Winter: చలిగాలుల ప్రభావంతో న్యుమోనియా ప్రమాదం.. ఈ టిప్స్‌తో చెక్ పెట్టేయండి

చలికాలం వచ్చిందంటే చాలామంది దగ్గు, జలుబు, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడతారు. కానీ ఈ సాధారణ జలుబు కొన్నిసార్లు న్యుమోనియాగా మారి తీవ్ర ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఈ సీజన్‌లో ..

Winter: చలిగాలుల ప్రభావంతో న్యుమోనియా ప్రమాదం.. ఈ టిప్స్‌తో చెక్ పెట్టేయండి
Seasonal Disease

Updated on: Nov 22, 2025 | 10:26 AM

చలికాలం వచ్చిందంటే చాలామంది దగ్గు, జలుబు, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడతారు. కానీ ఈ సాధారణ జలుబు కొన్నిసార్లు న్యుమోనియాగా మారి తీవ్ర ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఈ సీజన్‌లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చల్లని, పొడి గాలి ముక్కు, గొంతులోని తేమను తగ్గించి వైరస్‌లు, బ్యాక్టీరియాలు సులభంగా శ్వాసమార్గాల్లోకి ప్రవేశించేలా చేస్తుంది.

ఈ ఇన్ఫెక్షన్ త్వరగా ఊపిరితిత్తులకు చేరుకుని న్యుమోనియాకు దారి తీస్తుంది. అంతేకాదు, చలి వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గడంతో రోగనిరోధక శక్తి కొంత మందగిస్తుంది. ఇంట్లో కిటికీలు, తలుపులు మూసి ఉంచడంతో గాలి ప్రసరణ తగ్గి, లోపలి గాలిలో వైరస్‌లు ఎక్కువ కాలం నిలిచి ఉంటాయి. ఆస్తమా, COPD, మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవారికి ఈ సమయంలో ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరిగి న్యుమోనియా వచ్చే అవకాశం పెరుగుతుంది.

లక్షణాలు- జాగ్రత్తలు..

కఫంతో కూడిన తీవ్రమైన దగ్దు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం, చలి, రొమ్ము నొప్పి, అలసట, నీరసం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టరును సంప్రదించాలి. ఆలస్యం చేస్తే సమస్య తీవ్రమవుతుంది. బయటకు వెళ్లేటప్పుడు ముక్కు, నోరు కవర్​ అయ్యేలా మఫ్లర్​, మాస్క్​ ధరించాలి. ఇది చల్లని గాలి నేరుగా ఊపిరితిత్తులకు చేరకుండా ఆపుతుంది. తరచూ సబ్బుతో లేదా శానిటైజర్​తో చేతులు కడుక్కోవాలి.

ఇంట్లో రోజూ కొంతసేపు కిటికీలు తెరిచి గాలి బాగా ప్రసరించేలా చూడాలి. చలికాలంలో దాహం తక్కువగా అనిపించినా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం చాలా ముఖ్యం. వెచ్చని నీరు, హెర్బల్ టీ, సూప్‌లు తీసుకోవచ్చు. విటమిన్ సి, జింక్ అధికంగా ఉన్న నారింజ, కివీ, ఉసిరి వంటి పండ్లు, కూరగాయలు, పప్పులు, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ధూమపానం ఊపిరితిత్తులను బలహీనపరుస్తుంది.

న్యుమోనియా ప్రమాదాన్ని బాగా పెంచుతుంది. చలికాలంలో ధూమపానం పూర్తిగా మానేయండి. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ఇన్‌ఫ్లుఎంజా, న్యుమోకాకల్ టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలి. అనారోగ్యంతో ఉన్నవారి నుంచి దూరంగా ఉండాలి. చిన్న జాగ్రత్తలతోనే భయంకరమైన న్యుమోనియా బారిన పడకుండా సురక్షితంగా ఉండొచ్చు.

NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే జారీ చేయబడినవి.. వీటిని మేం దృవీకరించలేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.