TV9 War Against Fake News: అందరికీ వ్యాక్సిన్ ఇదే టీవీ 9 నినాదం. కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే అందరూ కచ్చితంగా టీకాలు తీసుకోవాలి. జాగ్రత్తలు పాటించాలి. అయితే, చాలా మందికి వ్యాక్సిన్ పై బోలెడు అపోహలు. సాధారణంగా కొత్తది ఏదైనా వచ్చింది అంటే దానిపై వ్యతిరేకత ఉంటుంది. కానీ, కరోనా వ్యాక్సిన్ విషయంలో అది సరికాదు. కరోనామహమ్మారిని నిలువరించాలంటే టీకా ఒక్కటే ఆయుధం. ఎందుకంటే, కరోనాను మనదాకా రాకుండా చేయగలిగితేనే మనం దానిమీద గెలవగలం. అందుకే అందరికీ వ్యాక్సిన్ అంటోంది టీవీ9. అదే నినాదంతో ప్రత్యేకమైన ప్రచారం నిర్వహిస్తోంది. టీవీ 9 చేపట్టిన ఈ ప్రచారంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే, వ్యాక్సిన్ పై ప్రజల్లో ఉన్న అపోహలనూ తొలగించేందుకు నడుం బిగించింది టీవీ 9. కోవిడ్ వ్యాక్సిన్ పై వస్తున్న రకరకాల వార్తలలో నిజానిజాలను నిగ్గుదేల్చి తప్పుడు వార్తలను ఖండిస్తోంది. ఇదిగో ఇప్పుడు అలంటి తప్పుడు ప్రచారానికి సంబంధించిన వార్తలోని నిజాన్ని మీకు అందిస్తున్నాం.
కరోనా టీకా తెసుకుంటే.. వ్యాధి నిరోధక శక్తి మొత్తం పోతోంది అని ఇటీవల పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. టీకా తీసుకున్నవారు మరణిస్తారని చెబుతోంది ఆ వార్తా విశేషం. అయితే, అది పూర్తిగా తప్పు. అసలు వ్యాక్సిన్ ఏదైనా వ్యాధినిరోధక శక్తిని పెంచడం కోసమే ఉంటుంది. అటువంటిది ఇటువంటి ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. వ్యాక్సినేషన్ పై భయాన్ని పెంపొందిస్తున్నారు. నిపుణులు కూడా దీనిపై ఇదేరకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారు చెప్పినదాని ప్రకారం ఈ వార్తను మొదట తెరపైకి తీసుకు వచ్చింది అమెరికాలోని క్లెవ్‌లాండ్‌లో ఉండే షెర్రీ టెన్పెన్నీ. ఈమె అక్కడ ఓ ఫిజీషియన్. ఆమె అపోహతో ఇటువంటి ప్రచారం చేశారు. ఆటో ఇమ్యూన్ వలన వ్యాక్సిన్ తీసుకున్న తరువాత 42 రోజుల్లో వ్యాధులు వచ్చి ఆసుపత్రిలో చేరుతారనేది ఆమె వాదన. అయితే, కరోనా వ్యాక్సిన్ తొ ఇప్పటివరకూ ఇలా జరిగిన కేసు ఒక్కటీ లేదు. ఆమె చేసిన ఆరోపణలకు ఎటువంటి ఆధారమూ లేదు.
ఇక ఇదే విషయంపై పలువురు నిపుణులు ఈ వాదన పూర్తిగా అసంబద్ధమైనదిగా కొట్టిపాడేశారు.
ఇక మన విషయానికి వస్తే. ఇండియాలో కూడా కరోనా వ్యాక్సిన్ వల్ల ఎవరూ తీవ్రంగా ఇబ్బంది పడిన వారు లేరని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా వ్యాక్సిన్ వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనదేశంలో చాలా తక్కువగా ఉన్నాయని వారు వివరిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారంలో వచ్చే ప్రతి వార్తా నిజం కాదని. ఆ వార్తలను వ్యాపింపచేసే వారి అభిప్రాయాలను ప్రజలందరి మీదా రుద్దే ప్రయత్నం జరుగుతుందనీ వారు చెబుతున్నారు. ఇక కరోనా వ్యాక్సిన్ వలన ఎటువంటి ఇబ్బందీ రాదనీ. వ్యాధి నిరోధకత పాడైపోతుందనేది పూర్తిగా అపోహ అని వారంటున్నారు. అదేవిధంగా ఇటువంటి ప్రచారం ఎవరి దృష్టికైనా వస్తే సంబంధిత నిపుణుల సలహాను తీసుకుని ఆ విషయంపై ఒక నిర్ణయానికి రావాలని సూచిస్తున్నారు.