Rewind@25: ఈ పాతికేళ్ల కాలగమనం.. ప్రపంచానికి నేర్పిన పాఠాలేంటి? గొప్ప మార్పులేంటి?

|

Dec 31, 2024 | 10:00 PM

కరోనా కాటు.. సునామీ పోటు.. ఉగ్రవాదం.. యుద్ధోన్మాదం.. టెక్నాలజీ కొత్తపుంతలు.. అంతరిక్ష వింతలు.. మోదీకి హ్యాట్రిక్‌ పట్టం.. చారిత్రక అయోధ్య ఘట్టం.. ఇవన్నీ సంచలనమే.. ఈ శతాబ్దానికి 25 ఏళ్లుః ఈ పాతికేళ్ల పరిణామాలేంటి? దేశంలో.. తెలుగు రాష్ట్రాల్లో.. అంతర్జాతీయంగా జరిగిన గొప్ప మార్పులు.. ఘటనలు.. అభివృద్ధి.. రౌండప్ 2024.. ఓ లుక్కెయండి..

Rewind@25: ఈ పాతికేళ్ల కాలగమనం.. ప్రపంచానికి నేర్పిన పాఠాలేంటి? గొప్ప మార్పులేంటి?
Millennium Round-Up
Follow us on

మిలీనియం తర్వాత ఈ శతాబ్దంలో పాతకేళ్ల మైలురాయి దాటేశాం. 2000 తర్వాత ప్రపంచ ముఖచిత్రమే మారిపోయింది. ఈ పాతికేళ్లలో ఎన్నో సవాళ్లు ఎదుర్కుంది. ఎన్నన్నో కొత్త పాఠాలు నేర్చుకుంది. యావత్‌ ప్రపంచాన్ని కరోనా కుదిపేసింది. లక్షల ప్రాణాలు గాల్లో కలిపేసింది. క్లిష్టపరిస్థితుల్లోనూ ఎలా బతకాలో ఈ మహమ్మారి నేర్పింది. రెండున్నరదశాబ్దాల్లో సాధించిన సాంకేతిక విప్లవం మరో ప్రపంచాన్ని కళ్లముందు ఉంచింది. ఐఫోన్‌, ఫేస్‌బుక్‌లాంటి ఆవిష్కరణలు స్మార్ట్‌గా బతకడం నేర్పించాయి. రష్యా-ఉక్రెయిన్‌, ఇజ్రాయిల్‌-హమాస్‌ యుద్ధాలు ఎలా బతక్కూడదో ప్రపంచానికి గుణపాఠంగా మిగిలాయి.

ఉగ్రవాద దాడులతో అగ్రరాజ్యం అట్టుడికింది. అంతర్యుద్ధాలు, తిరుగుబాట్లు కొన్ని దేశాలను కుదిపేశాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, ఇజ్రాయెల్‌-హమాస్‌ ప్రతీకారదాడులు ప్రపంచాన్ని భయపెట్టాయి. పదిహేడేళ్లక్రితం ప్రపంచాన్ని వణికించిన ఆర్థికమాంద్యం.. ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులా ప్రపంచాన్ని హెచ్చరిస్తూనే ఉంది. ఈ శతాబ్దం ఆరంభంలోనే అగ్రరాజ్యంపై పంజా విసిరింది ఉగ్రవాదం. ప్రపంచ ఉగ్రవాద చరిత్రలోనే కనీవినీ ఎరుగని దాడి అది. 2001 సెప్టెంబరు 11న న్యూయార్క్‌ నడిబొడ్డున నరమేథానికి తెగబడ్డాయి ఉగ్రమూకలు. విమానాలతో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ని నేలమట్టం చేశారు. ఈ దాడిలో దాదాపు 9వేలమంది మృత్యువాత పడ్డారు. ఈ ఎటాక్‌కి మాస్టర్‌మైండ్‌ బిన్‌లాడెన్‌ని పదేళ్ల తర్వాత హతమార్చింది అగ్రరాజ్యం.

