరించాయనే చల్లని కబురు. మాడు పగలకొట్టిన ఎండలకు ఎండ్‌ కార్డ్‌ వేస్తూ వానొచ్చిందనే ఆనందం. ఇదిగో ఇట్టాటి దృశ్యాలతో ఆవిరైపోతుంది. ఆల్‌ ఈజ్‌ వెల్‌ అని ఢంకా కొట్టడమే కానీ గ్రౌండ్‌ లెవల్‌లో ఈ దుస్థితి గ్రేటర్‌ హైదరాబాద్‌ పాలకులకు, అధికారులకు పట్టదా? లేదంటే మాకేంటిలే అని పట్టీ పట్టన్నట్టు లైట్‌గా తీసుకుంటున్నారా? చూడబోతే బల్దియా వైఖరి అలానే ఉందంటూ కన్నెర్ర చేశారు నగర వాసులు. ఇంట్లో చెప్పి రోడ్డెక్కినా మళ్లీ ఇంటికి క్షేమంగా చేరే పరిస్థితుల్లేవు. అందుకు ఇదిగో నిదర్శనమంటూ వినూత్న నిరసన చేపట్టారిలా.

కొందరు ఫ్లకార్డులతో అలా నిరసన వ్యక్తం చేస్తే.. నగరవాసుల ఆవేదనను కళ్లకు కడుతూ ఓ మహిళ ఎల్బీ నగర్ పరిధిలోని నాగోల్ బండ్లగూడ ఇలా ఆందోళనకు దిగారు. వానొచ్చింది. నాసిరకం రోడ్డును తుడిచి పెట్టేసింది. కంకర తేలడమే కాదు ఏకంగా గుంతలు పడి నీళ్లు నిలిచిపోయాయి. పిల్లలో పెద్దలో అటుగా వెళ్తే.. అక్కడేదైనా మ్యాన్‌ హోల్‌ ఉంటే పరిస్థితి ఏంటి? జరగకూడినిదీ జరిగితే అందుకు బాధ్యులెవరు?. వర్షం తెరిపిచ్చినా బల్దియా కళ్లు మాత్రం తెరుచుకోవడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బురదలో కూర్చుని మరి నిరసన వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌ పోలీసులు నచ్చచెప్పినా సరే ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. రోడ్‌ సేఫ్టీపై జీహెచ్‌ఎంసీ అధికారులు నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తగ్గేదేలేదన్నారు.

మహిళ ఒంటరి పోరాటం వీడియో చూడండి…

బిల్లు కట్టకపోతే నీళ్ల కుళాయి కట్‌.. కరెంట్‌ కట్‌.. ఆస్తి పన్ను ఆ పన్ను ఈ పన్ను చివరాఖరకు చిరువ్యాపారులపై ఘీంకరింపు.. పన్నుల వసూళ్లలో హక్కుల సరే, మరి రోడ్డు సేఫ్టీపై బల్దియా బాధ్యత ఏది..? వాన వెలిసినా నడిరోడ్లపై వరద -బురద పేరుకుపోయినా గ్రేటర్‌ హైదరాబాద్‌ పాలకులు, అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు. మా కష్టాలు కడగండ్లు మీకు కనపడవా అంటూ మహానగర వ్యాప్తంగా ఇలా వినూత్న నిరసనలు హోరెత్తుతున్నాయి. మార్పు సరే మహానగరానికి ఈ మరకలు ఇంకెన్నాళ్లు? తాత్కాలిక చర్యలే తప్ప వరద నివారణకు శాశ్వత పరిష్కారం ఏదని ప్రశ్నిస్తున్నారు హైదరాబాద్‌ వాసులు.తమ సమస్యలను ప్రపంచ సమస్యగా చూడాలనుకునేవాళ్లుంటారు. కానీ అందరి సమస్యల కోసం మగువులు ఉద్యమించారిలా. మరి ఇప్పటికైనా బల్దియా స్పందించేనా? జాగో జీహెచ్‌ఎంసీ జాగో..!

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…