Vemula Prasanth Reddy : కొవిడ్ నిర్ధారణలో కీలకమైన సి.టి. స్కాన్ టెస్ట్‌కు రెండు వేలు మాత్రమే తీసుకోవాలని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి వ్యాధి తీవ్రతను అంచనా వేయడానికి సి.టి. స్కాన్ టెస్ట్ తప్పనిసరి అయినందున..పేద ప్రజలపై అధిక ఆర్థిక భారం పడుతున్న నేపథ్యంలో ఈ మేరకు ధరను తగ్గించాలని ఆయన అన్నారు. సి.టి. స్కాన్ టెస్ట్ ధరను డయాగ్నోస్టిక్ సెంటర్ లు 2వేల రూ. మాత్రమే తీసుకోవాలని మంత్రి వేముల సూచించారు. ఈ మేరకు ఆయన, నిజామాబాద్ జిల్లా సి.టి. స్కాన్ యాజమాన్యాలను కోరారు. ఈ క్రమంలో ఇందూరు సి.టి. స్కాన్ యజమాని డా.రవీందర్ రెడ్డి, ఆర్మూర్ అమృత లక్ష్మీ సీటీ స్కాన్ డా. జయ ప్రకాష్ తో పాటు పలువురు సి.టి. స్కాన్ సెంటర్ల యజమానులతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. సిద్ధిపేట, సిరిసిల్ల, కరీంనగర్ వంటి జిల్లాలలో సి.టి. స్కానింగ్ కు రెండు వేలు తీసుకుంటున్నారని.. మన జిల్లాలో కూడా ఫిలింతో రెండు వేలు తీసుకోవాలని మంత్రి కోరారు. ప్రస్తుతం ఒక్కో స్కానింగ్ కు నాలుగు నుండి 5 వేలు వసూలు చేస్తున్నారని.. కరోనా కష్ట సమయంలో ప్రజలపై అధిక భారం పడకుండా చూడాలని మంత్రి కోరారు. యాజమాన్యాలతో మాట్లాడిన అనంతరం మంత్రి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, DMHOతో మంత్రి ఫోన్ లో మాట్లాడారు. 2000 రూపాయలకే సి.టి. స్కాన్ చేసేలా ఆయా సెంటర్ల యాజమాన్యాలతో రేపు మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలని మంత్రి వేముల.. కలెక్టర్ DMHO ను ఆదేశించారు.
Read also : Humanity : అనాధ ముస్లిం మహిళకు అంత్యక్రియలు నిర్వహించిన తాడేపల్లిగూడెం సీఐ