9/11 దాడుల తర్వాత మూడేళ్లకే మరో ఊహించని విపత్తుతో ఉక్కిరిబిక్కిరైంది యావత్‌ ప్రపంచం. ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో 2004 డిసెంబరు 26న 9.2 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం.. పెను విపత్తుని ప్రపంచానికి పరిచయం చేసింది. సునామీతో సముద్రం తీరప్రాంతాలను ముంచెత్తింది. 14 దేశాల్లోని తీరప్రాంతాలు మరుభూములుగా మారాయి. 30 మీటర్ల ఎత్తు వరకూ ఎగసిపడిన రాకాసి అలలు దాదాపు రెండున్నర లక్షలమందిని మింగేశాయి. భారత్‌లోనే 16వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటికి అధునాతన వ్యవస్థలు లేకపోవడంతో సునామీ తీవ్రతని శాస్త్రవేత్తలు అంచనా వేయలేకపోయారు. తర్వాత ప్రపంచ దేశాలు భూకంపాలు, సునామీల సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంతో పాటు పరస్పరం పంచుకున్నాయి.

మనుషుల్ని ఇళ్లల్లోనే బందీలుగా మార్చేసిన మరో సవాలు వైరస్‌ రూపంలో ఈ ప్రపంచానికి ఎదురైంది. మూడేళ్లపాటు కరోనా వైరస్‌తో విశ్వమంతా అల్లకల్లోలంగా మారింది. కాస్త గ్యాప్‌ ఇచ్చినట్లే ఇస్తూ కొత్త వేరియంట్ల రూపంలో కబళించింది కరోనా. 2020 జనవరి నుంచి 2022 ఆఖరిదాకా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. కోటీ 33 లక్షలమంది నుంచి కోటి 66 లక్షల మంది వరకూ మరణించి ఉండొచ్చని డబ్ల్యూహెచ్‌వో అంచనా వేసింది. కోలుకున్న బాధితులను పీడకలలా వెంటాడుతూనే ఉంది మహమ్మారి వైరస్‌. కోవిడ్‌ దీర్ఘకాల లక్షణాలు ఇప్పటికీ ఎందరినో కుంగదీస్తున్నాయి.

ప్రకృతి వైపరీత్యాలు, మహమ్మారి వైరస్‌ మధ్య ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని కత్తి మొనపై నిలబెట్టింది. 2008లో వాల్ స్ట్రీట్ బ్రోకరేజీ సంస్థ దివాలాతో అమెరికా కేంద్రంగా ప్రపంచ ఆర్థిక మాంద్యం మొదలైంది. వివిధ దేశాల మధ్య బ్యాంకింగ్, ఫైనాన్స్ సేవల అనుసంధానం కారణంగా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఇది భారీ ప్రభావం చూపింది. గ్లోబల్ సప్లై చైన్ తీవ్రంగా దెబ్బతింది. వందల కోట్ల డాలర్ల మదుపర్ల సంపద ఆవిరైంది. 2008 సమయంలో భారత్ ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉండడంతో కొద్దిపాటి ప్రభావంతోనే బయటపడగలిగింది. కానీ తర్వాత కూడా రెసిషన్‌ ప్రపంచ దేశాల్ని టెన్షన్‌ పెట్టిస్తూనే వస్తోంది. 107 దేశాల్లో పరిస్థితులు విషమిస్తున్నట్టు రెండేళ్లక్రితం కూడా ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రపంచాన్ని థర్డ్‌ వరల్డ్‌వార్‌ వెంటాడుతోంది. రష్యా కొత్త అధినేత పాతికేళ్ల తర్వాత కూడా అధికారంలో ఉంటారని, ఆయన నాయకత్వంలోనే ఉక్రెయిన్‌పై ఇంత సుదీర్ఘ యుద్ధం జరుగుతుందని ఊహించలేదెవరూ. 1999 డిసెంబరు 31న ఎల్సిన్‌ రాజీనామాతో తాత్కాలిక అధ్యక్షుడైన పుతిన్‌.. పాతికేళ్లుగా దేశాధినేతగా ఉన్నారు. మూడేళ్లక్రితం ఉక్రెయిన్‌పై రష్యా మొదలుపెట్టిన యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. తీవ్రంగా నష్టపోయినా ఉక్రెయిన్‌ ప్రతిఘటిస్తూనే ఉంది. అటు రష్యాకు కూడా ఈ యుద్ధం తీరని నష్టం కలిగించింది. ఆర్థికమూలాలను దెబ్బతీసింది. ఇప్పటికీ రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ ప్రపంచానికి సవాలుగానే ఉంది.

