
సాంటా క్లాజ్ అంటే కేవలం పిల్లలకు చాక్లెట్లు ఇచ్చే తాత మాత్రమే కాదు.. ఆయన పుట్టుక వెనుక ఒక సెయింట్ త్యాగం, రాజకీయ వ్యంగ్య చిత్రకారుల సృజనాత్మకత శాస్త్రీయ విశ్లేషణలు కూడా ఉన్నాయి. సాంటా రెయిన్ డీర్ల జెండర్ నుంచి ఆయన పేరు ఎలా మారిందనే వరకు ప్రతి ఒక్కటి ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. ఆ విశేషాలేంటో తెలుసుకోండి.
క్రిస్మస్ సంబరాల్లో సాంటా క్లాజ్ ఒక విడదీయలేని భాగం. కానీ, ఈ రోజు మనం చూస్తున్న సాంటా క్లాజ్ రూపురేఖలు శతాబ్దాల కాలంగా జరిగిన పరిణామాల ఫలితం. దీనికి సంబంధించిన 10 ఆసక్తికర విషయాలు ఇవే:
1. సెయింట్ నికోలస్ నుంచి సాంటా వరకు: సాంటా క్లాజ్ మూలాలు 4వ శతాబ్దపు బిషప్ సెయింట్ నికోలస్‌లో ఉన్నాయి. ఈయన టర్కీలో ఉండేవారు. నిరుపేద అమ్మాయిల పెళ్లిళ్ల కోసం రహస్యంగా డబ్బులు ఇవ్వడం ద్వారా ఆయన బహుమతులు ఇచ్చే సంప్రదాయానికి నాంది పలికారు.
2. చర్చి వ్యతిరేకత: 1951లో ఫ్రాన్స్‌లోని చర్చి అధికారులు సాంటాను తగలబెట్టారు. సాంటా రాక వల్ల క్రిస్మస్ పవిత్రత పోయి, అది వ్యాపారంగా మారుతోందని వారు ఆరోపించారు.
3. ఎర్రటి కోటు రహస్యం: చాలామంది కోకాకోలా ప్రకటనల వల్లే సాంటాకు ఎరుపు రంగు వచ్చిందని నమ్ముతారు. కానీ 1868 నుంచే సాంటా ఎరుపు రంగు దుస్తుల్లో ఉన్న చిత్రాలు అందుబాటులో ఉన్నాయి.
4. రూపాన్ని మార్చిన కార్టూనిస్ట్: థామస్ నాస్ట్ అనే రాజకీయ వ్యంగ్య చిత్రకారుడు సాంటాకు లావుపాటి శరీరం, నార్త్ పోల్ చిరునామా, మరియు మంచి పిల్లలు ఎవరో చూసే అలవాటును కల్పించారు.
5. రెయిన్ డీర్లు అన్నీ ఆడవే: సైన్స్ ప్రకారం, మగ రెయిన్ డీర్లు డిసెంబర్ నాటికి తమ కొమ్ములను కోల్పోతాయి. కానీ సాంటా రెయిన్ డీర్లకు కొమ్ములు ఉంటాయి కాబట్టి, అవన్నీ ఆడవేనని జంతు శాస్త్రవేత్తలు చెబుతారు.
6. రుడాల్ఫ్ రాక: సాంటా బృందంలో ఎర్రటి ముక్కు ఉన్న ‘రుడాల్ఫ్’ రెయిన్ డీర్ 1939లో ఒక ప్రకటన కోసం సృష్టించబడింది.
7. ప్రపంచవ్యాప్తంగా విభిన్న పేర్లు: జర్మనీలో ‘క్రిస్ట్‌కైండ్’, ఫ్రాన్స్‌లో ‘పేరే నోయల్’, బ్రిటన్‌లో ‘ఫాదర్ క్రిస్మస్’ అని సాంటాను రకరకాల పేర్లతో పిలుస్తారు.
8. మిసెస్ క్లాజ్ ఎంట్రీ: 19వ శతాబ్దం వరకు సాంటా బ్రహ్మచారిగానే ఉండేవారు. 1881లో ఒక కవిత ద్వారా మిసెస్ క్లాజ్ పాత్ర పరిచయమైంది. 9. పేరు ఎలా వచ్చింది?: డచ్ భాషలోని ‘సింటర్‌క్లాస్’ అనే పదమే కాలక్రమేణా ఇంగ్లీష్‌లో ‘సాంటా క్లాజ్’గా మారింది.
10. ఇటలీలో సమాధి: సాంటా క్లాజ్ మూలపురుషుడైన సెయింట్ నికోలస్ అవశేషాలు ఇటలీలోని బారి నగరంలోని బాసిలికాలో నేటికీ భద్రంగా ఉన్నాయి.