Diabetes: భారత్‌లో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న డయాబెటిస్‌.. ప్రపంచంలోనే..

|

Nov 14, 2023 | 11:28 AM

భారత్‌లో సుమారు 315 మిలియట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు తేలింది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బయటి ఫుడ్‌ ఎక్కువగా తీసుకోవడం, పారిశ్రామీకరణ, పట్టణ ప్రాంతాలకు వలసవెళ్లడం లాంటి ఎన్నో కారణాలు భారతీయుల్లో డయాబెటిస్‌ పెరగడానికి కారణంగా చెబుతున్నారు. శరరీరంలో తగినంత ఇన్సులిన్‌ ఉత్పత్తి కానప్పుడు, లేదా శరీరం ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌ సరిగా ఉపయోగించలేనప్పుడు షుగర్‌ వ్యాధి వస్తుంది. సరైన ఆహార పద్ధతులు, వ్యాయామం చేయడం వల్ల షుగర్‌ వ్యాధి నుంచి...

Diabetes: భారత్‌లో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న డయాబెటిస్‌.. ప్రపంచంలోనే..
Diabetes
Follow us on

ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతోన్న సమస్యల్లో డయాబెటిస్‌ ఒకటి. డయాబెటిస్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా షుగర్‌ వ్యాధిన పడుతున్నారు. ప్రస్తుతం ఓ అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 422 మిలియన్ల మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లు తేలింది. ఇందులో ఏకంగా 101 మిలియన్ల మందితో భారత్‌ ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలవడం గమనార్హం.

ఇక భారత్‌లో సుమారు 315 మిలియట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు తేలింది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బయటి ఫుడ్‌ ఎక్కువగా తీసుకోవడం, పారిశ్రామీకరణ, పట్టణ ప్రాంతాలకు వలసవెళ్లడం లాంటి ఎన్నో కారణాలు భారతీయుల్లో డయాబెటిస్‌ పెరగడానికి కారణంగా చెబుతున్నారు. శరరీరంలో తగినంత ఇన్సులిన్‌ ఉత్పత్తి కానప్పుడు, లేదా శరీరం ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌ సరిగా ఉపయోగించలేనప్పుడు షుగర్‌ వ్యాధి వస్తుంది. సరైన ఆహార పద్ధతులు, వ్యాయామం చేయడం వల్ల షుగర్‌ వ్యాధి నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

మధుమేహంపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతీ ఏటా నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవంగా జరుపుకుంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా డయాబెటిస్‌ డేను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ‘యాక్సెస్ టు డయాబెటిక్ కేర్’ అనే థీమ్‌తో డయాబెటిస్‌ డేను నిర్వహిస్తున్నారు. ఇదే విషయమై.. హైదరాబాద్‌లోని కిమ్స్‌ హాస్పిటల్‌కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ ప్రవీణ్ కుమార్ కులకర్ణి మాట్లాడుతూ.. ‘మధుమేహం.. మూత్రపిండాల వైఫల్యం, గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలకు కారణంగా మారుతుంది. మధుమేహం వల్ల కళ్లు, రక్త నాళాలు, మూత్రిపిండాలు, నరాలను దెబ్బ తీస్తుంది. కళ్లలోని రక్తనాళాలను దెబ్బతీయడం ద్వారా శాశ్వతంగా దృష్టి కోల్పోయే ప్రమాదం కూడా ఉంద’ని చెప్పుకొచ్చారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా, 422 మిలియన్ల మంది ఈ వ్యాధితో బాధపడుతన్నారన్న ప్రవీణ్‌.. గత దశాబ్దంలో గణాంకాలు రెట్టింపు అయ్యాయి, దీని ఫలితంగా అధిక బరువు, ఊబకాయం వంటి ప్రమాద కారకాలు ఏర్పడతాయని చెప్పుకొచ్చారు. ఈ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తే.. ఈ వ్యాధికి దారితీసే కొన్ని జీవనశైలి విధానాలను నివారించవచ్చని తెలిపారు. ఇక ఇదే విషయమై.. కామినేని హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఎండోక్రినాలజిస్ట్ జి సందీప్ రెడ్డి మాట్లాడుతూ.. ‘డయాబెటిస్ లక్షణాలు అకస్మాత్తుగా వస్తాయి. సాధారణంగా, టైప్ 2 డయాబెటిస్‌లో, లక్షణాలు తేలికపాటివి, గమనించడానికి ఎక్కువ సమయం పడుతుంది. వీటిలో ప్రధానమైనవి.. నిత్యం దాహం వేయడం, అతిగా మూత్ర విసర్జన, దృష్టి మసకబారడం, బరువు తగ్గడం. అలసటగా ఉండడం. టైప్ 1 డయాబెటిస్‌ ఇన్సులిన్‌ లోపం కారణంగా ఏర్పడుతుంది’ అని చెప్పుకొచ్చారు.

ఇక డయాబెటిస్‌ చికిత్స విధానాల గురంచి అమోర్‌ హాస్పిటల్‌ కన్సల్టెంట్‌ జనరల్‌ ఫిజిషియన్‌ అండ్‌ డయాబెటాలజిస్ట్‌ లింగయ్య మాట్లాడుతూ.. ‘టైప్ 2 డయాబెటిస్ ప్రభావాలను నివారించడానికి ముందస్తు రోగ నిర్ధారణ చాలా ముఖ్యం. రెగ్యులర్ చెక్-అప్‌లు, రక్త పరీక్షలు శరీరంలో మధుమేహం యొక్క జాడలను గుర్తించడంలో సహాయపడతాయి. టైప్‌2 డయాబెటిస్‌ లక్షణాలు స్వల్పంగా ఉంటాయి. కానీ కాలక్రమేణా పెరుగుతూ పోతాయి. లక్షణాలు త్వరగా తెలియని కారణంగా.. ఏళ్లు గడిచిన తర్వాత షుగర్‌ వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో చికిత్స ఇబ్బందిగా మారుతుంది’ అని చెప్పుకొచ్చారు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..