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం 15నెలలుగా ఆరనికాష్టంలా రగులుతూనే ఉంది. 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్‌ గ్రూప్‌ హమాస్‌ దాడితో మొదలైన యుద్ధం నిస్సహాయులపైనా నరమేథం సృష్టిస్తోంది. గాజాలో వేలమంది మరణించారు. లక్షలమంది నిరాశ్రయులయ్యారు. ఇరాన్‌, హెజ్బొల్లా జోక్యంతో ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. రెండువైపులా ఇప్పటికే దాదాపు 50వేలమంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్‌ని నామరూపాల్లేకుండా చేసేదాకా యుద్ధం ఆగదని పంతంపట్టింది ఇజ్రాయెల్‌. ఈ యుద్ధం విస్తరిస్తే పశ్చిమాసియాకే కాదు ప్రపంచానికే పెనుముప్పు తప్పదన్న భయాందోళనలు వెంటాడుతున్నాయి.

పాతికేళ్లలో ప్రపంచదేశాల్లో చాలాచోట్ల సంక్షోభాలు, అనిశ్చితి చోటుచేసుకున్నాయి. భారత్‌కు ఇరుగుపొరుగున ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్‌ తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నాయి. 2022లో ఆర్థికసంక్షోభంతో శ్రీలంక ఒడ్డునపడ్డ చేపలా గిలగిలా కొట్టుకుంది. కొలంబోలో నిరసనకారులు అధ్యక్షభవనంలోకి జొరబడటంతో గొటబయ రాజపక్సే దేశం విడిచిపారిపోయారు. లెఫ్ట్‌పార్టీనేత దిసానాయకే 2024లో కొత్త అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసేదాకా కొనసాగింది శ్రీలంక సంక్షోభం. 2024 ఆగస్టు సంక్షోభం బంగ్లాదేశ్‌లో మంటలు రేపింది. అల్లర్లతో బంగ్లాదేశ్‌ అట్టుడికింది. పరిస్థితి చేజారటంతో దేశం వీడిన ప్రధాని హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం భారత్‌పై విషం చిమ్ముతోంది అక్కడి తాత్కాలిక ప్రభుత్వం. డిసెంబరు 8న బషర్‌ అల్‌ అసద్‌ దేశం విడిచి రష్యాకి పారిపోయాక సిరియా రెబల్స్‌ దళాల పాలనలో ఉంది.

పశ్చిమాసియాపై సిరియా అంతర్యుద్ధం తీవ్ర ప్రభావం చూపేలాఉంది. యుద్ధభయాల సంగతెలా ఉన్నా.. కొత్త శతాబ్దంలో ఈ పాతికేళ్ల కాలంలో ప్రపంచం సాంకేతికంగా ఎంతో పురోగమించింది. మొబైల్స్‌ నుంచి ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ దాకా మనిషి జీవనశైలినే మార్చేసింది టెక్నాలజీ. మొబైల్‌ టెక్నాలజీ నుంచి యాపిల్‌ ఫోన్లదాకా సాంకేతికత అంచనాలకు అందకుండా ఎదిగింది. ఇవాళ మూడోవంతు ప్రపంచం రోజూ బతికేసే ఫేస్‌బుక్‌, ట్విటర్‌, యూట్యూబ్‌వంటి సోషల్‌మీడియా మాధ్యమాలను పరిచయం చేసింది ఈ పాతికేళ్ల కాలమే.

మోదీకి హ్యాట్రిక్‌ పట్టం.. చారిత్రక అయోధ్య ఘట్టం.. అబ్బురపడిన అంతరిక్షం

ల్యాండ్‌ లైన్‌ ఫోన్లనుంచి ఐ ఫోన్లదాకా వస్తామని ఊహించామా? మనిషి మేథస్సుకే సవాల్‌ విసిరే కృత్రిమమేథ పుట్టుకొస్తుందని ఏనాడైనా అనుకున్నామా? అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రదేశాల సరసన చేరతామని అంచనా వేశామా. ఉత్తరాల నుంచి వాట్సాప్‌ చాట్‌లదాకా సాంకేతికంగా ఇంతగా ఎదుగుతామని పాతికేళ్లక్రితం భవిష్యత్‌ దృశ్యాన్ని కనీసం కలగన్నామా? ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ప్రపంచానికి ఇప్పుడు ఆకాశమే హద్దు. అవును.. మనం ఇప్పుడు మరో ప్రపంచంలో ఉన్నాం. మిలీనియం ఎట్‌ ట్వంటీఫైవ్‌.

