Health News: కొంతమంది ఆకలి వేయక బాధపడుతుంటే, మరి కొంతమంది ఎంత తిన్నా తరచూ ఆకలి వేయడం సమస్యగా ఉంటుంది. ఆకలి వేయకపోవడానికి, ఎక్కువుగ ఆకలి వేయడానికి గల కారణాలు వేరు. అయినప్పటికి చాలా మంది ఈ రెండింటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఒక్కోసారి ఎక్కువుగా తింటుంటే మన ఇంట్లో వాళ్లే మనల్ని తిడుతూ ఉంటారు. వీడు అచ్చం తిండిపోతులా ఉన్నాడని అంటుంటారు. కాని మన సమస్య బయటవారికి అర్థం కాదు కదా అందుకే అలా అంటుంటారు. ఒక్కోసారి మధ్య రాత్రి కూడా లేచి ఆకలేస్తుందని.. ఏదో ఒకటి తింటూ ఉంటాం. దీంతో ఒక్కోసారి ఈఆకలేమిటా అని మనపై మనకే కోపం వస్తుంది. ఇలా ఎక్కువుగా ఆకలి వేయడం.. అధికంగా తినడం వంటివి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలకూ దారితీసే అవకాశం ఉంది. ఇలా ఎక్కువుగా ఆకలి ఎందుకు వేస్తుందనే దానిపై భిన్నభిప్రాయాలు ఉన్నాయి. ఒత్తిడి కారణంగా ఎక్కువ ఆకలి వేయవచ్చని కొందరు భావిస్తుంటే.. పోషకాహార లోపం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మనం తినే ఆహారంలో స్వల్ప మార్పులు చేసుకోవడం ద్వారా తరచూ ఆకలి వేసే సమస్యకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు డైటీషియన్స్.
బాదం: బాదంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్‌లతో సమృద్ధిగా ఉంటాయి. బాదంపప్పు తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుందని, ఆహారంలో విటమిన్ E, మోనోశాచురేటెడ్ కొవ్వు మెరుగుపడుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
కొబ్బరి: మనం తినే ఆహారంలో కొబ్బరి సంబంధిత పదార్థాలు తీసుకోవడం ద్వారా తరచూ ఆకలి వేసే సమస్యను నివారించవచ్చు. కొబ్బరిలో ఉండే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్లు క్యాప్రిక్, క్యాప్రిలిక్, క్యాప్రోయిక్, లారిక్ యాసిడ్‌లను కలిగి ఉంటాయి. కొబ్బరిలోని అధిక ఫైబర్ కంటెంట్ సంపూర్ణత్వ భావనను పెంచుతుందని, ఇది అతిగా తినడాన్ని నిరోధించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మొలకలు: మొలకలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నానబెట్టుకుని చాలా మంది మొలకులు తింటుంటాం. మొలకలలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి తీసుకోవడం ద్వారా పూర్తిస్థాయిలో ఆకలి తీరిన అనుభూతిని ఇస్తుంది. మొలకలలో ఉండే ప్రొటీన్ కంటెంట్ మనకు అవసరమైన శక్తినిస్తాయి. ఈపదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. తద్వారా ఎక్కువుగా ఆకలి వేయకుండా ఉండేందుకు మన డైట్ ప్లాన్ లో మొలకలను యాడ్ చేసుకోవడం బెటర్.
మజ్జిగ: మజ్జిగ ప్రోబయోటిక్ యొక్క గొప్ప మూలంగా చెప్పుకోవచ్చు. ఇందులో వెయ్ ప్రొటీన్ అధికంగా ఉంటుంది. మనల్ని ఎక్కువసేపు హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. మజ్జిగలోని అధిక కాల్షియం, ప్రోటీన్ కంటెంట్ లు మనకు అవసరమైన శక్తినిస్తాయి.
వెజిటెబుల్ జ్యూస్ లు: వివిధ కూరగాయలతో తయారు చేసిన రసాలలో యాంటీ ఆక్సిడెంట్ల కంటెంట్ ఎక్కువుగా ఉంటుంది. ముఖ్యంగా అవిసె గింజలతో తయారుచేసిన జ్యూస్ ఎంతో ఆరోగ్యకరం.
మనం తినే రోజూవారి డైట్ లో స్వల్ప మార్పులు చేసుకుని.. పై వాటిని జోడిస్తే ఎక్కువుగా ఆకలివేసే సమస్యకు చెక్ పెట్టొచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..