
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో క్యాన్సర్ మహమ్మారి ఎలా వస్తుంది.. కారణాలు, క్యాన్సర్‌కు దోహదపడే అంశాల గురించి అవగాహనతో ఉండటం ముఖ్యం.. అందుకే.. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. క్యాన్సర్ కారణాలు, లక్షణాలు, నివారణ, సకాలంలో చికిత్స గురించి అవగాహన పెంచడం దీని ఉద్దేశ్యం. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పేలవమైన జీవనశైలి క్యాన్సర్ కు ప్రధాన కారణాలు.. అంతేకాకుండా.. కొన్ని రోజువారీ అలవాట్లు కూడా క్రమంగా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటి గురించి తెలుసుకోవడం మంచిదని.. దీని ద్వారా ప్రమాదకర పరిస్థితులను అంచనా వేయవచ్చు..
మాక్స్ హాస్పిటల్‌లోని ఆంకాలజిస్ట్ డాక్టర్ రోహిత్ కపూర్.. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే రోజువారీ అలవాట్ల గురించి సవివరంగా వివరించారు. క్యాన్సర్ లక్షణాలు తరచుగా కణితి ఉన్న ప్రదేశం, పరిమాణంపై ఆధారపడి ఉంటాయి. సాధారణ సంకేతాలలో వివరించలేని బరువు తగ్గడం, నిరంతర అలసట, జ్వరం, చర్మం కింద గడ్డలు లేదా వాపులు, దగ్గు తగ్గుముఖం పట్టకపోవడం, ప్రేగు అలవాట్లలో మార్పులు ఉంటాయని చెప్పారు.
ఉరుకులు, పరుగుల జీవితంలో చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్నారు. అలాంటి వాటిలో జంక్ ఫుడ్ ఒకటి.. తరచుగా జంక్ ఫుడ్ తినడం ప్రమాదకరం. ఈ ఆహారాలలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ వాపు, హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. పెద్దప్రేగు, కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరి అని వైద్యులు సలహా ఇస్తున్నారు. అయితే, వారానికి మూడు నుండి నాలుగు రోజులు కూడా వ్యాయామం చేయకపోవడం మీ ఆరోగ్యానికి మంచిది కాదు. వ్యాయామం లేకపోవడం, ఊబకాయం రెండూ క్యాన్సర్‌కు నిశ్శబ్ద కారణభూతాలు. శారీరక శ్రమ లేకపోవడం మీ జీవక్రియను నెమ్మదిస్తుంది.
మీరు మితంగా లేదా అధికంగా మద్యం సేవించినా.. అది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని వైద్యులు అంటున్నారు. ఇది కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. మీరు మద్యం తాగుతున్నట్లయితే, ఇప్పటికైనా మానేయడానికి ప్రయత్నించండి.
తగినంతగా నిద్ర లేకపోవడం కూడా క్యాన్సర్‌కు ప్రమాద కారకంగా పరిగణిస్తారు. నిద్ర లేకపోవడం శరీర కణాల మరమ్మత్తు ప్రక్రియను దెబ్బతీస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
క్యాన్సర్‌ను నివారించడానికి జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకోండి.
కనీసం 7 -8 గంటలు నిద్రపోండి.
నెలకు ఒకటి లేదా రెండుసార్లు కంటే ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ తినకూడదు.
రోజూ వ్యాయామం చేయండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..