ప్రపంచంలో వేగంగా వస్తున్న మార్పులను భారత్‌ అందిపుచ్చుకుంటోంది. కొన్ని విషయాల్లో ప్రపంచానికే మార్గదర్శనంచేస్తోంది. ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌, డ్రోన్‌ టెక్నాలజీలో అడుగు ముందుకేస్తోంది. అంతరిక్ష ప్రయోగాల్లో ఆకాశమే హద్దుగా విజయాలందుకుంటోంది భారత్‌. 60సంవత్సరాల క్రితమే తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఇస్రో..ఈ పాతికేళ్లలో అగ్రదేశాలను కూడా అబ్బురపరిచింది. తొలి ప్రయత్నంతోనే అంగారకుడిపై ప్రయోగాల్లో విజయవంతమైన దేశంగా భారత్ అవతరించింది. 2023 జులై 14న ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ త్రీ… ఆగస్ట్ 23న విజయవంతంగా చంద్రుడిపై ల్యాండయ్యింది. ఈ విజయంతో చంద్రుడి దక్షిణ ధ్రువంలో ల్యాండైన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.

కొత్త సంవత్సరానికి కొన్ని గంటలముందు శ్రీహరికోట నుంచి రాకెట్‌ ప్రయోగం భారత్‌ అంతరిక్ష ప్రయోగాల్లో మరో మైలురాయిగా నిలిచింది. అంతరిక్షంలోనే వ్యోమనౌకలను డాకింగ్, అన్ డాకింగ్ చేయగల సాంకేతిక అభివృద్ధే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టారు. ఈ ప్రయోగ విజయంతో ఈ సాంకేతికత ఉన్న అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన నాలుగో దేశంగా నిలిచింది భారత్. ప్రస్తుతం నాలుగు టన్నుల బరువును అంతరిక్షంలోకి మోసుకెళ్లే సామర్థ్యానికి ఇస్రో సాంకేతికత ఎదిగింది. గగనయాన్ ప్రాజెక్ట్ ద్వారా మానవ సహిత అంతరిక్ష యాత్ర లక్ష్యంగా ఇస్రో ప్రయత్నాలు మొదలుపెట్టింది.

అంతరిక్ష ప్రయోగాల్లోనే కాదు రాజకీయంగా కూడా దేశంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. 2004 తర్వాత వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ని.. ఆ తర్వాత వరుసగా మూడుసార్లు ఓడించింది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే. మూడోసారి ప్రధానిగా హ్యాట్రిక్‌ కొట్టారు నరేంద్రమోదీ. 2004, 2009లో కేంద్రంలో అధికారంలోకొచ్చిన యూపీఏ.. ఆ తర్వాత కమలంపార్టీ ప్రభంజనంతో కకావికలమైంది. మోదీ నాయకత్వంలో బీజేపీ బలంగా ఎదిగింది. విపక్షాలను కలుపుకుని ఇండ కూటమిగా ఏర్పడ్డా అధికారాన్ని అందుకోలేకపోయింది కాంగ్రెస్‌. కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ నినాదంతో ఈ పాతికేళ్లకాలంలో దేశంలో కొత్త రాజకీయానికి తెరలేపింది బీజేపీ.

మూడు దఫాల అధికారంతో దేశంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది ఎన్డీయే సర్కారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు, ట్రిపుల్‌ తలాక్‌ నిషేధం వంటి సంచలనాలతో దశాబ్దాల ఆనవాయితీని మార్చేసింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం మిలీనియం తర్వాత చోటుచేసుకున్న చారిత్రక ఘట్టం. ఎప్పుడో 1528లో ప్రారంభమైన అయోధ్య రామ మందిర వివాదానికి.. 2019లో సుప్రీం తీర్పుతో తెరపడింది. తొలి దశ పనులు పూర్తికావడంతో 2024 జనవరి 22న ప్రధాని మోదీ చేతులమీదుగా.. అయోధ్య ఆలయంలో బాలరాముడి రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. శతాబ్దాల కల సాకారమై భక్తజనంతో అయోధ్య అలరారుతోంది.

