సాధారణంగా పిల్లల కోసం ఎక్కువగా తల్లులే కష్టపడుతున్నట్టుగా మనం చూస్తుంటాం. పుట్టినప్పటి నుంచి వారి పోషణ, పెంపకం లాంటివన్నీ తల్లి చేతుల మీదుగా ఉన్నట్టుగానే మనం గమనిస్తూ ఉంటాం. కానీ దాని వెనక ఆ తండ్రి పడే కష్టం సాధారణంగా కనపడదు. ఆ బిడ్డకి ఆ తల్లి ఇచ్చే పోషణ వెనుక తండ్రి త్యాగం ఆ స్థాయిలో గుర్తింపు పొందదు. కానీ ఈ కేసులో దానికి పూర్తి భిన్నంగా బిడ్డ పుట్టుకతోనే ఈ తండ్రికి కష్టం ఎలా వచ్చిందో చూస్తే కన్నీరు పెట్టక తప్పదు..!
కాకినాడ జిల్లా కోటనందూరు గ్రామానికి చెందిన అల్లు శిరీష అనే గర్భిణికి నెలలు నిండకుండానే పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం విశాఖలోని కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చేర్పించారు. అయితే నెలలు నిండకుండానే శిరీష ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో బిడ్డకు కాస్త పరిపక్వత వచ్చే వరకు నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. అవసరమైన పోషణ తోపాటు తల్లి గర్భం లాంటి ఆ యూనిట్ లో ఉంచడం ద్వారా సాధారణ జననం లాంటి సౌకర్యాన్ని కల్పించాలి. ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా అది కాపాడేందుకు NICలో ఉంచాలని వైద్యులు నిర్ణయించారు.
ఆక్సిజన్ సిలిండర్ ఎత్తుకుని బిడ్డను తీసుకెళ్లిన తండ్రి..!
నెలలు పూర్తి కాకుండానే జన్మించిన ఆ శిశువును పిల్లల వార్డుకు అనుబంధంగా ఉండే ఎన్ఐఐసీయూలో ఉంచాలని వైద్యులు సూచించడంతో ఆ పసికందును తక్షణం ఆ వార్డుకు తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ ఆ సమయానికి అక్కడ సిబ్బంది లేదు. ఆక్సిజన్ పెట్టి ఎన్ఐసీయూ కు తీసుకెళ్ళాల్సి రావడంతో ఆ ఆక్సిజన్ సిలిండర్ ను మోసే శక్తి అక్కడ ఉన్న మహిళా సిబ్బంది కి లేదు. దీంతో తండ్రి ఆ బాధ్యతను తీసుకున్నాడు తండ్రి అల్లు విష్ణు మూర్తి.
వైరల్‌గా మారిన వీడియో
అత్యవసర పరిస్థితుల్లో అప్పుడే పుట్టిన బిడ్డను నర్సు తన చేతుల్లో పెట్టుకొని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు బయలుదేరగా, సమయానికి సిబ్బంది లేకపోవడంతో శిశువు తండ్రి అల్లు విష్ణుమూర్తి ఆక్సిజన్ సిలిండర్‌ను భుజాన వేసుకొని ఆమె వెంట నడవడం హృదయాల్ని తడిమేసింది. తన బిడ్డకు ఏమీ కాకుండా ఉండాలని, అందుకు ఏం చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని ఆ తండ్రి అలా సిలిండర్ ను భుజాన వేసుకుని వెళ్తుండడం చూసిన వారికి కన్నీటిని తెప్పించింది. ఈ ఘటనను గమనించిన అక్కడే ఉన్న వేరే చిన్నారుల తండ్రులు వీడియో తీయగా మరికొందరు సోషల్ మీడియా లో పెట్టారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.
స్పందించిన కేజీహెచ్ సూపరిండెంట్
సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ కావడంతో కే జీ హెచ్ సూపరిండెంట్ డాక్టర్ శివానంద్ ఘటన వివరాలను ఆరా తీశారు. సంబంధిత వార్డు వైద్యులు, సిబ్బందిని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆదేశించారు. ఇక నుంచి ఇలాంటి వాటికోసం బ్యాటరీ వాహనాలను అందుబాటులోకి తెచ్చి ఇలాంటి ఘటనలను నివారిస్తామన్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..