ఈ శతాబ్దంలో కాలగర్భంలో కలిసిపోయిన పాతికేళ్లలో దేశంలో అనుకోని విషాదాలు కూడా చోటుచేసుకున్నాయి. దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ జనరల్ బిపిన్ రావత్‌‌‌ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడంతో ఓ షాకింగ్‌ ఘటన. 2021 డిసెంబరు 8న ఊటీ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. అంతకుముందు 2016 డిసెంబరు 4న అన్నాడీఎంకే అధినేత్ర జయలలిత మరణం.. తమిళనాడు రాజకీయాలకు తీరనిలోటుగా మిగిలింది. దేశమాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఈ ఏడాది డిసెంబరు 26న కన్నుమూయటంతో.. దేశం ఓ రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది.

తెలుగు రాష్ట్రాల రాజకీయం. వైఎస్ మరణం. తెలంగాణ ఆవిర్భావం. తెలుగు సినిమాకు పట్టం. సినీ ప్రముఖుల మరణం.

తెలుగురాష్ట్రాల్లో ఈ పాతికేళ్లలో ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉమ్మడి ఏపీ విడిపోయింది ఈ చారిత్రక సమయంలోనే. ఉవ్వెత్తున ఎగిసిన మలి దశ ఉద్యమంతో తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. ప్రజా ఉద్యమంతో అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన చేసింది. ఉద్యమఘట్టంలో, 2014లో ఫిబ్రవరిలో ఉభయసభల్లో బిల్లు ఆమోదించే సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్ర విభజనతో రెండు తెలుగురాష్ట్రాల్లో కొత్త రాజకీయాలకు తెరలేచింది.

2004, 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో కాంగ్రెస్‌పార్టీని అధికారంలోకి తెచ్చిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడం ఈ పాతికేళ్లలో పెద్ద షాకింగ్‌ ఇన్సిడెంట్‌. 2009 సెప్టెంబరు 2న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరిన వైఎస్‌ హెలికాప్టర్‌ అటవీప్రాంతంలో కుప్పకూలింది. ఆయన మరణంతో ఏపీ రాజకీయం మారిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. ఆయన కుమారుడు కాంగ్రెస్‌తో విభేదించి వేరే పార్టీ పెట్టారు. 2019లో ఏపీలో వైసీపీని అధికారంలోకితెచ్చారు. రెండుసార్లు తెలంగాణలో గెలిచిన బీఆర్‌ఎస్‌ స్థానంలో.. పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకొచ్చింది.

పాతికేళ్ల ప్రస్థానంలో పాన్‌ ఇండియా రేంజ్‌కి ఎదిగింది సౌత్‌ ఇండియా సిన్మా. కన్నడ చిత్రం కాంతారాకి జాతీయ అవార్డులు దక్కాయి. బాహుబలి, ట్రిపులార్‌, కల్కిలాంటి తెలుగు సిన్మాలు దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇక పుష్ప పార్ట్‌ టూ అయితే పాత రికార్డులు బద్దలు కొట్టింది. ఇండియన్‌ సిన్మాకి సాధ్యంకాని మ్యాజిక్‌ని తెలుగుసిన్మా సాధించింది. ఆస్కార్‌ వేదికపై టాలీవుడ్‌ సత్తాని ప్రపంచానికి చాటిచెప్పింది ట్రిపులార్‌ మూవీ. నాటునాటు పాటకు ప్రపంచమంతా స్టెప్స్ వేసింది.

మిరాకిల్స్‌ చేసిన తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ కొన్ని విషాదాలను కూడా చూడాల్సి వచ్చింది. ఏడేళ్లు కావస్తున్నా.. అందాల తార శ్రీదేవి మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది తెలుగు సిన్మా. పదహారేళ్లు గడిచినా శోభన్‌బాబు మరణం కూడా అంతే. నాలుగేళ్లక్రితం ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం ఇండస్ట్రీని విషాదంలో ముంచెత్తింది. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణలాంటి ఒకప్పుటి టాప్‌ హీరోలు తమమధ్య లేకపోవడం టాలీవుడ్‌కి తీరని లోటుగా మిగిలింది.

ఈ శతాబ్దంలో గడిచిపోయిన పాతికేళ్లలో ఎన్నో అనుభవాలు మూటగట్టుకుంది ప్రపంచం. తెలుగురాష్ట్రాల్లో, దేశంలో, ప్రపంచంలో ఊహించని పరిణామాలెన్నింటికో గడిచిపోయిన కాలం సాక్షిగా మిగిలిపోయింది.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..